ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఈ-సంజీవని ప్రాచుర్యంలో రాష్ట్రాలపాత్రను ప్రశంసించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్

ఈ-సంజీవని, ఈ సంజీవని ఒపిడి ద్వారా
1.5 లక్షల టెలీ కన్సల్టేషన్లు పూర్తి

Posted On: 09 AUG 2020 5:38PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన టెలీమెడిసిన్ సేవల పనితీరును కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ ఈ రోజు సమీక్షించారు. ఈ-సంజీవని, ఈ సంజీవని ఒపిడి వేదికల ద్వారా ఒకటిన్నర లక్షల టెలిమెడిసిన్ కన్సల్టేషన్స్ పూర్తయిన సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో మంత్రి ఈ రోజు ఈ సమీక్ష చేపట్టారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ కుమార్ చౌబే , తమిళనాడు ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ కూడా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

అతి తక్కువ సమయంలో 2019 నవంబర్ నుంచి ఇప్పటి వరకు దేశ జనాభాలో 75% మందికి సేవలందిస్తూ 23  రాష్ట్రాలు ఈ- సంజీవని, ఈ సంజీవని ఒపిడి వేదికలతో టెలీ కన్సల్టేషన్ సేవలందిస్తూ ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం చేపట్టే పనిలో ఉన్నాయి. రోగులు, డాక్టర్లు ఇళ్లలో నుంచే సంప్రదింపులు జరపటానికి వెసులుబాటు కలిగించే ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు లక్షన్నర మంది లబ్ధి పొందారు. ఇది ఒక మైలురాయిగా మంత్రి అభివర్ణించారు.


