నీతి ఆయోగ్

ఏ.టి.ఎల్. టింకరింగ్ మారథాన్ 2019 జాతీయ విజేతలను ప్రకటించిన - నీతీ ఆయోగ్ యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్

యువ విద్యార్థి ఆవిష్కర్తలను సత్కరించడమే, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

Posted On: 05 AUG 2020 6:26PM by PIB Hyderabad

నీతీ ఆయోగ్ కు చెందిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏ.ఐ.ఎం) నిర్వహించిన ప్రధాన జాతీయ వార్షిక ఆవిష్కరణ మారథాన్ ఛాలెంజ్ ఏ.టి.ఎల్. టింకరింగ్ మారథాన్ 2019 ఫలితాలను వెల్లడించింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 5000+ అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా 150 మంది మారథాన్ విజేతల పేర్లను వెల్లడించారు.  ఈ ఏడాది, ఈ పోటీలను, మైగోవ్ యొక్క ఇన్నోవేట్ ప్లాట్‌ఫామ్ పై మైగోవ్ ‌తో భాగస్వామ్యంతో ఏ.ఐ.ఎం. నిర్వహించింది. 

“పరిశోధన, రూపకల్పన, ఆవిష్కరణ, అమలుపరచు - ఎక్కువ మంచి కోసం తెలివైన ఆవిష్కరణ” అనే ఈ ఏడాది మారథాన్ ఇతివృత్తాన్ని విద్యార్థులే వినూత్నంగా రూపొందించారు.  సవాలు యొక్క మొదటి దశ, చుట్టుపక్కల సమాజాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న "క్రౌడ్ సోర్సింగ్" సమస్యలను కలిగి ఉంది.  దశ - I లో 4300 కంటే ఎక్కువగా ఎంట్రీలు వచ్చాయి.  దశ - II,  ఎంపికచేసిన చేసిన సమస్యల ప్రకటనలపై ఓటింగ్‌ను కలిగి ఉంది.  విద్యార్థులు, తమకు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలను ఎంచుకోవడంతో, సుమారు 5000 కంటే ఎక్కువగా ఓట్లు వచ్చాయి.  ఈ సంవత్సరం మారథాన్ ఎక్కువగా ఆవిష్కరణలకు దారితీసే పరిశోధనపై బలమైన దృష్టి పెట్టింది.

దశ-I మరియు దశ-II ఆధారంగా నాలుగు వేర్వేరు సమస్యా ప్రాంతాలను ఎంపిక చేయడం జరిగింది.  అవి,  సుస్థిర పర్యావరణం మరియు న్యాయాన్ని ప్రారంభించడం,  ఫలితంతో కూడిన నాణ్యమైన విద్యను ప్రారంభించడం,  ఆరోగ్యం మరియు పరిశుభ్రతను మెరుగుపరచడం,  సంఘటితం మరియు సమానత్వాన్ని నిర్ధారించడం. ఈ నాలుగు సమస్యా ప్రాంతాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటిలో విద్యార్థులు తమకు నచ్చిన సమాజ సమస్యలను గుర్తించారు.  పనిచేసే నమూనాలు లేదా కనీస ఆచరణీయ ఉత్పత్తి (ఎం.వి.పి) రూపంలో విద్యార్థులు వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేశారు.

పరిష్కార అభివృద్ధి చివరి దశలో,  దేశంలోని 29 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థుల నుండి 1,191 ఎంట్రీలు వచ్చాయి.  పటిష్టమైన మూల్యాంకన ప్రక్రియ తరువాత, అగ్ర స్థానంలో నిలిచిన 150 బృందాలను ఎంపిక చేశారు.  గెలిచిన జట్లలో 42 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందినవి కాగా, 57 శాతం ప్రభుత్వ పాఠశాలలకు చెందినవి ఉన్నాయి.  గెలిచిన బృందాలలోని విద్యార్థుల్లో 45 శాతం మంది బాలికలు ఉన్నారు. 

విజేతలుగా నిలిచిన  జట్లకు వారి వినూత్న పరిష్కారాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మరియు వివిధ జాతీయ స్థాయి వేదికలపై ప్రదర్శించడానికి సహాయపడే విధంగా అనేక అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. 

ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగానికి చెందిన ఏ.ఐ.ఎం. భాగస్వాములతో కూడిన విశిష్ట న్యాయనిర్ణేతల బృందం సమక్షంలో వినూత్నంగా, కన్నుల పండువగా, ఆన్-లైన్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో అగ్ర స్థానంలో నిలిచిన 150 జట్ల పేర్లను ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో, మైగోవ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అభిషేక్ సింగ్,  ఐ.బి.ఎం. ఇండియా / దక్షిణ ఆసియా జనరల్ మేనేజర్ మరియు ఐ.బి.ఎం. ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ పటేల్,  డెల్ టెక్నాలజీస్, ఉపాధ్యక్షుడు (ఆర్&డి), శ్రీ బి. రుద్రమణి,  అడోబ్ ఇండియా, క్రియేటివ్ క్లౌడ్ ప్రొడక్ట్, ఉపాధ్యక్షుడు, శ్రీ షణ్ముఘ నటరాజన్,  ఏ.ఐ.సి., అలీప్, వుయ్-హబ్, చైర్ పర్సన్, శ్రీమతి కె.రమాదేవి,  ఏ.ఐ.సి, అమ్రితా టి.బి.ఐ., సి.ఓ.ఓ., శ్రీ స్నేహల్ శెట్టి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఎ.ఐ.ఎం. మిషన్ డైరెక్టర్, ఆర్. రమణన్ మాట్లాడుతూ “ఎ.టి.ఎల్. టింకరింగ్ మారథాన్ కోసం ఎ.టి.ఎల్. విద్యార్థులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే, వారి ఊహలనూ, సృజనాత్మక సామర్థ్యాన్నీ ప్రదర్శించడానికి ఇది ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుంది.   ఈ సంవత్సరం వేరే విధానాన్ని అవలంబించడం జరిగింది. దీనిలో తరువాతి తరం వారు తమకు తాము ఆలోచించాలనీ, వారు పరిష్కరించడానికి విలువైన సమస్యలను గుర్తించాలనీ మేము కోరుకుంటున్నాము.” అని పేర్కొన్నారు. 

ఆయన ఇంకా మాట్లాడుతూ, “మీ ఆవిష్కరణల ప్రయాణం ప్రారంభమైంది.  మీరు అవసరమైన పరిశోధన చేసారు, మీరు ఆదర్శంగా ఉన్నారు, మీరు ఒక ఆవిష్కరణను సృష్టించారు.  ఇప్పుడు ఆ ఆవిష్కరణను మార్కెట్టుకు పనికివచ్చే వస్తువుగా ఎలా మార్చాలో ఆలోచించాలి.  మీలో ప్రతి ఒక్కరినీ మేము అభినందిస్తున్నాము. మీరు పోటీలో గెలిచినా, గెలవకపోయినా, ముందుకు సాగడానికి వీలుగా ప్రేరణ కొనసాగించాలని సూచిస్తున్నాము. ” అని పేర్కొన్నారు. 

భాగస్వాములందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ,  వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యం వల్లనే ఇవన్నీ సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.  అగ్ర స్థానంలో ఉన్న 150 బృందాలు అధునాతన స్థాయి ఆవిష్కరణ మరియు వ్యవస్థాపకతకు బహిర్గతం కావడానికి, ఈ భాగస్వాములు ఏ.ఐ.ఎం., నీతీ ఆయోగ్ లకు సహాయపడతాయని, ఆయన తెలియజేశారు. 

మైగోవ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అభిషేక్ సింగ్, విజేతలను అభినందిస్తూ, “ఇది మారథాన్ గెలవడం మాత్రమే కాదు. ఒక మారథాన్‌ను నిర్వహించడం కూడా, ఆ మారథాన్ లో గెలవడం అంత ముఖ్యమైనది. ఆలోచనలను సమీకరించడం, ఓటింగు, మారథాన్ యొక్క అన్ని ఇతర దశలలో సహకరించిన వారందరినీ నేను అభినందించాలని అనుకుంటున్నాను.  ఇంత గొప్ప పని చేసినందుకు, నేను ఏ.ఐ.ఎం. మొత్తం బృందాన్ని కూడా అభినందిస్తున్నాను. ఈ మారథాన్ యొక్క ప్రతి అడుగు,  దేశవ్యాప్తంగా ఆవిష్కరణ సంస్కృతిని సృష్టించడానికి ముఖ్యమైనది.” అని పేర్కొన్నారు. 

విజేతలైన  జట్లకు ఏ.ఐ.ఎం. యొక్క భాగస్వాములతో కలిసి వారి ప్రోటోటైప్‌ (నమూనా) లను మెరుగుపర్చడానికి పలు అవకాశాలు కల్పించడం జరుగుతుంది.  వీటిలో అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లతో స్టూడెంట్ ఇన్నోవేటర్ ప్రోగ్రామ్,  ఐ.బి.ఎం. తో విద్యార్థుల ఇంటర్న్‌ షిప్ కార్యక్రమాలు,  అడోబ్ ‌తో డిజిటల్ ఇంటర్న్‌ షిప్ కార్యక్రమం మొదలైనవి ఉంటాయి.   వీటితో పాటు, అగ్రశ్రేణి బాలికల జట్లకు డెల్ టెక్నాలజీస్ మార్గదర్శకత్వంలో వారి ఆలోచనలను మెరుగుపరచడానికి ప్రత్యేక అవకాశం లభిస్తుంది.

కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడ "క్లిక్" చేయండి.  

ఏ.టి.ఎల్. మారథాన్-2019 విజేతల వివరాల కోసం ఇక్కడ "క్లిక్" చేయండి. 

 

*****


(Release ID: 1643682) Visitor Counter : 237