ప్రధాన మంత్రి కార్యాలయం
‘మన్ కీ బాత్’ రెండోవిడత 14వ సంచికలో భాగంగా 26.07.2020న ప్రధానమంత్రి ప్రసంగం
Posted On:
26 JUL 2020 11:39AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. ఈ రోజు జూలై 26. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు 'కార్గిల్ విజయ దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 21 సంవత్సరాల క్రితం ఈ రోజు, కార్గిల్ యుద్ధంలో భారతదేశ విజయోత్సవ జెండాను మన సైన్యం ఎగురవేసింది. మిత్రులారా! కార్గిల్ యుద్ధం జరిగిన పరిస్థితులను భారతదేశం ఎప్పటికీ మరచిపోలేము. భారతదేశ భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి, అంతర్గత అసమ్మతి నుండి దృష్టిని మళ్ళించడానికి పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. పాకిస్తాన్‌తో భారతదేశం మంచి సంబంధాల కోసం అప్పట్లో ఎదురుచూసింది. కాని ఒక లోకోక్తి ఉంది కదా.. అకారణ కలహం దుర్మార్గుల స్వభావం అని.
అటువంటి స్వభావం గల వ్యక్తులు వారి హితవు కోరే వారికి కూడా నష్టం కలిగించేందుకు ఆలోచిస్తారు. అందుకే భారత స్నేహానికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ తరువాత భారతదేశ పరాక్రమాన్ని సైన్యం రుచి చూపించింది. మన సైన్య పరాక్రమాన్ని ప్రపంచం కూడా చూసింది. మీరు అనుకోవచ్చు - ఎత్తైన పర్వతాలపై కూర్చున్న శత్రువుల కు క్రింద నుండి పోరాడిన మన సైన్యాలు ఎలా జవాబు చెప్పగలిగాయని . కానీ విజయం పర్వత ఎత్తులలో లేదు.. భారత సైనిక దళాల ధైర్యం, వాస్తవమైన శౌర్యంలో ఉంది. మిత్రులారా! ఆ సమయంలో నేను కార్గిల్‌కు వెళ్లి మన సైనికుల శౌర్యాన్ని చూసే అదృష్టాన్ని కూడా పొందాను. ఆ రోజు నా జీవితంలో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి. ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రజలు కార్గిల్ విజయాన్ని గుర్తుంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో #courageinkargil అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజలు తమ హీరోలకు నమస్కరిస్తూ, మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నారు. నేను ఈ రోజు దేశంలోని ప్రజలందరి తరపున మన ఈ వీర సైనికులతో పాటు, భారత మాత నిజమైన కుమారులకు జన్మనిచ్చిన వీరనారీమణులైన వారి తల్లులకు కూడా నమస్కరిస్తున్నాను.
కార్గిల్ విజయంతో సంబంధం ఉన్న మన వీర సైనికుల కథలతోపాటు, వారి తల్లుల త్యాగం గురించి యువత ఒకరితో ఒకరు పంచుకోవాలని నేను కోరుతున్నాను. మిత్రులారా! ఈ రోజు నేను మీకు ఒక అభ్యర్థన చేస్తున్నాను. Www.gallantryawards.gov.in అనే వెబ్‌సైట్ ఉంది. మీరు ఆ వెబ్ సైట్ తప్పక సందర్శించాలి. మన ధైర్యవంతులైన శక్తివంతమైన యోధుల గురించి, వారి శక్తి గురించి మీకు చాలా సమాచారం లభిస్తుంది. ఆ సమాచారాన్ని మీరు మీ సహచరులతో చర్చించినప్పుడు - వారికి కూడా ప్రేరణకు ఒక కారణం అవుతుంది. మీరు ఈ వెబ్‌సైట్‌ను తప్పక సందర్శించాలి. మళ్ళీ మళ్ళీ ఆ వెబ్ సైట్ చూడండి.
మిత్రులారా! కార్గిల్ యుద్ధంలో ఎర్రకోటలో అటల్ జీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడం ఈ రోజు చాలా సందర్భోచితం. అటల్ జీ అప్పుడు గాంధీజీ పేర్కొన్న సూత్రాలలో ఒకదాన్ని దేశానికి గుర్తు చేశారు. మహాత్మా గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయంలో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి గురించి ఆలోచించాలి. అతను చేయబోయేది ఆ వ్యక్తికి మంచిది కాదా అని అతను అనుకోవాలి. గాంధీజీ ఈ ఆలోచనను మించి కార్గిల్ యుద్ధం మనకు రెండవ సూత్రాన్ని కూడా చెప్తోందని అటల్ జీ చెప్పారు. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ దుర్గమమైన కొండలలో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలని ఆయన అభిప్రాయం. అటల్ జీ పేర్కొన్న ఈ స్ఫూర్తిని ఆయన గొంతులోనే విందాం.
అటల్ జీ సౌండ్ బైట్
"గాంధీజీ ఒక సూత్రం పేర్కొన్నారని మనందరికీ గుర్తుంది. మహాత్మా గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయంలో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి గురించి ఆలోచించాలి. అతను చేయబోయేది ఆ వ్యక్తికి మంచిది కాదా అని అతను అనుకోవాలి. కార్గిల్ యుద్ధం మనకు రెండవ సూత్రాన్ని కూడా చెప్తోంది. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ దుర్గమమైన కొండలలో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి’’
మిత్రులారా! యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పే విషయాలు, మన చర్యలు సరిహద్దులోని సైనికుడి ధైర్యంపై , అతని కుటుంబ మనో బలం పై చాలా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. దీన్ని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. అందుకే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ప్రసంగాలు, మన ప్రకటనలు, మన గౌరవం, మన లక్ష్యాలు అన్నీ సైనికుల మనోధైర్యాన్ని పెంచేలా ఉండాలి. వారి గౌరవాన్ని పెంచాలి. అత్యున్నతమైన ఐక్యతా బంధంలో కట్టుబడి ఉన్న దేశవాసులు మన సైనికుల బలాన్ని అనేక వేల రెట్లు పెంచుతారు. ఈ కాలంలో సంఘ శక్తే బలమన్న లోకోక్తి ఉంది కదా.
