రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ – లడఖ్ లలో శాంతి, పురోగతి & సౌభాగ్యాల కొత్త యుగం ఉదయించింది: రోడ్లు & రహదారుల సమాహారంతో అభివృద్ధికి ఊతం

Posted On: 07 AUG 2020 1:21PM by PIB Hyderabad

ఈ దిగువన ఉన్నది సీనియర్ జర్నలిస్టు, ప్రసార భారతి బోర్డు సభ్యుడు శ్రీ అశోక్ టాండన్ రాసిన వ్యాసం. శీర్షిక ‘జమ్మూ కాశ్మీర్ – లడఖ్ లలో శాంతి, పురోగతి & సౌభాగ్యాల కొత్త యుగపు ఉషోదయం: అభివృద్ధికి ఊతమివ్వడానికి రోడ్లు & రహదారుల సమాహారం’:

 

భారతీయ జన సంఘ్ (భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం) వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారత దేశంలో జమ్మూ & కాశ్మీర్ పూర్తి స్థాయి విలీనాన్ని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సత్యాగ్రహం (అహింసాయుత ఆందోళన) చేపట్టి జీవితాన్నే త్యాగం చేశారు.

 

1953 మే 10న డాక్టర్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వ ప్రవేశ అనుమతి ఉత్తర్వులను ధిక్కరించి అరెస్టయ్యారు. ‘‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నహీ చలేగే’’ (ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు పతాకాలు ఉండకూడదు) అని నినదించారు.

 

ఆయనను శ్రీ నగర్ జైలుకు తరలించారు. అక్కడ ఆయన అనుమానాస్పద పరిస్థితుల మధ్య 1953 జూన్ 23న మరణించారు.

 

గుజరాత్ నుంచి ఓ రెండో తరం పార్టీ నాయకుడు తన పార్టీని కేంద్రంలో సొంత బలంమీద పూర్తి మెజారిటీతో అధికారంలోకి తెస్తాడని, తన లక్ష్యాన్ని నెరవేరుస్తాడని డాక్టర్ ముఖర్జీ అప్పుడు ఊహించి ఉండరు.

 

భారత రాజ్యాంగంలోని 370 అధికరణం కింద జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ. ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఉపసంహరించుకుంది. దీంతో ఆ రాష్ట్ర ప్రజలు అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి...  కనీస వేతన చట్టం & మైనారిటీ చట్టం సహా బలహీనవర్గాలకు రిజర్వేషన్ హక్కు, విద్యా హక్కు, సమాచార హక్కు కల్పించే అన్ని చట్టాల ప్రయోజనాలు పొందడానికి అవకాశం లభించింది.

 

రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించిన అన్ని నియమాలనూ నిర్వీర్యం చేసిన చారిత్రక రాష్ట్రపతి ఉత్తర్వును అనుసరించి మరో మైలురాయి వంటి, వ్యూహాత్మకంగా ముఖ్యమైన రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 వచ్చింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా (జమ్మూ & కాశ్మీర్, లడఖ్) విభజించింది.

 

అప్పటి నుంచి గత ఒక్క సంవత్సరంలో ఎన్డీయే ప్రభుత్వం పలు దిక్కుల నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. సరిహద్దు భద్రత, జమ్మూ కాశ్మీర్ అంశంపైన అంతర్జాతీయ సమాజంతో నిర్మాణాత్మక వ్యవహరం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడానికి దేశీయంగా ఉన్న రాజకీయ వ్యతిరేకత వంటి సవాళ్లు వాటిలో ఉన్నాయి.

 

ఆ తర్వాత అక్కడ బ్రహ్మాండమైన సవాలు.. ప్రజల శాంతి, సౌభాగ్యం, సంక్షేమాలకు భరోసా ఇస్తూ సమగ్ర అభివృద్ధిని వేగవంతంగా చేయడం. మూడు ప్రాంతాల్లోనూ అవినీతి రహిత పాలనను అందించడం.

 

కేంద్ర ప్రభుత్వం ఈ సవాళ్లను.. గత ఏడు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పాలించిన కుటుంబ పార్టీలు ఆర్టికల్ 370 పేరిట జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజలకు చేసిన ద్రోహాన్ని.. సరిదిద్దే అవకాశంగా మార్చివేసింది.

 

ఈ చారిత్రక ప్రయాణంలో భాగం కావాలని, సమున్నతమైన లక్ష్యంకోసం కలసి నడవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ ప్రాంత యువతకు.. మరీ ముఖ్యంగా కాశ్మీర్ లోయలో దారి తప్పిన శక్తులకు వ్యక్తిగతంగా చేసిన విన్నపం క్షేత్ర స్థాయిలో సాదృశ్యమైన ఫలితాలను చూపించింది.

