సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

అగర్బత్తీల ఉత్పత్తిలో ఇండియా స్వయం సమృద్ధి (ఆత్మనిర్బర్)  సాధించే కొత్త స్కీమును ఆమోదించిన చిన్న, మధ్యతరహా సంస్థల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఇ) మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాక వేలాది ఉద్యోగాల కల్పనకు తోడ్పడే ప్రయోగాత్మక ప్రాజెక్టును ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ (కె వి ఐ సి) త్వరలో ప్రారంభించనుంది  

Posted On: 02 AUG 2020 2:19PM by PIB Hyderabad

అగర్బత్తీల ఉత్పత్తిలో ఇండియా స్వయం సమృద్ధి సాధించడానికి తోడ్పడటమే కాక ఉపాధి కల్పనకు దోహదం చేసేందుకు ఖాదీ గ్రామోద్యోగ కమిషన్ త్వరలో ప్రారంభించనున్న  ప్రత్యేక కార్యక్రమానికి ఎంఎస్ఎంఇ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.  ఈ కార్యక్రమం పేరు  "ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్".   దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుద్యోగులు మరియు వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు దేశంలో అగర్బత్తీల ఉత్పత్తిని గణనీయంగా పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.  ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం  గతనెలలో ఈ ప్రతిపాదన సమర్పించడం జరిగింది.  ప్రయోగాత్మక ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తారు.  ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేసిన తరువాత అగర్బత్తీల పరిశ్రమలో వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది.  

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో అమలు చేసేందుకు కె వి ఐ సి రూపకల్పన చేసింది.   చాలా తక్కువ పెట్టుబడితో ధారణీయ ఉపాధి కల్పించడం దీని ప్రత్యేకత.   ప్రైవేటు అగర్బత్తీ ఉత్పత్తిదారులు ఎక్కువ మూలధనం  పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేకుండా  తమ అగర్బత్తీల ఉత్పత్తిని పెంచడానికి ఇది తోడ్పడుతుంది.  ఈ రంగంలో విజయవంతమైన అగర్బత్తీల ఉత్పత్తిదారులను వ్యాపార భాగస్వాములుగా చేర్చుకొని కె వి ఐ సి అగర్బత్తీలు  తయారుచేసే చేతిపని వారికి అగర్బత్తీలు చేసేందుకు అవసరమైన ఆటోమేటిక్ యంత్రాలను,   పొడిని కలిపే యంత్రాలను ఈ స్కీము ద్వారా సమకూరుస్తుంది.  ఇందుకోసం స్థానికంగా  భారతీయ ఉత్పత్తిదారులు తయారుచేసిన యంత్రాలనే సేకరించాలని కె వి ఐ సి నిర్ణయించింది.  తద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నది లక్ష్యం.  

యంత్రాలు కొనడానికి అయ్యే ఖర్చులో కె వి ఐ సి 25% సబ్సిడీ ఇస్తుంది.   మిగిలిన 75% సొమ్మును పనివారి నుంచి నెల నెలా సులభ వాయిదాల్లో రాబట్టుంటారు.  అగర్బత్తీల తయారీకి కావలసిన  ముడి పదార్ధాలు ఇచ్చే వ్యాపార భాగస్వాములు పనివారికి వారి పని ఆధారంగా కూలీ ఇస్తారు.   చేతిపనివారి శిక్షణకు అయ్యే ఖర్చులో 75% కె వి ఐ సి,  మిగిలిన 25% వ్యాపార భాగస్వామి పంచుకుంటారు.  

ఆటోమేటిక్ యంత్రాలకు  రోజుకు దాదాపు 80 కిలోల అగర్బత్తీలు తయారు చేసే సామర్ధ్యం ఉంటుంది.  వాటి ద్వారా ప్రత్యక్షంగా నలుగురికి ఉపాధి లభిస్తుంది. అగర్బత్తీల పొడిని కలిపే ఒక్కొక్క యంత్రం ద్వారా ఇద్దరికీ ఉపాధి లభిస్తుంది.    పొడిని కలిపే యంత్రాలు ఐదింటిని ఒక జట్టుగా ఇస్తారు.  