కొన్నిసార్లు మన దేశానికి చాలా హాని కలిగించే ఇలాంటి విషయాలను అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో కొన్ని విషయాలను ప్రోత్సహిస్తాం. కొన్నిసార్లు ఇలాంటి వాటిని ఫార్వర్డ్ చేస్తూంటాం. చేస్తూనే ఉంటాం. ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అవి దేశంలోని వివిధ రంగాలలో ఒకేసారి జరుగుతాయి. ప్రతి పౌరుడు అందులో తన పాత్రను నిర్ణయించుకోవాలి. దేశ సరిహద్దులలో క్లిష్ట పరిస్థితులలో పోరాడుతున్న సైనికులను గుర్తుచేసుకుంటూ మన పాత్రను కూడా నిర్ణయించుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఐక్యంగా, కరోనాకు వ్యతిరేకంగా పోరాడిన విధానం చాలా భయాలను తప్పుగా నిరూపించింది. ఈ రోజు మన దేశంలో రికవరీ రేటు ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంది. అలాగే, మన దేశంలో కరోనా మరణాల రేటు కూడా ప్రపంచంలోని చాలా దేశాల కంటే చాలా తక్కువగా ఉంది. ఒక్క వ్యక్తిని కూడా కోల్పోవడం విచారకరం. అయితే లక్షలాది మంది దేశవాసుల ప్రాణాలను రక్షించడంలో భారతదేశం విజయం సాధించింది. కానీ మిత్రులారా! కరోనా ముప్పు తొలిగిపోలేదు. ఇది చాలా చోట్ల వేగంగా వ్యాపిస్తోంది. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. కరోనా ప్రారంభంలో ఉన్నంత ఘోరం గానే ఉందని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల మనం పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖానికి మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం, తరచుగా చేతులు కడుక్కోవడం, ఎక్కడా ఉమ్మివేయకపోవడం, శుభ్రత గురించి పూర్తిగా జాగ్రత్త వహించడం - ఇవి కరోనా నుండి రక్షించడంలో మన ఆయుధాలు. కొన్నిసార్లు మనకు మాస్క్ తో ఇబ్బంది ఉంటుంది. ముఖం నుండి మాస్కును తొలగించాలని అనిపిస్తుంది. అప్పుడే ముచ్చట్లు పెడుతూ ఉంటాం. మాస్క్ మరింత అవసరమైనప్పుడే మనం దాన్ని తొలగిస్తాం. ముసుగు కారణంగా మీకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా, ఒక్క క్షణం, ఆ వైద్యులను గుర్తు తెచ్చుకోండి, ఆ నర్సులను గుర్తు తెచ్చుకోండి, ఆ కరోనా వారియర్స్ ను గుర్తు తెచ్చుకోండి. గంటల తరబడి నిరంతరం మాస్క్ ధరించి, అందరి ప్రాణాలను కాపాడటానికి వాళ్ళు చేసే కృషిని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎనిమిది నుండి పది గంటలు మాస్క్ ధరిస్తారు. వాళ్ళు ఇబ్బంది పడడం లేదా? వారిని కొంచెం గుర్తు తెచ్చుకోండి. నాగరికులుగా మాస్క్ మనం తీసివేయకూడదు. మరొకరిని తీసివేయనీయ కూడదు. ఒక వైపు మనం పూర్తి అప్రమత్తతతో కరోనాతో పోరాడాలి. మరోవైపు మనం చేసే వ్యవసాయం, ఉద్యోగం, చదువు.. మనం చేసే ఏ పనిలో అయినా వేగం సాధించాలి. మిత్రులారా! కరోనా కాలంలో మన గ్రామీణ ప్రాంతాలు మొత్తం దేశానికి దిశానిర్దేశం చేశాయి. పౌరులు, గ్రామ పంచాయతీలు చేసిన కృషి వివరాలు, వారి ప్రయత్నాల వివరాలు గ్రామాల నుండి నిరంతరం వస్తున్నాయి. జమ్మూలో త్రేవ అనే గ్రామ పంచాయతీ ఉంది. బల్బీర్ కౌర్ గారు అక్కడి సర్పంచ్. బల్బీర్ కౌర్ గారు తన పంచాయతీలో 30 పడకల క్వారంటైన్ కేంద్రాన్ని నిర్మించారని నాకు తెలిసింది. పంచాయతీకి వచ్చే మార్గాల్లో నీటి కోసం ఏర్పాట్లు చేశారు. చేతులు కడుక్కోవడంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఏర్పాట్లు చేశారు. ఇది మాత్రమే కాదు, బల్బీర్ కౌర్ గారు స్వయంగా, భుజంపై వేలాడుతున్న స్ప్రే పంపుతో, వాలంటీర్లతో కలిసి, మొత్తం పంచాయతీలో, చుట్టుపక్కల ప్రాంతాలలో శానిటైజేషన్ పనిని కూడా చేస్తారు. అలాంటి మరో కాశ్మీరీ మహిళ సర్పంచ్ విషయం కూడా చెప్తాను. గాందర్ బల్ లోని చౌంట్ లీవార్ గ్రామానికి చెందిన జైతునా బేగం. తన పంచాయతీ కరోనాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తుందని జైతునా బేగం నిర్ణయం తీసుకున్నారు. సంపాదించడానికి అవకాశాలను కూడా ఏర్పరచాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతం అంతటా ఉచిత మాస్కులు, ఉచిత రేషన్ పంపిణీ చేశారు ఆమె. ప్రజలకు వివిధ పంటల కు సంబంధించిన విత్తనాలతో పాటు ఆపిల్ మొక్కల విత్తనాలను కూడా ఇచ్చారు. తద్వారా ప్రజలు వ్యవసాయం, తోటపనులలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూశారు.
