రాష్ట్రప‌తి స‌చివాల‌యం

నర్సులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకున్న రాష్ట్రపతి

Posted On: 03 AUG 2020 2:59PM by PIB Hyderabad

రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌, నర్సులతో కలిసి రక్షాబంధన్‌ వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 'ట్రైన్‌డ్‌ నర్సెస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా', 'మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్'‌, 'ప్రెసిండెంట్స్‌ ఎస్టేట్‌ క్లినిక్‌'కు చెందిన నర్సులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

    నర్సులు రాష్ట్రపతికి రాఖీలు కట్టారు. కొవిడ్‌ చికిత్సల అనుభవాలను వివరించారు. సాటి మనిషి ప్రాణాలను కాపాడడమేగాక, ప్రాణాలకు తెగించి కర్తవ్యంలో పాల్గొంటున్న రక్షకులుగా వారిని రాష్ట్రపతి అభివర్ణించారు. ఫ్రంట్‌ లైన్‌ కొవిడ్‌ వారియర్స్‌గా చేస్తున్న పోరాటం వారిపై గౌరవాన్ని మరింత పెంచుతుందన్నారు. అన్నదమ్ముల భద్రతను కోరుతూ మహిళలు రాఖీ కడతారన్న రాష్ట్రపతి, నర్సుల అంకితభావం వారి సోదరులతోపాటు ప్రజలందరికీ రక్షణనిస్తుందని చెప్పారు.
 
    మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌కు చెందిన ఇద్దరు నర్సులు విధుల్లో ఉండగా కొవిడ్‌ బారినపడి, వేగంగా కోలుకుని, కొత్త ఉత్సాహంతో మళ్లీ విధులకు హాజరవుతున్నారన్న కోవింద్‌, ఈ విపరీత సమయంలో తోటివారికి నిబద్ధతతో సేవ చేస్తున్న నర్సుల సమాజానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నర్సులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
 
    కొవిడ్‌ చికిత్స అనుభవాలను గురించి నర్సులు చెబుతూ, అపోహల కారణంగా రోగులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వివరించారు. శారీరక చికిత్సతోపాటు, మానసిక చికిత్స కూడా వారికి అవసరమన్నారు. వారందరి అభిప్రాయాలను రాష్ట్రపతి సావధానంగా విన్నారు. దేశానికి నర్సులు అందిస్తున్న శ్రేష్టమైన సేవలను ప్రశంసించారు.
   

***



(Release ID: 1643169) Visitor Counter : 157