వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్‌భారత్ కోసం సులభతర వాణిజ్యంపై సిఐఐ జాతీయ డిజిటల్ కాన్ఫరెన్సును ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
ఎం.ఇ.ఐ.ఎస్ కు సంబంధించిన అంశాల సత్వర పరిష్కారానికి కృషిచేస్తున్న వాణిజ్య మంత్రిత్వశాఖ: శ్రీ పియూష్ గోయల్
Posted On:
30 JUL 2020 5:11PM by PIB Hyderabad
వివిధ విధానాలను సులభతరం చేసేందుకు, ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై పరిశ్రమ వర్గాలు తమ స్పందన తెలపాలని, సహకారం అందించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు. ఆత్మనిర్భర భారత్ కోసం సులభతర వాణిజ్యంపై ఈరోజు సిఐఐ జాతీయ డిజిటల్ సదస్సును ప్రారంభిస్తూ ఆయన, పరిశ్రమల అనుమతులకు ఏకగవాక్ష విధానం త్వరలోనే వస్తుందని నొక్కిచెప్పారు.ప్రభుత్వం, పరిశ్రమవర్గాలు భాగస్వాములుగా కలసి పనిచేయాలని, పన్ను ఎగవేతదారులు, ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించేందుకు సానుకూల పాత్ర వహించాల్సిందిగా ఆయన పరిశ్రమవర్గాలకు పిలుపునిచ్చారు.
కోవిడ్ పరిస్థితిపై మాట్లాడుతూ మంత్రి, ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్నదని, పరిమితులు తాత్కాలికమేనని అవికూడా ఇప్పడు సడలింప బడుతున్నాయని అన్నారు.కోవిడ్ సంక్షోభ సమయంలో దేశ సేవల రంగం, అంతర్జాతీయ క్లయింట్లకు తమ సేవలు అందించిందన్నారు. భారతదేశ ఎగుమతులు దాదాపు 88 శాతం లోను, దిగుమతులు దాదాపు 75 శాతం గత ఏడాది ఇదే కాలానికి పోలిస్తే ఉన్నాయని ఆయన చెప్పారు..“ వ్యాపారం తిరిగి పుంజుకుంటున్నద” ని ఆయన అన్నారు. వెంటిలేటర్ల ఎగుమతి పై ఆంక్షలు త్వరలోనే తొలగించడం జరుగుతుందని మంత్రి చెప్పారు. సులభతర కార్మిక చట్టాలు తీసుకువచ్చేందుకు, ల్యాండ్ బ్యాంక్‌పోర్టల్ ప్రారంభం, పెట్టుబడులకు సింగిల్ విండో క్లియరెన్సులు ఇచ్చేందుకు కేంద్రం రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నదని ఆయన అన్నారు.
ఎగుమతులకు ప్రోత్సాహకాల గురించి మర్చండైజ్ ఎక్స్పోర్ట్ ఫ్రం ఇండియా స్కీమ్ (ఎం.ఇ.ఐ.ఎస్) గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి పియూష్ గోయల్, ప్రభుత్వం సత్వర పరిష్కారం కోసం చూస్తున్నదని, ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపని రీతిలో పరిష్కారానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.“ మేం సంబంధిత అథారిటీలతో చర్చలు జరుపుతున్నాం. ఎం.ఇ.ఐ.ఎస్ ఎక్కడికీ పోదు. ఇది నగదు సరఫరా సమస్య. మేం సత్వర పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. అది ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది” అని ఆయన అన్నారు.
దేశంలో పెట్టుబడులకు ఫైనాన్సును ప్రోత్సహించేందుకుగల మార్గాలను ఆర్థిక మంత్రిత్వశాఖ పరిశీలిస్తున్నదని కూడా పియూష్ గోయల్ తెలిపారు . వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉందని బ్యాంకులు ప్రభుత్వానికి హామీ ఇచ్చాయని ఆయన అన్నారు. తమ మంత్రిత్వశాఖ ప్రత్యేక దృష్టితో ప్రోత్సహించేందుకు 20 పారిశ్రామిక రంగాలను గుర్తించిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చట్టాలను డీ క్రిమినలైజ్‌చేయడానికి కృషి చేస్తున్నదని, పనికిరాని చట్టాలను తొలగిస్తున్నదని ఆయన చెప్పారు.
పరిశ్రమలకు సహాయ పడడానికి సరళమైన కార్మిక చట్టాలు ఉండాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ శ్రీ పియూష్ గోయల్, కేంద్ర ప్రభుత్వం 16 రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదిస్తున్నదని, వారి నుంచి ప్రతిపాదనలను అందుకున్నదని ఆయన చెప్పారు.“ మేం వారి ఆలోచనలను సాధారణీకరించడానికి ప్రయత్నిస్తున్నాం. కార్మిక చట్టాల వాతావరణాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలు ఎలాప్రయత్నించగలవో పరిశీలిస్తున్నాం,” అని ఆయన అన్నారు.
ఇండియాలో పరిశ్రమలకు భూమి అందుబాటుకు సంబంధించిన చింతలు కనపించ లేదని, వేలాది ఎకరాల భూమి ఇప్పటికే గుర్తించడం జరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్న భూమితో కేంద్రం ల్యాండ్ బ్యాంక్ ను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నదని, ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆరు రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేశాయని ఆయన తెలిపారు.
పెట్టుబడులకు ప్రతిపాదిత సింగిల్ విండో వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ , శ్రీ పియూష్ గోయల్, అన్ని మంచి విధానాలను ఒక వేదికమీదికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని, సింగిల్ విండో విధానం సక్రమమైనదిగా ఉంటుందని ఆయన చెప్పారు. సింగిల్ విండొ విధానాన్ని వేగవంతం చేసేందుకు తమ బృందం రాష్ట్రాలతో నిరంతరం సంప్రదిస్తున్నట్టు ఆయన చెప్పారు.
***
(Release ID: 1642837)