ఈ సాధన పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.  గౌరవ ప్రధాని మార్గదర్శకత్వంలో బ్రాడ్ బాండ్, మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ ఇండియా విజన్ ను ఆయుష్మాన్ భారత్- వెల్ నెస్ కేంద్రాలలో అమలు చేయటం ప్రారంభించామని చెప్పారు.   రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో నిస్వార్థపూరితమైన వైద్యులు, నిపుణుల  సాయంతో ఈ-సంజీవని లాంటి టెలిమెడిసిన్  వేదిక ద్వారా ఆరోగ్య రక్షణ సేవలు అందించగలిగామన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ఆరోగ్య మౌలిక సదుపాయాలకు ఇది ఎంతగానో సహాయం చేసిందని అన్నారు. 
మంత్రి వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవిస్తూ శ్రీ అశ్విని చౌబే ఈ పథకం గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సేవల రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తెస్తుందన్నారు. గ్రామాలలోని వారికి నగరాల్లో ఉండే స్పెషలిస్టులు అందుబాటులోకి రావటం గొప్పవిషయమన్నారు.
ఈ-సంజీవని వేదిక రెండు రకాల టెలి మెడిసిన్ సేవలు అందించగలిగింది. డాక్టర్లు-డాక్టర్లు సంప్రదించుకోవటానికి ఈ-సంజీవని ఉపయోగపడగా,  రోగి-డాక్టర్ సంప్రదింపులకు ఈ-సంజీవని ఒపిడి టెలి కన్సల్టేషన్లకు పనికొచ్చింది.  డాక్టర్ల సంప్రదింపులకు మొదటి పద్ధతి పనికి రాగా, దీన్ని ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ కార్యక్రమం కింద చేపట్టారు. మొత్తం 1.5  లక్షల హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లలో 2022 డిసెంబర్ టెలి మెడిసిన్ సేవలు అందించాలని నిర్ణయించారు. వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రులలో  పూర్తికాలపు హబ్స్ ను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఇక్కడే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో టెలీ కన్సల్టేషన్లు జరుగుతాయి. ఇప్పటివరకు ఈ హాతీయ ఈ-వేదికను వాడుకోవటానికి కమ్యూనిటీ వైద్యాధికారులు, డాక్టర్లు సహా 12,000 మందికి శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం పది రాష్ట్రాల్లోని 3,000 కి పైగా కేంద్రాల్లో టెలిమెడిసిన్ సేవలు అందిస్తున్నారు. 
ఇప్పుడు సాగుతున్న కోవిడ్ సంక్షోభం కారణంగా ఆరోగ్య మంత్రిత్వశాఖ రెండో టెలీ కన్సల్టేషన్ సర్వీస్ ప్రారంభించింది. ఉచితంగా రోగులు- డాక్టర్లు మాట్లాడుకునే ఈ ఆరోగ్య సేవలు  క్రమంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ఆ క్రమంలోనే దాదాపు 20 రాష్ట్రాలు ఈ సేవలు వినియోగించుకుంటున్నాయి. స్వయంగా డాక్టర్ దగ్గరికి భౌతికంగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రజలకు ఈ సేవలు అందుబాటులో ఉండటం దీని ప్రత్యేకత. ఈ -సంజీవని ఒపిడి కోసం 2800  మంది డాక్టర్లు శిక్షణ పొందారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ దాదాపు 250 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఈ సేవల్లో పాల్గొన్నారు. ప్రయాణించాల్సిన అవసరం లేకుండా లాగిన్ చేసి ఐదు నిమిషాలు లైన్లో ఉంటే డాక్టర్ అందుబాటులో ఉండటం ఇందులో ప్రత్యేకత. 
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,58,000 టెలి కన్సల్టేషన్లు అందించారు. వాటిలో 67,000 ఈ-సంజీవని ద్వారా అందించగా 91,000 మంది రోగులు  -డాక్టర్ల ఈ-సంజీవని ఒపిడి సంప్రదింపులు.  ప్రస్తుతం రెండు పద్ధతుల్లోనూ కలిసి సగటున రోజుకు 5,000 కన్సల్టేషన్లు జరుగుతున్నాయి. ఈ సంప్రదింపుల వేదికల సామర్థ్యాన్ని 5 లక్షలకు పెంచాలని భావిస్తున్నారు.
టెలిమెడిసిన్ వేదిక 40 ఆన్ లైన్ ఒపిడి లు నిర్వహిస్తుండగా ఇందులో సగానికి పైగా స్పెషాలిటీలకు సంబంధించినవి. అందులో గైనకాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఇ ఎన్ టి, ఆప్తాల్మాలజీ, ఎయిడ్స్. ఎచ్ ఐ వి పేషెంట్స్ కోసం యాంటీ రెట్రోవియల్ థెరపీ, నాన్ కమ్యూనికల్ డిసీజెస్ ఉన్నాయి.
ఈ-సంజీవని, ఈ-సంజీవని ఒపిడి ద్వారా అత్యధికంగా కన్సల్టేషన్ సేవలు అందుకున్న రాష్ట్రాలు తమిళనాడు (32,035), ఆంధ్రప్రదేశ్ (28,960), హిమాచల్ ప్రదేశ్ (24,527), ఉత్తర ప్రదేశ్ (20,030), కేరళ (15,988), గుజరాత్  (7127), పంజాబ్ (4450), రాజస్థాన్ (3548), మహారాష్ట్ర (3284) ఉత్తరాఖండ్  (2596). డాక్టర్-డాక్టర్ కన్సల్టేషన్ లో మెజారిటీ వాటా ఆంధ్రప్రదేశ్ (25,478),  హిమాచల్ ప్రదేశ్ (23,857) ది కాగా, రోగి-డాక్టర్ కన్సల్టేషన్స్ లో తమిళనాడు 32,035 ఒపిడి కన్సల్టేషన్స్ తో ముందుంది. 
ఈ-సంజీవని, ఈ-సంజీవని ఒపిడి సేవలు వాడుకుంటున్న రాష్ట్రాలను ఈ చర్చల సందర్భంగా మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టెలిమెడిసిన్ సేవల ద్వారా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అందిస్తున్న అందిస్తున్న సహకారానికి తమిళనాడు ఆరోగ్య శాఖామంత్రి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అత్యధికంగా 32,035 ఒపిడి కన్సల్టేషన్లతో  తమ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమ రాష్ట్రంలో పాటించిన కొన్ని ఉత్తమ విధానాలను ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అన్ని పంచాయితీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ-సంజీవని అమలు చేయటం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఈ-ఒపిడి ల ద్వారా అనేక స్పెషాలిటీ సేవలు అందించటం గురించి ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్ లో ఈ సేవలు మొదలైన కేవలం నెలరోజుల్లోనే 20,030  కన్సల్టేషన్లు జరపటం తన ప్రత్యేకతగా చెప్పుకుంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒక జైలులో టెలిమెడిసిన్ సేవలు విజయవంతంగా అమలు చేయటం కూడా చర్చకు వచ్చింది.


కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సి-డాక్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ డాక్టర్ పికె ఖోస్లా, సి-డాక్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ సూద్, ఆరోగ్య కార్యదర్శులు, వివిధ రాష్ట్రాల  సీనియర్ అధికారులు డిజిటల్ విధానంలో పాల్గొన్నారు.

****



(Release ID: 1644626) Visitor Counter : 228