 

జమ్మూ & కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలు రెండూ (జమ్మూ & కాశ్మీర్ శాశ్వతంగా కాదు) నేరుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండటం వల్ల.. మోదీ ప్రభుత్వం ఆయా ప్రాంతాల శాంతి, పురోగతి కోసం ఆశావహమైన కార్యాచరణ ప్రణాళికను ఆవిష్కరించింది. ఆ మొత్తం ప్రాంతంలో సమ్మిళిత అభివృద్ధి, పరిపాలనలో పారదర్శకత లతో కొత్త శకం ఆరంభమైంది.

 

టీమ్- మోదీ అత్యాధునిక మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఒక సమీకృత విధానాన్ని అవలంబించింది. అనేక ఫాస్ట్ – ట్రాక్ సంక్షేమ పథకాలను, ఉపాధి కల్పించే పథకాలను, కార్యక్రమాలను ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న, మధ్య & సూక్ష్మ తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఇ)లలో కుటీర, హస్త కళల, చేనేత, ఉద్యాన పరిశ్రమలు ఉన్నాయి. మూడు ప్రాంతాల్లోనూ అణగారిన వర్గాల సామాజిక- ఆర్థిక విమోచన, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలుగా ఈ కార్యక్రమాలు అమలవుతున్నాయి.

 

మూడు ప్రాంతాల మధ్య, ఒకే ప్రాంతంలోని వివిధ ప్రదేశాల మధ్య గతంలో లోపించిన అనుసంధానం విషయంలో ఇటీవల చాలా ప్రగతి సాధించారు. విభజన అనంతర కాలంలో అన్ని వాతావరణాలకూ సరిపడే నాణ్యతతో రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించారు.

 

ఇచ్చిన హామీల అమలులో గత ఏడాది కాలంగా సాధించిన ప్రగతిపై ప్రాంతాలవారీగా సమీక్షలో సంతృప్తి సుస్పష్టం. అయితే, నడుస్తున్న ప్రాజెక్టులన్నీ పూర్తయినప్పుడు ఈ సుందర ప్రదేశం ముఖచిత్రంలో పూర్తి మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా సొరంగ మార్గాలు సహా కొన్ని వ్యూహాత్మకంగా ముఖ్యమైన జాతీయ రహదారులు ఆ ప్రాజెక్టులలో ఉన్నాయి.

 

కాశ్మీర్ : కశ్యప మహర్షి నడయాడిన నేల

కాశ్మీర్ పైన పలు గ్రంధాలు రాసిన ప్రముఖ ఆస్ట్రేలియన్ పరిశోధకుడు – రచయిత క్రిస్టోఫర్ స్నెడ్డెన్ ప్రకారం... రాష్ట్రం పేరు ‘కశ్యప్ మిర్’ (రుషి కశ్యపుడి సరస్సు)కు సంక్షిప్త రూపం అయి ఉండొచ్చు.

ప్రఖ్యాత భారతీయ సూఫీ కవి, స్కాలర్ అమీర్ ఖుస్రో కాశ్మీర్ అందాన్ని ఈ కింది పదాల్లో వర్ణించారు:

అగర్ ఫిర్దౌస్ బార్ రూ-ఎ జమీన్ అస్త్,

హమీన్ అస్త్- ఒ హమీన్ అస్త్- ఒ హమీన్ అస్త్.

(ఒకవేళ నేలపై స్వర్గం ఉంటే.. అది ఇక్కడే, అది ఇక్కడే)

 

కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం ఎప్పుడూ జీవనాధారంగా ఉంది. మౌలిక సదుపాయాల పెంపుదల ఈ రంగం విజయంలోనూ, లోయ నుంచి ఎగుమతుల ప్రోత్సాహానికీ కీలకం కానుంది.

 

కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ తన సంస్థలైన నేషనల్ హైవే అధికారిటీ ఆఫ్ ఇండియా (ఎన్.హెచ్.ఎ.ఐ), ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్.ల ద్వారా.. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ), రాష్ట్ర పి.డబ్ల్యు.డి. విభాగాలతో కలసి అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉంది. అవి అభివృద్ధికి ఊతమివ్వనున్నాయి. పట్టు పురుగుల పెంపకం, కోల్డ్ వాటర్ ఫిషరీస్, చెక్క పని, క్రికెట్ బ్యాట్ల తయారీ, కుంకుమ పువ్వు, హస్త కళలు, ఉద్యాన ఉత్పత్తులను మరింతగా పెంచడం లక్ష్యంగా ఉత్పత్తి కంపెనీలను ఏర్పాటు చేయడానికి స్టార్టప్ లకు ఈ మౌలిక సదుపాయాలు ఉపయోగపడతాయి.  

