వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

పారిశ్రామిక ఆమోదాలు, అనుమ‌తుల‌కు ఏక‌గ‌వాక్ష విధానం త్వ‌ర‌లో ఏర్పాటు

భూబ్యాంకుఏర్పాటుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌న్న కేంద్ర మంత్రి పియూష్ గోయ‌ల్‌

ఇందుకు ఇప్ప‌టికే ఆరు రాష్ట్రాలు త‌మ ఆమోదం తెలిపాయ‌న్న‌మంత్రి

దేశ ప్ర‌గ‌తి క‌థ‌లో పాలుపంచుకొవ‌ల‌సిందిగా పిలుపునిస్తూ మంత్రి, రిస్కు రివార్డు మాట్రిక్స్ భార‌త్ కు అత్యంత అనుకూలంగా ఉంద‌న్నారు.

Posted On: 27 JUL 2020 6:20PM by PIB Hyderabad

దేశంలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు , ఆమోదాల‌కు ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే ఒక ఏక‌గ‌వాక్ష విధానాన్ని (సింగిల్ విండో) తీసుకురానున్న‌ట్టు కేంద్ర వాణిజ్యం, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ తెలిపారు. విదేశీ వెల్త్ ఫండ్‌లు, విదేశీ పెన్ష‌న్ ఫండ్‌లు, ఇత‌రుల‌నుద్దేశించి సుల‌భ‌త‌ర వాణిజ్యం, పెట్టుబ‌డులు, మౌలిక‌స‌దుపాయాల  రంగంపై మాట్లాడుతూ ఆయ‌న ఈవిష‌యం చెప్పారు. ఇది నిజ‌మైన సింగిల్ విండో గా ప‌నిచేస్తుంద‌ని, సంబంధిత రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు, కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