మిత్రులారా! కాశ్మీర్ నుండి వచ్చిన మరో ఉత్తేజకరమైన సంఘటన చెప్తాను. అనంతనాగ్ లోని మునిసిపల్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇక్బాల్ గారికి సంబంధించిన సంఘటన ఇది. ఆ ప్రాంతంలో శానిటైజేషన్ కోసం ఒక స్ప్రేయర్ అవసరం. యంత్రాన్ని మరొక నగరం నుండి తీసుకురావాల్సి ఉంటుందని, ఖర్చు ఆరు లక్షల రూపాయలు అవుతుందని ఆయన తెలుసుకున్నారు. అప్పుడు ఇక్బాల్ గారు స్వయంగా ప్రయత్నించి, ఒక స్ప్రేయర్ యంత్రాన్ని తయారుచేశారు. అది కూడా కేవలం యాభై వేల రూపాయల డబ్బుతో మాత్రమే. ఇలాంటి ఉదాహరణలు ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి అనేక ఉత్తేజకరమైన సంఘటనలు ప్రతిరోజూ దేశంలోని ప్రతి మూల నుండీ ముందుకు వస్తున్నాయి. వారందరూ శుభాకాంక్షలు అందుకునేందుకు అర్హులు. అధికారులు. సవాలు ఎదురైంది. కానీ ప్రజలు ఆ సవాలుకు సమాన బలంతో దాన్ని ఎదుర్కొన్నారు.
నా ప్రియమైన దేశ వాసులారా! విపత్తును అవకాశంగా, విపత్తును అభివృద్ధిగా మార్చడంలో సరైన సానుకూల విధానంతో ఉండడం సహాయపడుతుంది. ప్రస్తుతం కరోనా సమయంలో మన దేశంలోని యువత, మహిళలు వారి ప్రతిభ, నైపుణ్య శక్తి తో కొన్ని కొత్త ప్రయోగాలను ఎలా ప్రారంభించారో కూడా చూస్తున్నాం. బీహార్‌లోని చాలా మహిళా స్వయం సహాయక బృందాలు మధుబని పెయింటింగ్‌తో మాస్కులు తయారు చేయడం ప్రారంభించాయి. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మధుబని మాస్కులు తమ సంప్రదాయాన్ని ఒక విధంగా ప్రచారం చేస్తాయి. ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఉపాధి కూడా అందజేస్తాయి. ఈశాన్యంలో వెదురు ఎంత పుష్కలంగా లభిస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఈ వెదురు నుండి త్రిపుర, మణిపూర్, అస్సాం కళాకారులు అధిక నాణ్యత గల నీటి సీసాలు, టిఫిన్ డబ్బాలను తయారు చేయడం ప్రారంభించారు. మీరు వాటి నాణ్యతను చూస్తే ఆశ్చర్యపోతారు. వెదురుతో అంత చక్కటి సీసాలు తయారయ్యాయంటే మీరు నమ్మరు. ఈ సీసాలు పర్యావరణ పరంగా అనుకూలమైనవి. వాటి తయారీలో వెదురును మొదట వేప, ఇతర ఔషధ మొక్కలతో ఉడకబెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఔషధ గుణాలు కూడా వీటికి వస్తాయి.
చిన్న చిన్న స్థానిక ఉత్పత్తులు గొప్ప విజయాన్ని ఎలా ఇస్తాయో చెప్పేందుకు జార్ఖండ్ కూడా ఒక ఉదాహరణ గా నిలుస్తుంది. జార్ఖండ్‌లోని బిషున్‌పూర్‌లో 30 కి పైగా బృందాలు ఉమ్మడిగా లెమన్ గ్రాస్ ని సాగు చేస్తున్నాయి. ఈ నిమ్మకాయ గడ్డి నాలుగు నెలల్లో తయారవుతుంది. దాని నూనెను మంచి ధరలకు మార్కెట్లో విక్రయిస్తారు. ఈ రోజుల్లో దీనికి చాలా డిమాండ్ ఉంది. నేను దేశంలోని రెండు ప్రాంతాల గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రెండూ ఒకదానికొకటి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారతదేశాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్లేందుకు వివిధ మార్గాలలో కృషి చేస్తున్నాయి. వాటిలో ఒకటి లద్దాఖ్, మరొకటి కచ్. లే, లద్దాఖ్ పేర్లు వింటే అందమైన మైదానాలు, ఎత్తైన పర్వతాల దృశ్యాలు మన ముందు కనబడతాయి. స్వచ్ఛమైన గాలి అందించే శ్వాసను అనుభూతి చెందుతాం. అదే సమయంలో కచ్ పేరు చెప్తే సుదూరంగా ఉండే ఎడారి, కనుచూపు మేరలో చెట్లు, మొక్కలు కూడా కనబడని ప్రాంతం మన కళ్ల ముందు కనబడుతుంది. లద్దాఖ్ లో పండే నేరేడు పండు ప్రత్యేకమైనది. ఈ పంటకు ఆ ప్రాంత ఆర్ధికవ్యవస్థను మార్చే సామర్థ్యం ఉంది. కానీ, ఇది సరఫరా చేసే క్రమంలో అనేక సవాళ్లతో ముడిపడి ఉంది. దాని సరఫరాలో వ్యర్థాలను తగ్గించడానికి ఒక కొత్త ఆవిష్కరణను ఉపయోగించడం ప్రారంభించారు. దాన్నే solar apricot dryer and space heater అంటారు. ఇది నేరేడు పండుతో పాటు ఇతర పండ్లను, కూరగాయలను కూడా ఆరబెడుతుంది. ఇది చాలా పరిశుభ్రమైన పద్దతి. గతంలో పొలాల దగ్గర ఈ యాప్రికాట్ లను ఎండబెట్టే పరిస్తితుల్లో వృధా ఎక్కువ అయ్యేది. దుమ్ము, ధూళి, వర్షపు నీటి కారణంగా పండ్ల నాణ్యత కూడా ప్రభావితమయ్యేది. మరోవైపు, ఈ రోజుల్లో కచ్‌లోని రైతులు డ్రాగన్ Fruits ను పండించడానికి ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది విన్నప్పుడు ఆశ్చర్యపోతారు – కచ్ లో డ్రాగన్ Fruits గురించి చెప్తే చాలా మంది ఆశ్చర్య పోతారు. కానీ, అక్కడ నేడు చాలా మంది రైతులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పండ్ల నాణ్యత ను పెంచడం, తక్కువ భూమిలో ఎక్కువ పంట పండించడం మొదలుకొని అనేక ఆవిష్కరణలు జరుగుతున్నాయి. డ్రాగన్ Fruits కు ప్రజాదరణ నిరంతరం పెరుగుతోందని నాకు చెప్పారు. ముఖ్యంగా అల్పాహారంలో దీని వాడకం గణనీయంగా పెరిగింది. దేశం డ్రాగన్ పండ్లను దిగుమతి చేసుకోకూడదని కచ్ రైతులు సంకల్పించారు. ఇది స్వయం సమృద్ధికి సంబంధించిన విషయం.