 

కొనసాగుతున్న ప్రాజెక్టులలో శ్రీనగర్ – జమ్ము – లఖన్ పూర్ రహదారి, కాజీగుండ్ – బనిహాల్ సొరంగ మార్గం, శ్రీనగర్ రింగ్ రోడ్డు ఉన్నాయి.

 

జమ్ము:

ఇది అందమైన దేవాలయాల నగరం. గతంలో ‘జంబూపుర’గా పేరు పొందినది. తావి నది ఒడ్డున బహు కోటను  నిర్మించిన బహు లోచన్ సోదరుడు రాజా జంబు లోచన్ కు రాజధాని ఈ నగరం. ఈ సోదరులు దైవం రాముని వారసులని ఓ విశ్వాసం.

జమ్ము రింగ్ రోడ్డుతో సహా వేగంగా పెరుగుతున్న రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం ఆ నగర ఆర్థిక వ్యవస్థకు భారీగా ఊతమిస్తోంది. మత సంబంధ పర్యాటకం తేజరిల్లుతోంది. చెక్క మిల్లులు, బాస్మతి బియ్యం వాణిజ్యం, రైస్ మిల్లులు, కార్పెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ పరికరాల వంటి వివిధ వ్యాపారాల్లో వెలుగు కనిపిస్తోంది.

 

లడఖ్:  

లడ్వాగ్స్ గా కూడా పిలుస్తారు. వ్యూహాత్మకంగా సున్నితమైన ప్రాంతం. కాశ్మీర్ లోయలోని పాలక శ్రేష్ఠుల నుంచి సవతి తల్లి వివక్షకు గురైన బాధిత ప్రాంతం.

 

లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయం ఈ ప్రాంతంలోని శాంతి కాముకులైన ప్రజలకు శాంతి, ప్రగతి & సౌభాగ్యాల ఉషోదయాన్ని చూపించింది. అభివృద్ధి, ఆర్థిక ప్రగతి వంటి అంశాల్లో ప్రాంతీయ అసమానతలను సవరించే దిశగా బీజం పడింది.

 

లడక్ గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఇప్పుడు చూస్తోంది. క్లిష్టతరమైన భూభాగాల్లో, వ్యహాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రహదారుల నిర్మాణం జరుగుతోంది. లడఖ్ లో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకాన్ని ప్రోత్సాహించేందుకు పెద్ద ముందడుగు పడింది.

 

లడఖ్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే ఆర్థిక ప్యాకేజీలకు ఆకాశమే హద్దుగా కనిపిస్తోంది. ఫలితంగా వ్యవసాయ, పశు సంవర్ధక కార్యకలాపాలు పెరిగి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అసాధారణంగా పెరుగుతోంది.

ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలకు సాగునీటి సదుపాయాలు పెంచడంతో ఉత్పాదకత పెరిగి రైతుల జేబుల్లోకి అదనపు సొమ్ము చేరుతోంది.

 

చివరిదే కానీ తక్కువ ప్రాముఖ్యం గల అంశం కాదిది. 370వ అధికరణను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసిన తర్వాత మూడు ప్రాంతాల్లోని స్థానిక సమూహాలకు ప్రజా జీవితంలో పాల్గొనే అవకాశం వచ్చింది. లోయలోని యువత భద్రతా దళాల్లో, పౌర సేవల విభాగాల్లో చేరడం, విద్య, క్రీడా రంగాల్లో రాణించడం గమనించవచ్చు.

 

ఈనాడు కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో మహిళల హక్కులు, బాలికా విద్య పట్ల గొప్ప అవగాహన ఏర్పడింది.

 

ప్రజలు స్థానిక పాలనా యంత్రాంగంతో చేతులు కలపడానికి ముందుకు వస్తున్నారు. అసాంఘిక శక్తులను ఒంటరి అవుతున్నాయి. యువతను తీవ్రవాదంవైపు మళ్లించే పాకిస్తాన్ ప్రాయోజిత ప్రయత్నాలు బహిర్గతం అవుతున్నాయి.

 

****

 

 

 



(Release ID: 1644273) Visitor Counter : 140