ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు కోవిడ్-19 ఆర్ధిక ప్యాకేజీ రెండవ వాయిదా 890.32 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసిన - కేంద్ర ప్రభుత్వం.

Posted On: 06 AUG 2020 1:00PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సంసిద్ధత ప్యాకేజీ రెండవ వాయిదా కింద 22 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు 890.32 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. ఈ రాష్ట్రాలలో - ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, దాద్రా, నగర్ హవేలీ మరియు డామన్, డయ్యు, అరుణాచలప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ఉన్నాయి.  ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్లో నెలకొన్న కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య ఆధారంగా ఆర్థిక సహాయం మొత్తం ఆధారపడి ఉంటుంది.
 
కోవిడ్-19 ప్రతిస్పందన మరియు నిర్వహణకు కేంద్రం నాయకత్వం వహిస్తున్న 'మొత్తం ప్రభుత్వం' విధానంలో భాగంగా, మరియు సాంకేతిక మరియు ఆర్థిక వనరుల ద్వారా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతు ఇస్తూ, కోవిడ్-19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ తయారీ ప్యాకేజీని ప్రధానమంత్రి ప్రకటించారు.  2020, మార్చి 24వ తేదీన జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, "కరోనావైరస్ రోగులకు చికిత్స చేయడానికి, దేశంలో వైద్య పరమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది.  కరోనా పరీక్షా సదుపాయాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ.లు), ఐసోలేషన్ పడకలు, ఐసియు పడకలు, వెంటిలేటర్లతో పాటు ఇతర అవసరమైన పరికరాల సంఖ్యను వేగంగా పెంచడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.  అదే సమయంలో, వైద్య మరియు పారామెడికల్ సిబ్బంది కోసం శిక్షణా కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది.  ఆరోగ్య సంరక్షణ మాత్రమే వారి మొదటి మరియు అత్యంత ప్రాధాన్యతగా పరిగణించబడాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాను." అని పేర్కొన్నారు. 
 
రెండవ విడతగా విడుదల చేసిన ఈ నిధులను, ఆర్.టి-పి.సి.ఆర్. యంత్రాలు, ఆర్.ఎం.ఏ. వెలికితీత వస్తు సామగ్రి, ట్రూ-నాట్ మరియు సి.బి-నాట్ యంత్రాలు, బి.ఎస్.ఎల్-II క్యాబినెట్లు మొదలైన పరికరాల సేకరణ మరియు సంస్థాపనతో సహా పరీక్షల కోసం ప్రజారోగ్య సౌకర్యాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి వినియోగించడం జరుగుతుంది. వీటితో పాటు, ఐ.సి.యు. పడకల చికిత్స మరియు అభివృద్ధి కోసం ప్రజారోగ్య సౌకర్యాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం; ప్రజారోగ్య సౌకర్యాలలో భాగంగా ఉపయోగించే, ఆక్సిజన్ జనరేటర్లు, క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు మరియు మెడికల్ గ్యాస్ పైపు ‌లైన్ల ఏర్పాటు;  పడకల పక్కన అమర్చే ఆక్సిజన్ పరికరాల కొనుగోలు మొదలైన వాటితో పాటు; అవసరమైన మానవ వనరుల నియామకం, శిక్షణ, సామర్థ్య నిర్మాణాన్ని పెంపొందించడం; అదేవిధంగా, కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న ఆశా కార్యకర్తలతో సహా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవకులకు ప్రోత్సాహకాలు వంటి వాటికి ఈ నిధులను వినియోగిస్తారు.  అవసరమైన చోట, కోవిడ్ యోధుల పోర్టల్ ‌లో నమోదు చేసుకున్న కార్యకర్తల సేవలను కూడా కోవిడ్ విధుల కోసం వినియోగించుకోవచ్చు. 
 
పరీక్షా సదుపాయాలను పెంచడానికి, ఆసుపత్రి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, నిఘా కార్యకలాపాలతో పాటు అవసరమైన పరికరాలు, మందులు, ఇతర సామాగ్రిని సేకరించడానికి వీలుగా అన్ని రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు, మొదటి విడత కింద 3,000 కోట్ల రూపాయల మేర నిధులను,  2020 ఏప్రిల్ నెలలో,  విడుదల చేయడం జరిగింది. 
 
ఈ ప్యాకేజీలో భాగంగా, 5,80,342 ఐసోలేషన్ పడకలు, 1,36,068 ఆక్సిజన్ సౌకర్యంతో ఉన్న పడకలు, 31,255 ఐ.సి.యు.  పడకలతో రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలను బలోపేతం చేయడం జరిగింది.   అలాగే, 86,88,357 పరీక్ష పరికరాలు మరియు 79,88,366 వైయల్ ట్రాన్స్పోర్ట్ మీడియా (వీ.టీ.ఎం) లను కొనుగోలు చేయడం జరిగింది. రాష్ట్రాలు / కేంద్రపాలితప్రాంతాలలో 96,557 మంది సిబ్బందిని నియోగించారు, 6,65,799 మంది సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది.  ఈ ప్యాకేజీ 11,821 మంది సిబ్బంది కదలికలకు సహాయం అందించడానికి ఉపయోగపడింది. 

*****



(Release ID: 1643899) Visitor Counter : 244