మిత్రులారా! మనం వినూత్నంగా ఆలోచించినప్పుడు ఎవరూ ఊహించని పనులు కూడా సాధ్యమవుతాయి, ఉదాహరణకు బీహార్‌లోని కొంతమంది యువకుల కృషి చూద్దాం. వారు అంతకుముందు సాధారణ ఉద్యోగాలు చేసేవారు. ఒక రోజు వారు ముత్యాలను పండించాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రాంతంలో ప్రజలకు దీని గురించి పెద్దగా తెలియదు. దాంతో వారు మొదట సమాచారాన్ని సేకరించారు. జైపూర్, భువనేశ్వర్ వెళ్లి శిక్షణ తీసుకొన్నారు. తమ గ్రామంలోనే ముత్యాల సాగు ప్రారంభించారు. నేడు వాళ్ళు దీని నుండి చాలా సంపాదిస్తున్నారు. వారు ముజఫర్పూర్, బేగుసరై, పాట్నాలో ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చే వలస కూలీలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. చాలా మందికి ఇది స్వావలంబనకు దారులు తెరిచింది.
మిత్రులారా! కొద్ది రోజుల తరువాత రక్షాబంధన్ పవిత్ర పండుగ వస్తోంది. చాలా మంది ప్రజలు, సంస్థలు ఈసారి రక్షాబంధన్ ను వైవిధ్యంగా జరుపుకోవాలని ప్రచారం చేస్తున్నట్లు నేను చూస్తున్నాను. చాలా మంది దీనిని స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి అనుసంధానిస్తున్నారు. ఇది నిజం. మన పండుగ, మన సమాజం. మన ఇంటికి సమీపంలో ఉన్న వ్యక్తి వ్యాపారం పెరగాలి. తద్వారా వారికి కూడా పండుగ సంతోషంగా ఉంటుంది. అప్పుడు, పండుగ ఆనందం విభిన్నంగానే ఉంటుంది. దేశ ప్రజలందరికీ రక్షా బంధన్ సందర్భంగా అనేక శుభాకాంక్షలు.
మిత్రులారా! ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం. భారత హస్తకళకు వందల సంవత్సరాల అద్భుతమైన చరిత్ర ఉంది. చేనేతను, హస్తకళను భారతీయులు వీలైనంత ఎక్కువగా ఉపయోగించాలని మనందరం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా భారతదేశ చేనేత, హస్తకళల గురించి మనం వీలైనంత ఎక్కువ మందికి ప్రచారం చేయాలి. ఈ కళల్లో చాలా వైవిధ్యం ఉంది. ఈ విషయాన్ని ఎంతగా ప్రచారం చేస్తే మన స్థానిక చేతివృత్తులవారు, చేనేత కార్మికులు అంతగా ప్రయోజనం పొందుతారు.
మిత్రులారా! ముఖ్యంగా నా యువ స్నేహితులారా! మన దేశం మారుతోంది. ఎలా మారుతోంది? ఎంత వేగంగా మారుతోంది? ఏ రంగాలలో ఎంత వేగంగా మార్పు జరుగుతోంది? దాన్ని సానుకూల దృష్టితో చూస్తే, మనమే ఆశ్చర్యపోతాం. గతంలో క్రీడలతో పాటు ఇతర రంగాలను పరిశీలిస్తే ఆ రంగాలలో చాలా మంది వ్యక్తులు పెద్ద నగరాల నుండి, పెద్ద కుటుంబాల నుండి లేదా ప్రసిద్ధ పాఠశాలలు లేదా కళాశాలల నుండి వచ్చేవారు. ఇప్పుడు దేశం మారుతోంది. మన యువత గ్రామాల నుండి, చిన్న పట్టణాల నుండి, సాధారణ కుటుంబాల నుండి ముందుకు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. తమ కొత్త కలలను కొనసాగిస్తూ, సంక్షోభాల మధ్య ముందుకు సాగుతున్నారు. ఇటీవల వచ్చిన బోర్డు పరీక్షల ఫలితాల్లో ఇలాంటిదే మనకు కనిపిస్తుంది. ఈ రోజు మన్ కి బాత్ లో మనం అలాంటి ప్రతిభావంతులైన పిల్లలతో మాట్లాడుతున్నాం. కృతికా నందల్ అలాంటి ప్రతిభాశాలి. కృతిక హర్యానాలోని పానిపట్ కు చెందిన వారు.
