PIB Headquarters

కోవిడ్‌-19పై పీఐబీ రోజువారీ సమాచార పత్రం

Posted On: 05 AUG 2020 6:34PM by PIB Hyderabad

(కోవిడ్-19కు సంబంధించి గత 24గంటల్లో జారీచేసిన పత్రికా ప్రకటనలుసహా

పీఐబీ వాస్త‌వాలను త‌నిఖీచేసిన అంశాలు ఇందులో ల‌భ్య‌మ‌వుతాయి)

 

  • దేశంలో అత్యధికంగా 51,706 మందికి వ్యాధిన‌యం; కోలుకునేవారి శాతం 67.19తో కొత్త రికార్డు.
  • మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గి 2.09 శాతానికి ప‌త‌నం.
  • వ‌రుస‌గా రెండో రోజు 24 గంట‌ల్లో 6 ల‌క్ష‌ల‌కుపైగా ప‌రీక్షలు; ఇప్ప‌టిదాకా 2.14కోట్ల‌కుపైగా న‌మూనాల ప‌రీక్ష‌.
  • ప్రతి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు రోజువారీ పరీక్షల స‌గ‌టు 15,568కి చేరిక‌.
  • కోవిడ్‌ పరిస్థితుల నడుమ శ్రీరాముడు బోధించిన ‘సంస్కారం’ ప్రాముఖ్యాన్ని ప్రస్తావించిన ప్రధాని; ఇది ‘రెండు గజాల దూరం-మాస్క్‌ధారణ అవశ్యం’ రూపంలో ప్రతిబింబించాలని సూచన.

 

దేశంలో ఎన్న‌డూలేనంత అధికంగా ఇవాళ 51,706 మందికి వ్యాధి న‌యం; 67.19 శాతంతో కోలుకునేవారి కొత్త రికార్డు; మ‌ర‌ణాలు 2.09 శాతానికి ప‌త‌నం

భార‌త్‌లో గ‌త 24 గంటల్లో అత్య‌ధిక సంఖ్య‌లో కోవిడ్‌-19 పీడితులు కోలుకున్నారు. ఈ మేర‌కు 51,706 మందికి వ్యాధి న‌యంకాగా, కోలుకునేవారి స‌గ‌టు రోజూ పెరుగుతూ 67.19 శాతంతో స‌రికొత్త గరిష్ట స్థాయిని న‌మోదు చేసింది. త‌ద‌నుగుణంగా ఇప్పటిదాకా మొత్తం 12,82,215 మంది కోలుకుని ఇళ్ల‌కు వెళ్లారు. ప్ర‌స్తుత కేసుల సంఖ్య‌లో పోలిస్తే ఇది రెండు రెట్లక‌న్నా అధికం. గ‌డ‌చిన 14 రోజులుగా కోలుకుంటున్న కేసుల పెరుగుద‌ల 63.8 శాతంగా న‌మోదైంది. ఈ మేరకు గ‌త 14 రోజుల వ్య‌వ‌ధిలో కోలుకునేవారి స‌గ‌టు స్థిరంగా మెరుగుప‌డుతూ  63 శాతం నుంచి  67 శాతానికి దూసుకెళ్లింది. ఫ‌లితంగా ప్ర‌స్తుత‌-కోలుకునే కేసుల మ‌ధ్య అంత‌రం దాదాపు 7 ల‌క్ష‌ల‌కు చేరింది. నిత్యం అత్య‌ధిక సంఖ్య‌లో కోవిడ్ పీడితులకు వ్యాధి న‌యం అవుతున్నందున ప్ర‌స్తుత కేసులు 5,86,244కు త‌గ్గిపోగా వీరంద‌రూ చురుకైన వైద్య ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చికిత్స పొందుతున్నారు.