ప్రస్తుతం అగర్బత్తీల  తయారీకి కిలోకు రూ. 15 చొప్పున కూలీ ఇస్తారు.  ఈ లెక్కన రోజుకు నలుగురు పనివారు 80 కిలోల అగర్బత్తీలు తయారు చేస్తే రూ. 1200 కూలీ గిడుతుంది.  ఆ విధంగా ప్రతి పనివాడికి రోజుకు కేనీసం రూ. 300 కూలీ ముడుతుంది.  అదే విధంగా పొడిని కలిపే ఒక్కొక్క యంత్రం దగ్గర పని చేసే వారికి రోజుకు నికరంగా రూ. 250 కూలీ లభిస్తుంది.  

ఈ స్కీము ప్రకారం  వ్యాపార భాగస్వాములు తమ వద్ద పని చేసే వారి కూలీని వారానికి ఒకసారి  నేరుగా వారి ఖాతాలకు నగదు బదిలీ మాత్రమే చేస్తారు. పనివారికి  ముడి పదార్ధాల సరఫరా,  వ్యూహ రచన,  నాణ్యతా నియంత్రణ మరియు  తుది ఉత్పత్తి మార్కెటింగ్ వంటి వాటికి పూతి బాధ్యత వ్యాపార భాగస్వామిదే.   యంత్రాలు కొనడానికి అయ్యే ఖర్చులో 75%  రాబట్టుకున్న తరువాత యంత్రాల యాజమాన్యం పనివారికి బదిలీ అవుతుంది.  

 

 ఈ ప్రాజెక్టు ను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం లో విజయవంతం గా నిర్వహించడానికి కె వి ఐ సి మరియు ప్రైవేటు అగర్బత్తీ ఉత్పత్తిదారుల మధ్య ద్విపక్ష ఒప్పందం కుదుర్చుకుంటారు.  

కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మరియు  ఆర్ధిక మంత్రిత్వ శాఖ  తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలు --  వరుసగా  అగర్బత్తీల ముడి పదార్ధాల దిగుమతిపై ఆంక్షలు మరియు  వెదురు పుల్లల దిగుమతి పై సుంకం పెంపు --  కారణంగా శ్రీ గడ్కరీ చొరవ వల్ల  ఈ స్కీమును రూపొందించడం జరిగింది.  

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ రెండు నిర్ణయాల వల్ల అగర్బత్తీల పరిశ్రమలో భారీగా ఉపాధి అవకాశాలు ఉత్పన్నమయ్యాయని కె వి ఐ సి చైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా తెలిపారు.  "భారీగా ఏర్పడిన ఉపాధి కల్పనా అవకాశాన్ని ఉపయోగించుకొని సొమ్ముచేసుకోవడాని కె వి ఐ సి  "ఖాదీ అగర్బత్తి ఆత్మనిర్బర్ మిషన్". పేరిట ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసి ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ఆమోదం కోసం పంపడం జరిగింది"  అని సక్సేనా తెలిపారు.  

పనివారి వెంట ఉండి వారిని  ముందుకు నడిపించడం మరియు  స్థానిక అగర్బత్తీల పరిశ్రమకు తోడ్పాటును అందించడం ఈ కార్యక్రమం లక్ష్యం.   ప్రస్తుతం మన దేశం రోజుకు దాదాపు  1490 మెట్రిక్ టన్నుల అగర్బత్తీలను వినియోగిస్తున్నారు.  కానీ మన దేశంలో తయారయ్యే అగర్బత్తీలు 760 మెట్రిక్ టన్నులు మాత్రమే.  అందువల్ల డిమాండ్ సరఫరా మధ్య ఉన్న ఈ లోటు ను భర్తీ చేయడానికి వీలుగా ఉద్యోగాల సృష్టి కి చాలా ఆస్కారం ఉంది.  


(Release ID: 1643102) Visitor Counter : 436