మోడీ గారు – హలో.. కృతిక గారు నమస్తే
కృతిక - నమస్తే సార్
మోడీ గారు - ఇంత మంచి ఫలితం వచ్చినందుకు మీకు చాలా అభినందనలు.
కృతిక - ధన్యవాదాలు సార్.
మోడీ గారు - ఈ రోజుల్లో టెలిఫోన్ కాల్స్ తో మీరు అలసి పోయి ఉంటారు. చాలా మంది నుండి ఫోన్లు వచ్చి ఉంటాయి.
కృతిక - అవును సార్.
మోడీ గారు - అభినందించే వారు కూడా మీరు వారికి పరిచయం ఉండడం గర్వంగా భావిస్తారు. మీకు
ఎలా అనిపిస్తూంది?
కృతిక – సార్.. చాలా బాగుంది. తల్లిదండ్రులు గర్వ పడేలా చేయడం నాకు కూడా గర్వంగా ఉంది.
మోడీ గారు – మీకు ఎక్కువ ప్రేరణ ఇచ్చింది ఎవరో చెప్పండి
కృతిక – సార్! మా అమ్మ నాకు పెద్ద ప్రేరణ.
మోడీ గారు – వావ్! సరే.. మీరు మీ అమ్మ నుండి ఏమి నేర్చుకుంటున్నారు?
కృతిక - సార్, ఆమె జీవితంలో చాలా ఇబ్బందులు చూసింది. అయినా ఆమె చాలా ధైర్యంగా ఉంది సార్. ఆమెను చూస్తే ఆమెలాగా కావాలన్న ప్రేరణ పొందుతాను సర్.
మోడీ గారు – మీ అమ్మ ఎంత వరకు చదువుకున్నారు.
కృతిక - సార్, ఆమె బి.ఏ. చేసింది.
మోడీ గారు - బీఏ చేశారా?
కృతిక - అవును సార్.
మోడీ గారు - సరే. కాబట్టి, మీ అమ్మ కూడా మీకు నేర్పిస్తుందేమో .
కృతిక - అవును సార్. నేర్పిస్తుంది. ప్రపంచం గురించి ప్రతి విషయం ఆమె చెబుతుంది
మోడీ గారు – ఆమె తిడుతుందా?
కృతిక – అవును సార్.. ఆమె తిడుతుంది కూడా.
మోడీ గారు – మంచిదమ్మా.. మీరు తరువాత ఏం చేయాలనుకుంటున్నారు?
కృతిక – సర్. నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను.
మోడీ గారు – వాహ్.. !
కృతిక - ఎంబిబిఎస్
మోడీ గారు – చూడండి.. డాక్టర్ అవ్వడం అంత తేలికైన పని కాదు!
కృతిక - అవును సార్.
మోడీ గారు - మీరు చాలా చురుకైనవారు కాబట్టి మీకు డిగ్రీ వస్తుంది. కానీ డాక్టర్ జీవితం అంకితభావంతో కూడుకున్నది.
కృతిక - అవును సార్.
మోడీ గారు – డాక్టర్ ఎప్పుడూ రాత్రి ప్రశాంతంగా పడుకోలేడు. ఎప్పుడూ శాంతితో ఉండడు. కొన్నిసార్లు రోగి నుండి కాల్ వస్తుంది. ఆసుపత్రి నుండి కాల్ వస్తుంది. తరువాత పరుగెత్తాలి. అంటే ఒక విధంగా 24x7.. మూడు వందల అరవై ఐదు రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఒక వైద్యుడు జీవితం మొత్తం ప్రజలకు సేవ చేస్తూనే గడపాల్సి ఉంటుంది.
కృతిక - అవును సార్.
మోడీ గారు - ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే.. ఇప్పటి రోజులలాగా వచ్చే వ్యాధుల వల్ల డాక్టర్ల ముందు కూడా
పెద్ద ఇబ్బంది ఉంది.
కృతిక – అవును సార్
మోడీ గారు - క్రీడలలో భారతదేశం మొత్తంలో హర్యానా ఎల్లప్పుడూ ఉత్తేజం, ప్రోత్సాహం ఇచ్చే రాష్ట్రం.
కృతిక – అవును సార్
మోడీ గారు - మీరు ఏదైనా క్రీడలలో పాల్గొంటారా? మీకు ఏవైనా ఆటలు ఇష్టమా?
కృతిక – సార్.. స్కూల్ లో బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని
మోడీ గారు – అలాగా.. మీ ఎత్తు ఎంత? ఎక్కువ ఎత్తు ఉంటారా మీరు?
కృతిక - లేదు సార్. ఐదు అడుగుల రెండు అంగుళాలు.
మోడీ గారు – అలాగా.. ఆట మీకు బాగా ఇష్టమా?
కృతిక – సార్.. కేవలం అభిరుచి కొద్దీ ఆడతాను సార్.
మోడీ గారు - మంచిది. కృతిక గారు.. మీ అమ్మకు నా తరఫున నమస్కారాలు చెప్పండి. వారు మిమ్మల్ని యోగ్యులుగా చేశారు. మీ జీవితాన్ని తీర్చిదిద్దారు. మీ అమ్మకు శుభాకాంక్షలు. మీకు అభినందనలు. అనేకానేక శుభాకాంక్షలు.
కృతిక - ధన్యవాదాలు సార్.
రండి! ఇప్పుడు మనం కేరళలోని ఎర్నాకులం వెళ్దాం. కేరళ యువతతో మాట్లాడదాం.
మోడీ గారు - హలో
వినాయక్ - హలో సార్. నమస్కారం.
మోడీ గారు – వినాయక్.. అభినందనలు
వినాయక్ - ధన్యవాదాలు సార్,
మోడీ గారు – శభాష్ వినాయక్.. శభాష్
వినాయక్ - ధన్యవాదాలు సార్,
మోడీ గారు – జోష్ ఎలా ఉంది
వినాయక్ – చాలా ఎక్కువగా ఉంది సార్..
