వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

మేక్ ఇన్ ఇండియా ఉత్ప‌త్తుల‌పై క‌స్ట‌మ‌ర్ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌వ‌ల‌సిందిగా ట్రేడ‌ర్ల‌కు సూచించిన కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్‌
లాక్ డౌన్ స‌మయంలో వారి పాత్ర‌ను అభినందించిన గోయ‌ల్‌

త్వ‌ర‌లోనే జాతీయ ట్రేడ‌ర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు

Posted On: 09 AUG 2020 2:29PM by PIB Hyderabad

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్ర‌చారానికి సంపూర్ణంగా త‌మ వంతు స‌హ‌కారం అందించాల‌ని కేంద్ర వాణిజ్య , ప‌రిశ్ర‌మ‌లు, రైల్వే శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయ‌ల్ ట్రేడ‌ర్ల‌ను  కోరారు.  ఈరోజు జాతీయ వ‌ర్త‌క‌దినోత్స‌వం సంద‌ర్భంగా  వ‌ర్చువ‌ల్ స‌మావేశం ద్వారా ఆయ‌న వర్త‌కుల‌నుద్దేశించి మాట్లాడుతూ , ఇండియాలో త‌యారైన ఉత్ప‌త్తుల‌ను కొనాల్సిందిగా క‌స్ట‌మ‌ర్ల‌ను చైత‌న్య‌వంతం చేసే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆయ‌న వారిని కోరారు. మ‌నతో స్నేహ‌సంబంధాలు లేని దేశాల‌నుంచి నాసిరకం ఉత్ప‌త్తులు దిగుమ‌తి చేసుకుంటున్న ట్రేడ‌ర్ల చ‌ర్య‌ల తీరును బ‌య‌ట‌పెట్టాల‌ని  అందుకు చైత‌న్య‌వంతులుగా ట్రేడ‌ర్లు కృషి చేయాల‌ని ఆయ‌న కోరారు.

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప్రచారం వ‌ల్ల వ‌ర్త‌కులు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం పొందుతార‌ని ఆయ‌న తెలిపారు. ఇండియాలో త‌యారైన ,మంచి నాణ్య‌త‌గ‌ల వ‌స్తువులు ఆర్థిక వ్వవ‌స్థ‌లో పెద్ద సంఖ్య‌లోకి వ‌చ్చి చేరితే ధ‌ర‌లు త‌గ్గుతాయ‌ని, దీనితో ఇవి అంత‌ర్జాతీయ మార్కెట్‌లో పోటికి నిల‌బ‌డ గ‌ల‌గుతాయ‌ని పియూష్ గోయ‌ల్ తెలిపారు. ఇది మ‌రిన్ని ఉపాధి అవ‌కాశాల‌కు , ప్ర‌జ‌ల సుసంప‌న్న‌త‌కు , ప్ర‌జ‌ల‌కు మ‌రింత కొనుగోలుశ‌క్తి పెర‌గ‌డానికి ఉప‌క‌రిస్తుంద‌ని చెప్పారు.  దిగుమ‌తి చేసుకునే చాలా వ‌స్తువుల‌పై ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆంక్ష‌లు విధించింద‌ని ఇలాంటివి దేశంలో సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు.  అగ‌ర్‌బ‌త్తీలు, క్రీడా ఉప‌క‌ర‌ణాలు, టివి, టెలిపోన్‌, టైర్లు వంటివి ఇందులోకి వ‌స్తాయి. సుమారు ప‌ది వేల  కోట్ల రూపాయ‌ల విలువ‌గ‌ల దిగుమ‌తుల‌కు బ‌దులుగా దేశీయ ఉత్ప‌త్తులు వాడ‌వ‌చ్చని పియూష్ గోయ‌ల్ అన్నారు. స్థానిక ఉత్ప‌త్తులు వినియోగించాల్సిందిగా బ‌లంగా ప్ర‌చారం చేయాల‌ని, ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చిన‌ట్టుగా , ఓక‌ల్ ఫ‌ర్ లోక‌ల్ ‌నినాదాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌ని ఆయ‌న కోరారు.

