రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వేల ఆధ్వర్యంలో తొలిసారిగా వర్చువల్ వేదికపై అధికారుల పదవీ విరమణ ఉత్సవం అన్ని జోన్లు, డివిజన్లు, ఉత్పత్తి యూనిట్లనుంచి
2,320మందికి రిటైర్మెంట్
అంకిత భావంతో విలువైన సేవలందించిన సిబ్బందిని
అభినందించిన రైల్వేమంత్రి పీయూష్ గోయెల్
రిటైరైన వారు సమాజ ప్రయోజనాలకు, జాతినిర్మాణానికి కృషిని
కొనసాగించాలని వినతి
తన హాజరుతో రిటైర్మెంట్ ఉత్సవాన్ని మరపురాని కార్యక్రమంగా మార్చిన మంత్రికి సిబ్బంది కృతజ్ఞతలు
Posted On:
02 AUG 2020 12:57PM by PIB Hyderabad
రైల్వేలనుంచి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందికోసం మొదటిసారిగా ఆన్ లైన్ ద్వారా వర్చువల్ రిటైర్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2020 జూలై నెల 31న పదవీ విరమణ చేసిన వారికోసం ఇది నిర్వహించారు. అన్ని రైల్వే జోన్లు, డివిజన్లు, ఉత్పత్తి యూనిట్లలోని రిటైరైన అధికారులు, సిబ్బంది ఒకే వేదికమీదకు చేరిన అపూర్వ సందర్భంగా ఈ కార్యక్రమం రికార్డుకెక్కింది. రిటైరైన 2,320మంది అధికారులు, సిబ్బందితో కలసి రైల్వే మంత్రి ఒకేసారి ముచ్చటించడం రైల్వేల చరిత్రలో ఇదే తొలిసారి. రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, సహాయమంత్రి సురేష్ సి. అంగాడీ, రైల్వే బోర్డు కార్యదర్శి సుశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ రైల్వే అధికారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ,. “ఇది సంతోషం, బాధ కలగలిసిన రోజు..ఉద్యోగులంతా వివిధ ప్రాంతాల్లో, హోదాల్లో తమ సుదీర్ఘకాలం, సేవలందించడం, బాధ్యతలు నిర్వహించడం సంతోషదాయకం. రైల్వేల పనితీరును మెరుగుపరిచేందుకు మీరు చేసిన కృషి, భావి అవసరాలకు అనుగుణంగా రైల్వేలను సిద్ధం చేయడంలో మీరు నిర్వర్తించిన పాత్ర మరువలేనిది. మీ కృషితోనే కేవలం కొన్నేళ్ల వ్యవధిలోనే రైల్వేలలో ఎంతో మెరుగదల కనిపించింది.” అని అన్నారు. “కోవిడ్ మహమ్మారి వ్యాప్తిచెందిన కష్టసమయంలో కూడా సరకు రవాణా రైళ్లు, పార్సెల్ రైళ్లు, శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపారు. మీ కృషివల్లనే రైల్వేశాఖ కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు ఉత్తమ సేవలందించగలిగింది. రైల్వే ఉద్యోగులు కరోనా యుద్ధవీరులకు ఏ మాత్రం తీసిపోరు. కోవిడ్ వైరస్ పై పోరాటంలో ఉత్తమమైన సేవలందించిన సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నాను.” అని గోయెల్ అన్నారు.
జీవిత ప్రయాణంలో రిటైర్మెంట్ అనే ఘట్టం, మార్గమధ్యంలో తారసపడే ఒక స్టేషన్ లాంటిదని, ఎవరైనా రిటైరైన తర్వాత కూడా దేశహితంకోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న పక్షంలో, తదుపరి జీవితంకూడా ఆసక్తికరంగా, ఉత్సాహభరితంగా ఉంటుందని, అలాంటి వారు జీవిత పరిణామదశను ముందుండి నడిపిస్తారని సురేష్ గోయెల్ వ్యాఖ్యానించారు. మన జీవితంలో కొంత కాలాన్ని వెచ్చించి, మన జీవితానుభవాలను దేశ సేవకోసం వినియోగిస్తే మన దేశ భవిష్యత్తు మరింత మెరుగుపడుతుందన్నారు. రాబోయే తరానికి మనం మరింత మెరుగ్గా ప్రోత్సాహం అందించవచ్చని, వారికి మెరుగైన దేశాన్ని అందుబాటులోకి వచ్చేలా చేయగలమని మంత్రి అన్నారు. స్వచ్ఛతకోసం మనం చేసే చిన్న పని కూడా గొప్ప ప్రభావవంతమైన మార్పు కాగలదన్నారు. సమాజంలో చెప్పుకోదగిన మార్పులు తీసుకువచ్చే చిన్న చిన్న పనులను పదవీ విరమణ చేసిన ఉద్యోగులు చేయవచ్చని, వర్షపునీటి పొదుపు, తడి వ్యర్థాలనుంచి ఎరువు తయారీ, రైతుల పంట దిగుబడి పెంచేందుకు సృజనాత్మక మార్గాలపై ఆలోచించడం వంటివి రిటైరైన ఉద్యోగులు చేయవచ్చని మంత్రి సూచించారు.
రైల్వేలనుంచి పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బంది ప్రభుత్వ రంగంలో విస్తృతమైన సేవలిందించిన వారేనని, రిటైర్మెంటు తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సామాన్య ప్రజలకు వారు అవగాహన కల్పించవచ్చని, తద్వారా సామాన్య ప్రజలు ప్రయోజనం పొంది జీవితంలో స్వయంసమృద్ధిని సాధించగలరని అన్నారు. సామాన్య ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఇది వారు చేయగలగిన గొప్ప సేవగా నిలిచిపోగలదన్నారు. పదవీ విరమణ చేసిన వారందించిన విలువైన సేవలను మంత్రి అభినందిస్తూ,..వారి జీవితం మరింత గొప్పగా సాగాలని ఆకాక్షించారు.
రైల్వే సహాయమంత్రి సురేష్ సి. అంగాడీ మాట్లాడుతూ, “ మీ అందరి మధ్యలో కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో సంతోష దాయకం. రైల్వే ఉద్యోగులు నిర్విరామంగా అందించిన సేవలను రైల్వే శాఖ, దేశం ఎప్పటికీ మరిచిపోదు. యువ సిబ్బందిని కార్యోన్ముఖం చేసేందుకు మీ సలహాలు, సూచనలు, ఎప్పటికీ అవసరమే. దేవుడు మీకు మరింత మంచి జీవితం అందించాలని కోరుకుంటున్నాను. రైల్వే ఉద్యోగులు, ఎప్పటికీ రైల్వే ఉద్యోగులే.” అని అన్నారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది రైల్వేమంత్రి, రైల్వే సహాయ మంత్రితో ముచ్చటించారు. స్వయంగా హాజరై కార్యక్రమాన్ని మరుపురానిదిగా మార్చిచనందుకు మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎప్పటికీ రైల్వే కుటుంబంలో భాగంగా ఉంటామని చెప్పారు. రైల్వే శాఖలో మొత్తం 2,320 అధికారులు, సిబ్బంది జూలై 31 పదవీవిరమణ పొందారు.
*****
(Release ID: 1643076)
Visitor Counter : 351