ప్ర‌భుత్వం భూబ్యాంక్ ఏర్పాటుపై కృషి చేస్తున్న‌ద‌ని, ఇందుకు ఆరు రాష్ట్రాలు ఇప్ప‌టికే త‌మ ఆమోదాన్ని తెలిపాయన్నారు. త‌గిన స‌మ‌ర్ద‌త క‌లిగిన ఇన్వెస్ట‌ర్లు, దీని ద్వారా భూబ్యాంక్‌ల‌ను ఎక్క‌డో సుదూర ప్రాంతాల‌లోని త‌మ కార్యాల‌యాల‌నుంచే ఎంపిక చేసి గుర్తించ‌డానికి, త‌ద్వారా ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు స్థ‌లాన్ని గుర్తించ‌డానికి , త‌ర‌చూ ఆఫీసులు, భూమి క‌లిగిన ఏజెన్సీల చుట్టూ తిర‌గ‌కుండా ఉండ‌డానికి ఇది దోహ‌ద‌ప‌డుతుందన్నారు.
ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌కు సంబంధించిన అనుమ‌తుల ప్ర‌క్రియ‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేయడానికి  ఇటీవ‌ల కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణ‌యాన్ని కూడా మంత్రి ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. ప‌రిశ్ర‌మ‌ల‌కు సంబంధించిన వివిధ ప‌థ‌కాలు, ప్రాజెక్టుల‌పై నిర్ణ‌యం తీసుకునేందుకు కేంద్ర కేబినెట్ కార్య‌ద‌ర్శి నేతృత్వంలో ఒక కార్య‌ద‌ర్శుల బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు.
 ప్ర‌తి కేంద్ర ప్ర‌భుత్వ విభాగానికి ఒక నోడ‌ల్ అధికారిని నియ‌మించ‌డం జ‌రిగింద‌ని, ప్రాజెక్టు డ‌వ‌ల‌ప్ మెంట్ సెల్‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, దీనివ‌ల్ల  కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి అనువైన ప్రాజెక్టుల అభివృద్ధికి వీలు క‌లుగుతుంద‌న్నారు. దీని‌వ‌ల్ల పెట్టుబ‌డులు త‌ర‌లి రాగ‌ల ప్రాజెక్టులు పెరిగి, దేశంలోకి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు పెద్ద ఎత్తున వ‌స్తాయ‌న్నారు.
ప్ర‌భుత్వం తొలుత  ప్రాథ‌మికంగా దృష్టిపెట్ట‌డానికి 12 ప‌రిశ్ర‌మ‌ల‌ను గుర్తించింద‌ని, వీటిని ఆ త‌ర్వాత 20 పారిశ్రామిక రంగాల‌కు పెంచిన‌ద‌న్నారు. పెట్టుబ‌డులు పెంచ‌డానికి, దేశాన్ని అంత‌ర్జాతీయ పోటీలో ముందుచ‌డానికి ఇది వీలు క‌లిగిస్తుంద‌ని చెప్పారు. ప్ర‌భుత్వం గుర్తించిన‌ రంగాల‌లో ఫ‌ర్నీచ‌ర్‌, స్టాండ‌ర్డ్‌, స్పెష‌ల్ ఫ‌ర్నీచ‌ర్‌, ఎయిర్ కండిష‌న‌ర్లు, తోలు , పాద‌ర‌క్ష‌లు, ఆగ్రో కెమిక‌ల్స్, త‌యారైన ఆహార ప‌దార్ధ‌లు, స్టీలు, అల్యూమినియం, రాగి, టెక్స్‌టైల్‌, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, ఆటో విడిభాగాలు, టివి సెట్ టాప్ బాక్స్‌లు, సిసిటివిలు, క్రీడా వ‌స్తువులు, ఇథ‌నాల్ త‌యారీ, జీవ ఇంధ‌నాలు, బొమ్మ‌లు వంటివి ఉన్నాయి. ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అంటే ప్ర‌పంచానికి త‌లుపులు మూయ‌డం కాద‌ని,  భార‌తీయ ఉత్ప‌త్తుల నాణ్య‌త‌పై మ‌రింత దృష్టి పెడుతూ , భార‌తీయ అవ‌కాశాల‌కు, పెట్టుబ‌డుల‌కు త‌లుపు‌లు మ‌రింతగా తెర‌వ‌డ‌మే న‌ని ఆయ‌న అన్నారు. ఇది భార‌త‌దేశ ఉత్ప‌త్తికి సంబంధించిన ఆర్ధిక‌వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌రింత ముందుకు తీసుకుపోతుంద‌న్నారు. భార‌త‌దేశం త‌న కు గ‌ల బ‌లం నుంచి ప్ర‌పంచ పోటీని ఎదుర్కోవ‌డ‌మే కాక‌, అత్యుత్త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని, ప‌రిక‌రాల‌ను అందిపుచ్చుకుంటుందన్నారు. ప‌రిశ్ర‌మ కృత్రిమ మేథ‌ను, డాటాఅన‌లిటిక్స్‌, రోబోటిక్‌, ఇత‌ర ఉత్త‌మ ప‌ద్ధ‌తుల‌ను అందిపుచ్చుకోవాలని చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వాడ‌డ‌మంటేఏర‌కంగానూ అది ఉద్యోగాలు కోల్పోవ‌డం కాద‌ని, దేశంలో ఉత్ప‌త్తి పెర‌గ‌డం వ‌ల్ల అది మ‌రిన్ని ఉద్యోగాల క‌ల్ప‌న‌కు అవ‌కాశం క‌ల్పిస్తుంద‌ని పియూష్ గోయ‌ల్‌ అన్నారు.

 ఆరోగ్యం, విద్య రంగాల‌లో విదేశీ పెట్టుబ‌డుల‌కు అవ‌స‌ర‌మైన సానుకూల వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. విధానాలు, ప్ర‌క్రియ‌ల‌ను, నియంత్ర‌ణ‌లు, వీట‌న్నింటికీ సంబందించి ఇన్వెస్ట‌ర్ల‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌ని, ప్ర‌తి ఒక్క‌టీ పార‌ద‌ర్శ‌కంగా, బాహాటంగా, న్యాయ‌బ‌ద్ధంగా ఉంటుంద‌ని చెప్పారు. ఇన్వెస్ట‌ర్ల‌కు సంబంధించిన మ‌రికొన్ని అంశాల‌కు స‌మాధాన‌మిస్తూ పియూష్ గోయ‌ల్, ప్ర‌త్యేక ఆర్ధిక మండ‌ళ్ళ‌పై బాబా క‌ళ్యాణి నివేదిక‌ను త‌మ మంత్రిత్వ‌శాఖ ప‌రిశీలిస్తున్న‌ద‌ని చెప్పారు. కార్మిక సంస్క‌ర‌ణ‌ల గురించి ప్రస్తావిస్తూ, కార్మికుల ప్ర‌యొజ‌నాలు, ఇన్వెస్ట‌ర్ల‌ప్ర‌యోజ‌నాల‌కు మ‌ధ్య స‌మ‌తూకం పాటించాల్సి ఉంద‌ని శ్రీ‌ గోయ‌ల్ అన్నారు.