మోడీ గారు - మీరు ఏదైనా ఆట ఆడుతారా?
వినాయక్ - బ్యాడ్మింటన్.
మోడీ గారు – బ్యాడ్మింటన్..
వినాయక్ - అవును సార్.
మోడీ గారు - ఒక పాఠశాలలో లేదా ఎక్కడైనా మీకు శిక్షణ తీసుకునే అవకాశం ఉందా?
వినాయక్ – లేదు సార్ .. స్కూల్ లో ఇప్పటికే కొంత శిక్షణ పొందాం
మోడీ గారు – ఎవరు ఇచ్చారు
వినాయక్ - మా ఉపాధ్యాయుల నుండి పొందాం సార్.
మోడీ గారు – ఓహ్ ..
వినాయక్ – ఆ విధంగా బయట పాల్గొనే అవకాశం లభిస్తుంది సార్
మోడీ గారు - వావ్
వినాయక్ - పాఠశాల నుండే సార్
మోడీ గారు - మీరు ఎన్ని రాష్ట్రాలను సందర్శించారు?
వినాయక్ - నేను కేరళ, తమిళనాడులను మాత్రమే సందర్శించాను సార్
మోడీ గారు - కేరళ మరియు తమిళనాడు మాత్రమేనా
వినాయక్ – అవును సార్
మోడీ గారు - మీరు Delhi సందర్శించాలనుకుంటున్నారా?
వినాయక్ - అవును సార్. ఇప్పుడు, పై చదువుల కోసం Delhi విశ్వవిద్యాలయంలో దరఖాస్తు చేస్తున్నాను.
మోడీ గారు – వావ్ .. కాబట్టి మీరు Delhi కి వస్తున్నారు
వినాయక్ – అవును.. అవును సార్.
మోడీ గారు – చెప్పండి.. భవిష్యత్తులో బోర్డ్ పరీక్షలు రాసే తోటి విద్యార్థుల కోసం ఏదైనా సందేశం ఇస్తారా?
వినాయక్ - హార్డ్ వర్క్, కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం సార్
మోడీ గారు - కాబట్టి పరిపూర్ణ కాల నిర్వహణ మీరిచ్చే సందేశమా
వినాయక్ - అవును సార్
మోడీ గారు – వినాయక్.. నేను మీ హాబీలను తెలుసుకోవాలనుకుంటున్నాను.
వినాయక్ - ……… బ్యాడ్మింటన్, రోయింగ్ సార్ .
మోడీ గారు - మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా
వినాయక్ – లేదు సార్.. మాకు ఎలక్ట్రానిక్ వస్తువులను, గాడ్జెట్లను ఉపయోగించడానికి స్కూల్ లో అనుమతి లేదు
మోడీ గారు - కాబట్టి మీరు అదృష్టవంతులు
వినాయక్ - అవును సార్
మోడీ గారు – సరే.. వినాయక్.. మళ్ళీ అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్
వినాయక్ - ధన్యవాదాలు సార్.
రండి! మనం ఉత్తర ప్రదేశ్ వెళ్దాం. ఉత్తర ప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన ఉస్మాన్ సైఫీతో మాట్లాడదాం..
మోడీ గారు - హలో ఉస్మాన్. మీకు అనేకానేక అభినందనలు
ఉస్మాన్ - ధన్యవాదాలు సార్.
మోడీ గారు – సరే ఉస్మాన్.. మాకు చెప్పండి.. మీరు కోరుకున్నన్ని మార్కులు వచ్చాయా.. తక్కువగా వచ్చాయా?
ఉస్మాన్ – లేదు. నేను కోరుకున్నన్నే వచ్చాయి.. నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
మోడీ గారు - వావ్, మంచి కుటుంబం. ఇంట్లో మీరు మాత్రమే ఇంత చురుకుగా ఉన్నారా?
ఉస్మాన్ - నేను మాత్రమే సార్. నా సోదరుడు కొంచెం కొంటెవాడు
మోడీ గారు – అలాగా..
ఉస్మాన్ - మిగతావారు నా గురించి చాలా సంతోషంగా ఉన్నారు.
మోడీ గారు – సరే.. బాగుంది. బాగా మీరు చదువుతున్నప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి?
ఉస్మాన్ - గణితం
మోడీ గారు – వావ్.. ! గణితశాస్త్రంలో ఆసక్తి ఎలా ఏర్పడింది ? ఏ టీచర్ మీకు స్ఫూర్తినిచ్చారు?
ఉస్మాన్ - మా సబ్జెక్ట్ టీచర్లలో ఒకరు రజత్ సార్. ఆయన నాకు ప్రేరణ. ఆయన చాలా బాగా బోధిస్తారు. నాకు గణితం అంటే మొదటి నుండి ఆసక్తి.
మోడీ గారు – ఓహ్..
ఉస్మాన్ - ఎంత ఎక్కువ లెక్కలు చేస్తే అంత ఆసక్తి వస్తుంది. అందుకే గణితం నా అభిమాన విషయం
మోడీ గారు – ఓహ్.. ఆన్‌లైన్ వేద గణితం తరగతులు జరుగుతాయని మీకు తెలుసా?
ఉస్మాన్ - అవును సార్.
మోడీ గారు - మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?
ఉస్మాన్ - లేదు సార్. ఇంకా చేయలేదు.
మోడీ గారు – వాటిలో మీరు చేరితే.. మీ మిత్రులందరూ మిమ్మల్ని ఒక ఇంద్రజాలికుడిగా చూస్తారు.. ఎందుకంటే కంప్యూటర్ స్పీడ్ తో మీరు వేద గణితం లెక్కలు చేయవచ్చు. గణితంలో చాలా సరళమైన పద్ధతులు ఉన్నాయి. అవి ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.
ఉస్మాన్ - సార్.