 కోవిడ్ మ‌హ‌మ్మారి స‌మ‌యంలో ట్రేడ‌ర్లు నిర్వ‌ర్తించిన పాత్ర‌ను శ్రీ పియూష్ గోయ‌ల్ కొనియాడారు. ప‌రిస్థ‌తుల‌కు త‌గిన‌ట్టుగా స్పందించి దేశంలోని ప్ర‌తి మారుమూల ప్రాంతానికీ అత్యావ‌శ్య‌క స‌రుకులు అందుబాటులో ఉండే విధంగా ట్రేడ‌ర్లు చూశార‌ని ఆయ‌న కొనియాడారు.  క్లిష్ట‌స‌మ‌యంలో ట్రేడ‌ర్లునిర్వ‌ర్తించిన పాత్ర‌ను ప్ర‌ధాన‌మంత్రి సైతం గుర్తించార‌ని, దీనినే త‌మ మ‌న్ కీ బాత్ ప్ర‌సంగంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించార‌ని చెప్పారు. వినియోగ‌దారుడికి, ఉత్ప‌త్తి దారుడికి మ‌ధ్య ట్రేడ‌ర్ కీల‌క వార‌ధిగా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు..

.ట్రేడ‌ర్లు వివిధ బృందాలుగా ఏర్ప‌డి దేశంలోని వివిధ ప్రాంతాల‌నుంచి, వివిధ ట్రేడ్ ల‌నుంచి  సూచ‌నలు  స్వీక‌రించాల్సిందిగా  ఆయ‌న  కోరారు. ఒక సైజు అంద‌రికీ ప‌ట్ట‌న‌ట్టే , వివిధ రంగాల‌కు సంబంధించి ప్రత్యేక సిఫార్సులు చేయాల్సిందిగా ఆయ‌న వారిని కోరారు. ఈ సిఫార్సుల‌న్నింటి ప‌ట్ల ప్రభుత్వం ఉదారంగా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఆన్‌లైన్ ద్వారా లైసెన్సుల జారీ, లైసెన్సు ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు, లైసెన్సు కాలానికి ఎక్కువ వ్య‌వ‌ధి ఉండేట్టు చూడ‌డం,  క్రిమిన‌ల్ నేరాలుగా ‌ప‌రిగ‌ణించ‌కుండా ఉండే విధంగా చ‌ట్టాల‌లో మార్పులు, చ‌ట్టాన్ని అమ‌లు చేసే అధికార యంత్రాంగానికి విచ‌క్ష‌ణాధికారాల తొల‌గింపు, నిబంధ‌న‌లు సుల‌భ‌త‌రం చేయ‌డం వంటివి ట్రేడ‌ర్ల డిమాండ్లుగా ఉన్నాయి. అయితే మొసాల‌కు పాల్ప‌డే వారిని ఒంటరి చేయాల‌ని ,లేకుంటే , మొత్తం ట్రేడ‌ర్ల‌స‌మాజానికే చెడ్డ పేరు వ‌స్తుంద‌ని , ప్ర‌భుత్వం అందించే రాయితీలు, ప్ర‌యోజ‌నాలు దుర్వినియోగం అవుతాయ‌ని ఆయ‌న అన్నారు.

వ‌ర్త‌కుల‌కు తాము  అండ‌గా ఉంటామ‌ని చెబుతూ శ్రీ పియూష్ గోయ‌ల్‌, వ‌ర్త‌కుల కోసం ప్ర‌భుత్వం ప‌లు రాయితీలు ప్ర‌క‌టించింద‌ని,ఇందులో చాలావ‌ర‌కు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన ఆత్మనిర్భ‌ర్ పథ‌కంలో ఉన్నాయ‌ని అన్నారు. రైల్వేలు కూడా ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నాయ‌ని, పార్శ‌ల్ రైళ్లు ,కిసాన్ ట్రైన్‌, స‌ర‌కు ర‌వాణా రైళ్ల వేగం పెంపు, గూడ్సు షెడ్‌ల స్థాయి పెంపు, వివిధ రైల్వే ఆఫీసుల‌లో బిజినెస్ డ‌వ‌ల‌ప్‌మెంట్ సెల్ ల ఏర్పాటు, వంటి ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు చెప్పారు. ఇవి స‌ర‌కులు స‌త్వ‌రం , త‌క్కువ ఖ‌ర్చుతో ర‌వాణా చేయ‌డానికి ఉప‌క‌రించాయ‌ని ఆయ‌న చెప్పారు.
 
త్వ‌ర‌లోనే జాతీయ ట్రేడ‌ర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు శ్రీ గోయ‌ల్ తెలిపారు. ట్రేడ‌ర్ల పెన్ష‌న్ ప‌థ‌కంలో త‌మ ఉద్యోగుల‌ను కూడా చేర్చాల్సిందిగా ఆయ‌న వారిని కోరారు. ప్ర‌భుత్వ ప్రొక్యూర్‌మెంట్ పోర్ట‌ల్ జిఇఎం లో చేరాల్సిందిగా ట్రేడ‌ర్ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు.

 

******(Release ID: 1644583) Visitor Counter : 68