రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

త్వరలో ప్రారంభించే హెచ్.యు.ఆర్.ఎల్. కు చెందిన మూడు ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించిన - శ్రీ గౌడ.

ఈ ప్రాజెక్టులు దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని 38.1 లక్షల మెట్రిక్ టన్నుల మేర పెంచుతాయి - శ్రీ గౌడ.

Posted On: 11 AUG 2020 6:16PM by PIB Hyderabad

హిందూస్తాన్ ఊర్వారక్ మరియు రసాయన్ లిమిటెడ్ (హెచ్.యు.‌ఆర్.‌ఎల్) గోరఖ్‌పూర్, బరౌని, సింద్రీలలో  త్వరలో ప్రారంభించే మూడు ప్రాజెక్టుల పురోగతిని, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ ఈ రోజు న్యూఢిల్లీలో  సమీక్షించారు.

హెచ్.యు.‌ఆర్.‌ఎల్. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ గుప్తా మూడు ప్రాజెక్టుల పురోగతిపై సంక్షిప్తంగా వివరించారు.  గోరఖ్‌పూర్, సింద్రీ, బారురానీ ప్రాజెక్టులు ఇప్పటివరకు వరుసగా 80 శాతం, 74 శాతం, 73 శాతం పురోగతిని సాధించాయని ఆయన తెలియజేశారు.  లాక్ డౌన్, ప్రయాణ ఆంక్షలు, కార్మికుల లభ్యత మొదలైన అవాంతరాల కారణంగా ప్రాజెక్టులు ప్రభావితమయ్యాయి.  అయితే, పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగుపడింది.  కోవిడ్ ముందు స్థాయి కంటే 20 శాతం తక్కువగా ఉన్నప్పటికీ, మూడు యూనిట్ల వద్ద పనిని తిరిగి ప్రారంభించడానికి తగినంత కార్మిక సిబ్బందిని సమీకరించడం జరిగింది.  నిర్ణీత గడువు నుండి ఐదారు నెలల వరకు ఆలస్యం అయినప్పటికీ, ఈ మూడు ప్రాజెక్టులు వచ్చే ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతాయని ఆయన హామీ ఇచ్చారు.

కోవిడ్-19 కారణంగా ఎదురౌతున్న సవాళ్ల నుండి వెలువడే ఆలస్యాన్ని భర్తీ చేయడానికి వీలుగా తగిన వేగవంతమైన ప్రణాళికను సిద్ధం చేయాలని శ్రీ గౌడ సూచించారు. 

ప్రయాణాలపై ఆంక్షలు మరి కొంత కాలం కొనసాగుతాయని భావిస్తున్నందున విదేశీ కన్సల్టెంట్లతో అనుసంధానం కావడానికి వీడియో కాన్ఫరెన్సింగు ‌ను ఉపయోగించవచ్చని ఆయన సూచించారు.  ఆయా యూనిట్లలో పనిని తిరిగి ప్రారంభించడానికి హెచ్.యు.ఆర్.ఎల్. యాజమాన్యం చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.  వచ్చే ఏడాది చివరి నాటికి ఈ మూడు ప్రాజెక్టులు ప్రారంభమైన అనంతరం, దేశీయ సామర్థ్యం 38.1 లక్షల మెట్రిక్ టన్నులు పెరుగుతుంది, తద్వారా యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పెంపొందుతుంది.  ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా దేశానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది, విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది, వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం లభిస్తుంది. 

కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్), ఎన్.‌టి.పి.సి. లిమిటెడ్ (ఎన్.‌టి.పి.సి) తో జాయింట్ వెంచర్ గా హిందూస్తాన్ ఉర్వారక్ మరియు రసాయన్ లిమిటెడ్ (హెచ్.యు.ఆర్.ఎల్) 2016 జూన్, 15వ తేదీన ఏర్పాటయింది. ఈ సంస్థకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐ.ఒ.సి.ఎల్) ప్రధాన ప్రమోటర్ గా ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్.సి.ఐ.ఎల్) మరియు హిందూస్థాన్ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌.ఎఫ్.‌సి.ఎల్) రెండు ఇతర భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి.  ఒక్కొక్కటీ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల వార్షిక సామర్ధ్యం ఉన్న గోరఖ్ పూర్, సింద్రీ, బరౌనీ లోని ఎఫ్.సి.ఐ.ఎల్., మరియు హెచ్.ఎఫ్.సి.ఎల్. కు చెందిన మూడు మూతపడిన యూరియా యూనిట్లను హెచ్.యు.ఆర్.ఎల్. ద్వారా భారత ప్రభుత్వం పునఃరుద్ధరిస్తోంది. 

 

*****


(Release ID: 1645232) Visitor Counter : 175