మోడీ గారు - మీకు గణితంపై ఆసక్తి ఉన్నందు వల్ల మీరు కొత్త విషయాలను కూడా మీరు చెప్పవచ్చు.
ఉస్మాన్ - సార్.
మోడీ గారు - సరే ఉస్మాన్.. ఖాళీ సమయంలో మీరు ఏం చేస్తారు?
ఉస్మాన్ - సార్, నేను ఖాళీ సమయంలో ఏదో ఒకటి రాస్తూ నే ఉంటాను సార్. రాయడమంటే నాకు చాలా ఆసక్తి ఉంది.
మోడీ గారు – వావ్.. ! మీరు గణితంపై కూడా ఆసక్తి చూపుతారు. సాహిత్యంపై కూడా ఆసక్తి ఉంది.
ఉస్మాన్ - అవును సార్
మోడీ గారు - మీరు ఏమి వ్రాస్తారు? కవితలు రాస్తారా.. షాయరీలు రాస్తారా..
ఉస్మాన్ – కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ఏదైనా అంశంపై నేను రాస్తూ ఉంటాను.
మోడీ గారు – ఓహ్.. అలాగా.
ఉస్మాన్ – కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి సార్.. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు.. ఇలా.. అన్ని విషయాలు.
మోడీ గారు - ఓహ్! మీరు కళాశాలలో పై చదువులు చదువుకోవడానికి తదుపరి ప్రణాళిక ఏం చేస్తున్నారు?
ఉస్మాన్ – కళాశాలలో చదువుకుంటున్నా సార్.. జెఇఇ మెయిన్స్ మొదటి ప్రయత్నంలో క్లియర్ చేశాను. రెండవ ప్రయత్నంలో ఇప్పుడు సెప్టెంబర్ లో రాస్తాను. నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేను మొదట ఐఐటి నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందాలి. ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు వెళ్లి ఐఎఎస్ అవ్వాలి.
మోడీ గారు - ఓహ్! మీరు టెక్నాలజీపై కూడా ఆసక్తి చూపుతున్నారా?
ఉస్మాన్ - అవును సార్. అందుకే నేను ఐఐటిలో ఐ. టి. ని ఎంచుకున్నాను
మోడీ గారు - అలాగే ఉస్మాన్.. మీకు నా శుభాకాంక్షలు. మీ సోదరుడు కొంటెగా ఉంటే మీకు సమయం కూడా బాగా గడుస్తుంది. మీ అమ్మానాన్నలకు నా నమస్కారాలు. వారు మీకు ఈ విధంగా ఒక అవకాశాన్ని ఇచ్చారు. ప్రోత్సహిస్తున్నారు. మీరు చదువుతో పాటు ప్రస్తుత సమస్యలను అధ్యయనం చేయడం, రాయడం నాకు నచ్చింది. చూడండి.. రాయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీ ఆలోచనలు పదును గా అవుతాయి. అభినందనలు..
ఉస్మాన్ - ధన్యవాదాలు సార్.
రండి! దక్షిణం వైపుకు వెళ్దాం. తమిళనాడులోని నమక్కల్ నుండి కనిగతో మాట్లాడదాం .. కనిగతో సంభాషణ చాలా స్ఫూర్తిదాయకం.
మోడీ గారు: కనిగ్గ గారూ.. వణక్కం
కనిగ్గ: వణక్కం సార్..
మోడీ గారు: ఎలా ఉన్నారు
కనిగ్గ: ఫైన్ సార్
మోడీ గారు: మొదట గొప్ప విజయం సాధించిన మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను.
కనిగ్గ: ధన్యవాదాలు సార్.
మోడీ గారు: నామక్కల్ గురించి విన్నప్పుడు నాకు అంజనేయర్ గుడి గుర్తొస్తుంది.
కనిగ్గ: అవును సార్.
మోడీ గారు: ఇప్పుడు నేను మీతో నా సంభాషణ ను కూడా గుర్తుంచుకుంటాను.
కనిగ్గ: అవును సార్.
మోడీ గారు: కాబట్టి.. మళ్ళీ అభినందనలు.
కనిగ్గ: ధన్యవాదాలు సార్.
మోడీ గారు: మీరు పరీక్షల కోసం చాలా కష్టపడ్డారు. పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంది?
కనిగ్గ: సార్... మేము మొదటి నుండి చాలా కష్టపడుతున్నాము. ఈ ఫలితం ఊహించలేదు. కానీ పరీక్ష బాగా రాసినందువల్ల ,మంచి రిజల్ట్ వచ్చింది.
మోడీ గారు: మీరు ఎన్ని మార్కులు ఊహించారు?
కనిగ్గ: 485 లేదా 486 .. అలా వస్తాయి అనుకున్నాను
మోడీ గారు: ఇప్పుడు ఎన్ని వచ్చాయి?
కనిగ్గ: 490
మోడీ గారు: మీ కుటుంబ సభ్యులు, మీ ఉపాధ్యాయుల స్పందన ఏమిటి ?
కనిగ్గ: వారు చాలా సంతోషంగా ఉన్నారు. వారికి చాలా గర్వంగా ఉంది సార్.
మోడీ గారు: మీకు ఇష్టమైన విషయం ఏది?
కనిగ్గ: గణితం
మోడీ గారు: ఓహ్! మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
కనిగ్గ: డాక్టర్ అవబోతున్నాను సార్.. వీలైతే AFMC నుండి..
మోడీ గారు: మీ కుటుంబ సభ్యులు వైద్య వృత్తిలో ఉన్నారా.. లేదా వేరే ఏదైనా వృత్తిలో ఉన్నారా?
కనిగ్గ: లేదు సార్. నాన్న డ్రైవర్. అయితే నా సోదరి ఎంబిబిఎస్ చదువుతోంది సార్.