అలాగే మ‌ర‌ణాల శాతం క్ర‌మంగా ప‌త‌న‌మ‌వుతూ నేడు అత్యంత క‌నిష్ఠంగా 2.09 శాతానికి దిగివ‌చ్చింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643552

వ‌రుస‌గా రెండోరోజు 6 ల‌క్ష‌ల‌కుపైగా ప‌రీక్షలు; ఇప్ప‌టిదాకా 2.14కోట్ల‌కుపైగా న‌మూనాల ప‌రీక్ష‌; ప‌్ర‌తి ప‌ది ల‌క్ష‌ల జ‌నాభాకు స‌గ‌టు 15,568కి చేరిక‌

దేశంలో వ‌రుస‌గా రెండోరోజు 6 ల‌క్ష‌ల‌కుపైగా అంటే 6,19,652 కోవిడ్‌-19 నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వహించారు. దీంతో ఇప్ప‌టిదాకా ప‌రీక్షించిన న‌మూనాల సంఖ్య 2,14,84,402కు చేరింది. ఈ మేర‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి 10 ల‌క్ష‌ల జ‌నాభాకు రోజువారీ ప‌రీక్ష‌ల స‌గ‌టు 15,568కి పెరిగింది. దేశంలో ప్ర‌యోగ‌శాల‌ల నెట్‌వ‌ర్క్ నానాటికీ విస్త‌రిస్తూ ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ రంగంలో 920, ప్రైవేటు రంగంలో 446 వంతున మొత్తం 1,366 ప్ర‌యోగ‌శాల‌లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643601

శ్రీ రామ జన్మభూమి మందిరంలో భూమిపూజ  నిర్వహించిన ప్రధానమంత్రి; ప‌ర‌స్ప‌ర ప్రేమ‌, సౌభ్రాత్రం పునాదులుగా ఆల‌య నిర్మాణం సాగాల‌ని ఆకాంక్ష‌

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ అయోధ్యలోని ‘శ్రీరామ జన్మభూమి మందిరం’వద్ద ఆల‌య నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. అనంత‌రం మాట్లాడుతూ- ఇదొక చరిత్రాత్మక సందర్భమ‌ని, భారతదేశం ఇవాళ ఒక ఉజ్వ‌ల అధ్యాయానికి శ్రీ‌కారం చుడుతున్న‌ద‌ని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజ‌లు శ‌తాబ్దాలుగా ఈ ఘ‌డియల కోస‌మే ఉత్సుక‌త‌తో, ఉద్వేగంతో ఎదురుచూస్తున్నార‌ని గుర్తుచేశారు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిరూపంగా రూపుదిద్దుకోనున్న ఈ ఆల‌యం శ‌తాబ్దాల‌పాటు మాన‌వాళి మొత్తానికీ స్ఫూర్తినిస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు. ‘అంద‌రూ ఒక్కటి’ కావ‌డంద్వారా, ‘అంద‌రి విశ్వాసం’ పొంది, ‘అంద‌రి వికాసం’ సాధించాల‌ని ఉద్బోధించారు. పరస్పర ప్రేమ, సోదరభావం పునాదులుగా ఈ ఆలయ నిర్మాణం సాగాల‌ని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. రామ మందిరం మన సంస్కృతి, నిరంత‌ర విశ్వాసం, జాతీయ స్ఫూర్తి, సామూహిక మ‌నోబ‌లానికి ఆధునిక ప్ర‌తీక అని, ఇది రానున్న త‌ర‌తరాలకూ ప్రేరణ ఇవ్వగల‌ద‌ని ప్రధానమంత్రి పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థను మార్చివేయగల‌ద‌ని ప్ర‌ధాని చెప్పారు. కోవిడ్‌ పరిస్థితుల నడుమ శ్రీరాముడు బోధించిన ‘సంస్కారం’ ప్రాముఖ్యాన్ని ప్రస్తావించిన ప్రధాని... ఇది “రెండు గజాల దూరం-మాస్క్‌ ధారణ అవశ్యం” రూపంలో ప్రతిబింబించాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643548

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో శ్రీరామ మందిరం భూమిపూజ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తిపాఠం

మరిన్ని వివరాలకు: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643518

అయోధ్య ఆలయ నిర్మాణం, కోవిడ్‌-19పై పోరు కోసం చెరో రూ.5 లక్షలవంతున రూ.10 లక్షల విరాళం అందజేసిన ఉప రాష్ట్రపతి కుటుంబం

