ఆర్థిక మంత్రిత్వ శాఖ

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము బాధ్యతలు

Posted On: 08 AUG 2020 4:21PM by PIB Hyderabad

భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌గా శ్రీ గిరీష్ చంద్ర ముర్ము బాధ్యతలు స్వీకరించారు. ఆయన గుజరాత్‌ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. శ్రీ రాజీవ్‌ మెహ్రిషి శుక్రవారం పదవీ విరమణ చేసిన నేపథ్యంలో, ఆయన స్థానంలో జి.సి.ముర్ము నియమితులయ్యారు. ఈ బాధ్యతలకు ముందు, జమ్ము&కశ్మీర్‌ తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ముర్ము సేవలు అందించారు. 

    రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, శ్రీ ముర్ము చేత కాగ్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌, పూర్వ కాగ్‌ శ్రీ రాజీవ్‌ మెహ్రిషి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

    ప్రమాణ స్వీకారం ముగియగానే శ్రీ ముర్ము కాగ్‌ కార్యాలయానికి వెళ్లారు. సీనియర్‌ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కార్యాలయంలోని మహాత్మాగాంధీ, డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహాలకు ముర్ము పుష్ప నివాళి అర్పించారు.

    జమ్ము&కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా వెళ్లకముందు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ సంయుక్త కార్యదర్శిగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రెవెన్యూ అదనపు కార్యదర్శిగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎక్స్‌పెండిచర్‌ పూర్తిస్థాయి కార్యదర్శిగా ముర్ము పనిచేశారు. దిల్లీకి రావడానికి ముందు గుజరాత్‌ ప్రభుత్వంలో ముఖ్య కార్యకలాపాలు నిర్వర్తించారు. పరిపాలన, ఆర్థిక, మౌలిక సదుపాయాల రంగాలలో శ్రీ ముర్ముకు విశేష అనుభవం ఉంది.

***



(Release ID: 1644427) Visitor Counter : 167