వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత ఉత్పత్తులు ఇతర దేశాలకు అందుబాటులో ఉండాలి
భారత పరిశ్రమ ఒకే తాటిపై నిలబడి అవకాశాలు పొందాలి: శ్రీ గోయల్

Posted On: 10 AUG 2020 5:18PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు ఎఫ్ ఎం సి జి వస్తు సరఫరా  ఐదురోజుల ప్రదర్శనను వర్చువల్ విధానంలో  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్  సంక్షోభం మిగిల్చిన వాస్తవ స్థితిని మనందరం ఆమోదించక తప్పదన్నారు. ప్రపంచం మారిందని, ఈ అనుభవాన్ని ప్రపంచం నేర్చుకోవటంతోబాటు అనంతర పరిస్థితిని ఎదుర్కోవలసిన అవసరాన్ని గుర్తించిందని అన్నారు. " మనం పరిశుభ్రంగా ఉండటం కోసం, సమర్థంగా వ్యవహరించటం కోసం టెద్క్నాలజీని వాడుకుంటున్నాం. మన వ్యాపార కార్యకలాపాలలోనూ మరింత జాగ్రత్తగా, మెలకువతో ఉంటున్నాం" అన్నారు.  కొత్త ప్రపంచపు కొత్త అవసరాలన్నీ భారత భవిష్యత్తును నిర్దేశిస్తాయని పేర్కొంటూ ప్రజల అవసరాలపట్ల, సమాజంలోని  నిరుపేదల పట్ల కూడా జాగ్రత్త పెరుగుతుందన్నారు.

స్వదేశీ పరిశ్రమలకు అండగా నిలబడి దిగుమతులను నియంత్రించటాన్ని కొందరు తప్పుపట్టటాన్ని మంత్రి ఖండించారు. మన పరిశ్రమలను కాపాడుకుంటూ వాటికి సరైన అవకాశాలు లభించేలా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ ప్రపంచదేశాలన్నిటితో సమానమైన, న్యాయబద్ధమైన వ్యాపారాన్ని కోరుకుంటున్నదని ఇది పరస్పర ప్రాతిపదికన ఉండాలని అభిప్రాయపడ్దారు. భారత్ ఆర్ సి ఇ పి లో చేరకపోవటానికి ఈ అసమాన ధోరణి కూడా ఒక కారణమన్నారు. క్రమంగా భారతీయులు తమ ఉత్పత్తులతో వ్యాపార అవకాశాలను పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం విడిభాగాలను కూర్చటం కోసం భారత్ లో పెట్టుబడులు పెట్టాలనుకోవటం ద్వారా దిగుమతి సుంకాల్లో రాయితీలు పొందాలనుకోవటం సరైన ఆలోచన కాదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చి విలువ పెంచే పనులు చేపట్టాలని మంత్రి గోయల్ పిలుపునిచ్చారు.

భారత పరిశ్రమలు మరింత పోటీతత్వం పెంచుకొని అంతర్జాతీయ మార్కెట్ లో దీటుగా నిలబడటానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. " ప్రపంచంతో మనం పరస్పర వాణిజ్యం కోరుకుంటునప్పుడు మనం అతి పేద, అతి బలహీనుడి ముఖాన్ని గుర్తు చేసుకుంటూ, వేసే అడుగు అతడికి ఎంతమేరకు పనికొస్తుందో ఆలోచించాలి" అన్న మహాత్మా గాంధీ మాటలను శ్రీ గోయల్ ఈ సందర్భంగా ఉటంకించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత ఏడేళ్ళుగా తన ధ్యాసనంతా సమాజంలోని నిరుపేదల మీదనే పెట్టారన్నారు. ఆయన ప్రకటించిన అన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలూ అత్యంత బలహీనులైన నిరుపేదలకోసమేనన్నారు.

సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి మెరుగైన, నాణ్యమైన జీవితం అందించే పనులమీదమే ప్రధాని గత ఆరేళ్ళుగా దృష్టి సారించారని శ్రీ గోయల్ అభిప్రాయపడ్దారు. 11 కోట్ల మరుగు దొడ్ల నిర్మాణం, దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం బ్రాడ్ బాండ్ అందించటం, అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడటం ఉమ్మడిగా పేదల జీవితాల స్వరూపస్వభావాలనే మార్చి వేశాయన్నారు. జాతి ముఖచిత్రాన్నే మార్చి, ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడని ఇలాంటి ఆరోగ్య సంక్షోభాలమీద పోరాడేందుకు కూడా ప్రజలను సిద్ధం చేసిందన్నారు. ప్రధాని స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోగలిగామని చెబుతూ పరిశ్రమ అందించిన సహకారం కూడా అందులో భాగమన్నారు.  భారత్ లో అమలు చేసింది  ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్ డౌన్  అని కూడా అభివర్ణించారు. దేశం నలుమూలలా ప్రజలకు ఆహారం తదితర నిత్యావసరాలు అందించగలిగామని చెబుతూ, రైల్వేలు, ఆహార పంపిణీ విభాగం సమన్వయంతో పనిచేసి లాక్ డౌన్ సమయంలో ఆహారం, ఎరువులు, పాలు తదితర అవసరాలను తీర్చగలిగాయన్నారు.

ఫిక్కీ చేపట్టిన ఈ కార్యక్రమం స్వదేశీ వేదికమీద సాగుతోందని చెబుతూ. ఇది  నిజమైన ఆత్మ నిర్భర్ భారత్ ను ప్రతిబింబిస్తున్నదన్నారు. కోవిడ్ సంక్షోభం తెచ్చిన మార్పులు అనేక సానుకూల అంశాలకు దారితీశాయని, మారుమూల ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసుకోవటానికి, దేశవ్యాప్తంగా ప్రజలను ఇందులో భాగస్వాములను చేయటానికి వీలైందని అన్నారు.  మార్పును మనం సొంతం చేసుకునే కొద్దీ, మానవాళి అభివృద్ధిని ముందుకు తీసుకు వెళ్లగలుగుతున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. మనం చేస్తున్న పని భారత అభివృద్ధిని పునర్నిర్వచిస్తున్నదని కూడా అభిప్రాయపడ్దారు. కోట్లాది మందికి పనిచేసే అవకాశం కల్పిస్తూ ప్రపంచ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయగలుగుతున్నామన్నారు.

భారత్ లో ఆర్థికాభివృద్ధి మళ్ళీ గాడిలో పడుతోందని గోయల్ అన్నారు. వివిధ సూచిల ద్వారా అది స్పష్టమవుతోందని చెప్పారు. రైళ్ళలో సరకుల రవాణా, విద్యుత్ వినియోగం లాంటివి నిరుటి స్థాయికి చేరుకున్నాయని, ఈ ఏడాది జులై లో ఎగుమతులు నిరుడు ఇదే నెలలో జరిగిన ఎగుమతులలో 91% ఉండటం అందుకు ఉదాహరణగా అభివర్ణించారు.  దిగుమతులు కూడా దాదాపు 79% ఉన్నాయన్నారు. సమృద్ధ భారత్ సాధించే దిశగా కలిసి నడుద్దామని, పరస్పరం అండగా ఉందామని, భవిష్యత్ తరాలకు మెరుగైన భారత్ ను అందిద్దామని మంత్రి భారత పారిశ్రామిక రంగానికి పిలుపునిచ్చారు.

 

***(Release ID: 1644967) Visitor Counter : 49