అయోధ్యలో ఆలయ నిర్మాణంతోపాటు దేశంలో ప్రస్తుతం కోవిడ్‌-19పై సాగుతున్న పోరాటం కోసం చెరో రూ.5 లక్షల వంతున ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు కుటుంబసభ్యులు ఇవాళ రూ.10 లక్షల విరాళం అందజేశారు. కాగా, ఇంతకుముందు కోవిడ్‌పై యుద్ధం కోసం శ్రీ నాయుడు మార్చి నెల జీతాన్ని ‘పీఎం కేర్స్‌’ నిధికి విరాళంగా ఇచ్చారు. అంతేకాకుండా ప్రతినెలా 30 శాతం జీతాన్ని కూడా విరాళంగా ప్రకటించారు.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643572

ఏప్రిల్‌-జూన్‌ మాసాలకు కేటాయించిన ఆహార ధాన్యాల్లో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలద్వారా ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులకు 93.5 శాతం పంపిణీ

జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం ప‌రిధిలోని ల‌బ్ధిదారుల‌కు ఉచిత పంపిణీకి ఉద్దేశించిన అదనపు ఆహార ధాన్యాల పంపిణీ దిశ‌గా దేశంలోని అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప్ర‌భుత్వాలు మూడు నెలలకు సరిపడా 118 లక్షల టన్నుల (99 శాతం)దాకా ఆహారధాన్యాల తీసుకెళ్లాయి. అలాగే 2020 ఏప్రిల్-జూన్ మధ్య కాలానికి కేటాయించిన ఆహారధాన్యాల్లో 111.52 లక్షల టన్నుల (93.5 శాతం) మేర అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ప‌రిధిలో పంపిణీ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇక ఎఫ్‌సీఐ నివేదిక ప్ర‌కారం... 2020 ఏప్రిల్మే నెలల్లో 37.5 లక్షల టన్నుల (94 శాతం) మేర ఆహారధాన్యాలను ప్రతి నెలలో 75 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేశాయి. అదేవిధంగా జూన్ నెలలో 36.54 లక్షల టన్నుల (92 శాతం) మేర 73 కోట్ల మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు ఎఫ్‌సీఐ తెలిపింది. అంతకుముందు 2020 మార్చిలో, కోవిడ్-19 వ్యాప్తివ‌ల్ల‌ ఏర్పడిన ఆర్థిక అంతరాయాలవ‌ల్ల పేదలు, అన్నార్తులు ఎదుర్కొంటున్న కష్టాలు తీర్చడానికి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ)ని ప్రకటించారు. త‌ద‌నుగుణంగా ఆహార-ప్రజా పంపిణీ శాఖ 2020 ఏప్రిల్, మే, జూన్ నెల‌ల వ్య‌వ‌ధిలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన” (పీఎంజీకేఏవై)ను అమలు చేసింది.

మరిన్ని వివరాలకు: https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1643602

 