క‌రోనా మ‌హ‌మ్మారికి సంబంధించి దేశంలో విధించిన లాక్‌డౌన్ గురించి ప్ర‌స్తావిస్తూ శ్రీ పియూష్ గోయ‌ల్‌, ప్ర‌భుత్వం స‌రైన రీతిలో ప్ర‌జ‌ల ప్రాణాల‌పై దృష్టిపెట్టి ప్ర‌పంచంలోనే ఎక్క‌డా లేని విధంగా లాక్‌డౌన్‌ను అమ‌లు చేసింద‌న్నారు. దీర్ఘాక‌లికంగా ఇది క‌రోనాను అదుపు చేయ‌డంలో ముఖ్య‌మైన‌దిగా తేలింద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం దేశం, జీవితాలను కాపాడుకోవ‌డంతోపాటు, జీవ‌నోపాధిపై దృష్టిపెడుతున్న‌ద‌ని, ఇప్ప‌డు మ‌నం అన్‌లాక్‌ద‌శ‌లో ఉన్నామ‌ని అన్నారు. దేశంలో ఆర్థిక కార్య‌క‌లాపాలు    
ఇప్ప‌టికే గౌర‌వ‌ప్ర‌దమైన స్థాయికి చేరాయ‌ని,  ఇందుకు సంబంధించి ప‌లు సూచిక‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చ‌ని అన్నారు. మ‌నం ఇప్ప‌డు మూడు, నాలుగ‌వ త్రైమాసికాల‌లో ప్ర‌గ‌తిని చూడ‌బోతున్నామ‌న్నారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రభుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను అద్బుత‌మైన‌విగా ప్ర‌పంచం గుర్తించింద‌ని ఆయ‌న చెప్పారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇండియా ఆరోగ్య రంగ మౌలిక స‌దుపాయాల‌ను  పెద్ద ఎత్తున చేప‌ట్ట‌గ‌లిగింద‌ని, దేశీయంగా పెద్ద సంఖ్య‌లో పిపిఇలు, వెంటిలేట‌ర్ల త‌యారీలో  సాధించిన స్వావ‌లంబ‌న ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అలాగే రోజూ పెద్ద సంఖ్య‌లో కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతున్న‌ద‌న్నారు.
 ఇండియాకు రిస్క్ రివార్డు మాట్రిక్స్ ఎంతో అనుకూలంగా ఉంద‌ని, దేశం పెట్టుబ‌డుల‌కు గొప్ప గ‌మ్య‌స్తానంగా ఉంద‌ని, దేశంలో  మెరుగైన జీవ‌న విధానాన్ని కాంక్షిస్తూ ఎగువ‌కు ఎదుగుతున్న‌జ‌నాభా నానాటికీ పెరుగుతున్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఇండియాలో పెట్టుబ‌డుల‌కు వీలుగా అన్నిర‌కాల మ‌ద్ద‌తు ఇవ్వ‌నున్నామ‌ని శ్రీ‌ పియూష్ గోయ‌ల్ తెలిపారు.భార‌త‌దేశ ప్ర‌గ‌తి క‌థలో భాగ‌స్వాములు కావ‌ల‌సిందిగా విదేశీ ఇన్వెస్ట‌ర్ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. దేశంలో సుల‌భ‌త‌ర‌వాణిజ్యాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవ‌డానికి ఈ స‌మావేశంలోపాల్గొన్న‌వారు ప‌లు సూచ‌న‌లు చేశారు. వీటిని వీలైనంత త్వ‌ర‌గా ప‌రిశీలించడం జ‌రుగుతుంద‌ని శ్రీ గోయ‌ల్ వారికి హామీ ఇచ్చారు.

***



(Release ID: 1641734) Visitor Counter : 271