పీఐబీ క్షేత్రస్థాయి కార్యాలయాల నుంచి సమాచారం

  • చండీగఢ్‌: ఈ కేంద్రపాలిత ప్రాంతంలో రక్తశుద్ధి (డయాలసిస్) అవసరమైన కోవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేక డయాలసిస్ సదుపాయం కల్పించాల్సిందిగా ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని పాలనా యంత్రంగం అధిపతి ఆదేశించారు. దీంతోపాటు అదనపు వసతులు అవసరమయ్యే చోట కేంద్రాల ఏర్పాటుకు తగిన ప్రదేశాలను ఎంపిక చేయాలని డిప్యూటీ కమిషనర్‌కు సూచించారు.
  • పంజాబ్: రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సంప్రదాయ వరిసాగు నుంచి దాదాపు 2.28 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంట వైవిధ్యం పాటించడంపై ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రశంసించారు. కోవిడ్‌ సంక్షోభ సమయంలోనూ ఖరీఫ్-2020 పంటల సాగులో యథాతథ విస్థీర్ణం నమోదవడంపై హర్షం ప్రకటించారు.
  • కేరళ: రాష్ట్రంలో ఆగస్టు-సెప్టెంబరు నెలల మధ్య కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతాయన్న నివేదికల నేపథ్యంలో నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని నేటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఇక నియంత్రణ వ్యూహంలో భాగంగా పోలీసులకు ఎక్కువ బాధ్యతలు అప్పగించడం గురించి ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంత్రిమండలి సహచరులకు వివరించారు. ఏదేమైనా రాజధాని పరిసర గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి నిరంతర వ్యాప్తి కనిపిస్తోంది. ఇవాళ మరో కోవిడ్ రోగి మరణంతో మృతుల సంఖ్య 88కి పెరిగింది. కేరళలో నిన్న 1,083 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 11,540 మంది చికిత్స పొందుతుండగా రాష్ట్రవ్యాప్తంగా 1.45లక్షల మంది పరిశీలనలో ఉన్నారు.
  • తమిళనాడు: రాష్ట్ర గవర్నర్‌కు కోవిడ్‌ నిర్ధారణ అయినప్పటికీ, వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, శనివారం రాత్రి గవర్నర్‌ భన్వారిలాల్ పురోహిత్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ, జ్వర పరిశీలన శిబిరాలను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలికాలంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గించడంలో ఇవి ఎంతగానో తోడ్పడ్డాయి. నిరంతర అన్వేషణ, ఆచూకీ తీయడం, రోగులను గుర్తించడం చాలా ముఖ్యమని ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో నిన్న 5,063 కొత్త కేసులు నమోదవగా 6,501 మంది కోలుకున్నారు. ఇక 108 మంది మరణించగా మృతుల సంఖ్య 4,349కి పెరిగింది. మొత్తం కేసులు: 2,68,285; క్రియాశీల కేసులు: 55,152; మరణాలు: 4349గా ఉన్నాయి.
  • కర్ణాటక: ఐసీఎంఆర్ ఆమోదించిన దేశంలోని తొలి మొబైల్ కోవిడ్ పరీక్షల ప్రయోగశాలను వైద్య విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ ఇవాళ బెంగళూరులో ప్రారంభించారు. ఐఐఎస్‌స్సీ రూపొందించిన ఈ ప్రయోగశాల నమూనాలను పరీక్షించాక కేవలం 4గంటల్లో ఫలితం వెల్లడిస్తుంది. దీంతోపాటు రోజువారీగా 400 పరీక్షలు నిర్వహించే వీలుంటుంది. కోవిడ్ రోగులు, వారి బంధువులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారానికి అన్ని ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని బిబిఎంపీ నిర్ణయించింది. కొత్త కేసులతో పోల్చితే మంగళవారం రాష్ట్రంలో అత్యధికంగా రోగులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 6259 కొత్త కేసులు, 110 మరణాలు నమోదవగా 6777మందికి వ్యాధి నయమైంది. మొత్తం కేసులు: 1,45,830; క్రియాశీల కేసులు: 73,846; మరణాలు: 2704గా ఉన్నాయి.
  • ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో కోవిడ్‌ రోగులకు చికిత్స నిరాకరించే ప్రైవేటు ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని ఆరోగ్యశాఖ మంత్రి హెచ్చరించారు. కోవిడ్-19 కేసుల పెరుగుదల నిరోధానికి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 17,000మంది వైద్యులు, పారా మెడికల్‌-నర్సింగ్ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. కాగా, విద్యుత్‌శాఖ మంత్రికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక తిరుపతి నగరంలో దిగ్బంధంతోపాటు ఆగస్టు 14 వరకు నియంత్రణ జోన్‌గా కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు, ఏఎన్‌ఎంలతో సంధానానికి, నిర్బంధ-ఏకాంత చికిత్స కేంద్రాల వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం కోవిడ్ ఎమర్జెన్సీ నంబర్లను ఏర్పాటుచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న 7822 కొత్త కేసులు, 63 మరణాలు నమోదవగా 5786మంది కోలుకున్నారు. మొత్తం కేసులు: 1,66,586 యాక్టివ్ కేసులు: 76,377; మరణాలు: 1537గా ఉన్నాయి.
  • తెలంగాణ: రాష్ట్రంలో మహిళలు తక్కువ సంఖ్యలో కరోనావైరస్ బారినపడినప్పటికీ 21-30 ఏళ్ల మధ్య వయసువారు ఇతర వయోవర్గాలవారికన్నా ఎక్కువగా వ్యాధికి గురయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులలో 65.6 శాతం పురుషులు కాగా, 34.4 శాతం మహిళలున్నారు. ఈ మహిళల్లో అత్యధికం (22%) కేసులు 21-30 మధ్య వయోవర్గానికి చెందినవారు కావడం గమనార్హం. కాగా, గడచిన 24 గంటల్లో 2012 కొత్త కేసులు, 13 మరణాలు నమోదవగా 1139 మంది కోలుకున్నారు. కొత్త కేసులలో 532 జీహెచ్‌ఎంసీ నుంచి నమోదయ్యాయి. మొత్తం కేసులు 70,958; క్రియాశీల కేసులు: 19,568; మరణాలు: 576; డిశ్చార్జి అయినవి: 50,814గా ఉన్నాయి.
  • మణిపూర్: రాష్ట్రంలో కోవిడ్-19పై పోరు వ్యూహం రూపకల్పన కోసం మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవాళ పోలీసు, సైనిక, పారా మిలటరీ దళాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • నాగాలాండ్: రాష్ట్రంలో ఇవాళ నిర్ధారణ అయిన 94 కొత్త కేసులకుగాను 89 దిమాపూర్ నుంచి 5 కొహిమా నుంచి నమోదయ్యాయి.
  • మహారాష్ట్ర: రాష్ట్రంలో ప్రస్తుతం చురుకైన కేసులకన్నా కోలుకున్న కేసుల సంఖ్య రెట్టింపుగా ఉంది. ఆ మేరకు కోలుకునేవారి సగటు 65 శాతం కాగా, ఇది జాతీయ సగటుకు చేరువవుతోంది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం 4.57లక్షల కేసులకుగాను 2.99 లక్షలమంది కోలుకోగా, ప్రస్తుతం 1.42 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. ముంబైలో సాధారణ పరిస్థితులు నెలకొల్పే దిశగా నగరపాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇవాళ్టినుంచి వివిధ వాణిజ్య కార్యకలాపాలను అనుమతిస్తూ దిగ్బంధం నిబంధనలను సడలించింది.
  • గుజరాత్: రాష్ట్రంలోని సూక్ష్మ నియంత్రణ జోన్లలోని కొత్త ప్రాంతాల్లో ఇంటింటి నిఘా, సామూహిక పరీక్షలు ప్రారంభించింది. ఆ మేరకు గుజరాత్‌లో కోవిడ్-19 పరీక్షల సంఖ్య గణనీయంగా పెరిగి నిన్న 20,735 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటిదాకా 8.54 లక్షలకుపైగా పరీక్షలు పూర్తయ్యాయి. గుజరాత్‌లో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 14,811గా ఉంది.
  • రాజస్థాన్: రాష్ట్ర ప్రభుత్వ దిగ్బంధ విముక్తి-3 ప్రణాళికలో భాగంగా రాజస్థాన్‌లోని అన్ని యోగా కేంద్రాలు, జిమ్‌లు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. ప్లాస్మా చికిత్స పొందిన కోవిడ్ రోగుల పరిస్థితి మెరుగుపడుతోందని ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,115 క్రియాశీల కేసులు ఉన్నాయి.
  • మధ్యప్రదేశ్: రాష్ట్రంలో కరోనా నుంచి పౌరుల రక్షణకోసం 'ఏక్ మాస్క్-అనెక్ జిందగీ' ప్రచారం కింద ఇప్పటిదాకా 413 మాస్క్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఈ మేరకు ఇప్పటిదాకా 1.30 లక్షలకుపైగా  మాస్కులను వివిధ సంస్థలు, పౌరులు విరాళంగా అందజేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో మంగళవారం 797 కొత్త కేసులు నమోదయ్యాయి.

 

 

    •  
    • ImageImage

****

 

 



(Release ID: 1643631) Visitor Counter : 214