మోడీ గారు: వావ్! కాబట్టి మొదట నేను మీ నాన్నకు నమస్కారాలు చేస్తాను. మీ సోదరి గురించి, మీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న తండ్రి ఆయన. ఆయన చేసేది గొప్ప సేవ.
కనిగ్గ: అవును సార్
మోడీ గారు: ఆయన అందరికీ ప్రేరణ.
కనిగ్గ: అవును సార్
మోడీ గారు: మీకు, మీ సోదరికి, మీ నాన్న కు , మీ కుటుంబానికి అభినందనలు
కనిగ్గ: ధన్యవాదాలు సార్.
మిత్రులారా! క్లిష్ట పరిస్థితులలో కూడా ఉత్సాహం ప్రదర్శించే అలాంటి యువ స్నేహితుల విజయ గాథలు మనకు స్ఫూర్తినిస్తాయి. వీలైనంత ఎక్కువ మంది యువ మిత్రులతో మాట్లాడే అవకాశం ఉండాలని నా మనసులో ఉంటుంది. కాని సమయానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దేశానికి స్ఫూర్తినిచ్చే వారి విజయ గాథలను, అందరితో పంచుకోవాలని నేను యువ సహచరులందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఏడు సముద్రాలు దాటిన తర్వాత .. భారతదేశం నుండి వేల మైళ్ళ దూరంలో 'సూరినామ్' అనే చిన్న దేశం ఉంది. సురినామ్‌తో భారత్‌కు చాలా సన్నిహిత సంబధాలున్నాయి. వంద సంవత్సరాల కంటే ముందు భారతదేశం నుండి ప్రజలు అక్కడికి వెళ్లి దానిని తమ నివాసంగా చేసుకున్నారు. నేడు అక్కడ నాల్గవ-ఐదవ తరం భారతీయ సంతతి వారు ఉన్నారు. ఈ రోజు, సూరినామ్ లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువమంది భారతీయ సంతతికి చెందినవారు. మీకు తెలుసా.. అక్కడి సాధారణ భాషలలో ఒకటైన 'సర్ నామీ' కూడా 'భోజ్‌పురి' భాషలో మాండలికం. ఈ సాంస్కృతిక సంబంధాల వల్ల భారతీయులైన మనం చాలా గర్వంగా భావిస్తున్నాం..
ఇటీవల శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖి సూరినామ్ దేశానికి నూతన అధ్యక్షుడయ్యారు. అతను భారతదేశ మిత్రుడు. 2018 సంవత్సరంలో జరిగిన భారతీయ సంతతి ప్రజల (పిఐఓ) పార్లమెంటరీ సమావేశానికి కూడా హాజరయ్యారు. శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖి గారు వేద మంత్రాలతో ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. ఆయన సంస్కృతంలో మాట్లాడారు. వేదాలను ప్రస్తావించారు. "ఓం శాంతి: శాంతి: శాంతి" తో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. తన చేతిలో వేదాలను తీసుకొని ఆయన ఇలా అన్నారు.. “నేను, చంద్రికా ప్రసాద్ సంతోఖి”.. ఇంకా ఆ తర్వాత ప్రమాణ స్వీకారంలో ఆయనేం చెప్పారు? ఆయన వేదాలలోని ఒక మంత్రాన్ని జపించారు. ఆయన ఇలా అన్నారు..
“అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి.. తచ్ఛకేయం తన్మే రాధ్యతామ్..
ఇదమహమనృతాత్ సత్యముపైమి”
అంటే.. అగ్ని సంకల్ప దేవుడు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీని కోసం అగ్ని నాకు శక్తి, సామర్థ్యం ప్రదానం చేయుగాక.. అసత్యానికి దూరంగా ఉండి సత్యం వైపు వెళ్ళమని నన్ను ఆశీర్వదించుగాక..
నిజంగా, ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
నేను శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖిని అభినందిస్తున్నాను. దేశసేవ చేసినందుకు 130 కోట్ల మంది భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇది వర్షాల కాలం కూడా. వర్షం నుండి దుమ్ము, ధూళి, వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇంతకుముందుసారి కూడా నేను మీకు చెప్పాను. వైద్యశాలలలో రద్దీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలి. రోగనిరోధక శక్తిని పెంచే విషయాలు.. ఆయుర్వేద కషాయాలను తీసుకోవడం మొదలైనవి పాటించాలి. కరోనా వ్యాప్తి సమయంలో మనం ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉండాలి. ఆసుపత్రిని సందర్శించాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి.
మిత్రులారా! వర్షాకాలంలో దేశంలో అధిక భూ భాగం వరదలను ఎదుర్కొంటోంది. బీహార్, అస్సాం వంటి రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో వరదలు చాలా ఇబ్బందులను సృష్టించాయి. అంటే ఒక వైపు కరోనా ఉంది.. మరొక వైపు ఇది మరొక సవాలు. అన్ని ప్రభుత్వాలు, ఎన్. డి.ఆర్.ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నియంత్రణ బృందాలు , స్వచ్ఛంద సంస్థలు.. అన్నీ కలిసి ఉపశమన చర్యలు, సహాయక చర్యలను నిర్వహిస్తున్నారు. ఈ విపత్తుతో బాధపడుతున్న ప్రజలందరికీ సహాయంగా దేశం మొత్తం నిలుస్తుంది.
మిత్రులారా! తరువాతిసారి మనం 'మన్ కి బాత్'లో కలిసేందుకు ముందుగానే ఆగస్టు 15 కూడా వస్తోంది. ఈసారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితులలో ఉంటుంది. కరోనా మహమ్మారి పరిస్తితుల్లో ఈ ఉత్సవం జరుగుతుంది. మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేయాలని నేను యువతను, దేశవాసులను కోరుతున్నాను. స్వావలంబన కలిగిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను. కొత్త విషయాలను నేర్చుకోవాలని, నేర్పాలని సంకల్పించాలని, కర్తవ్యాలను నెరవేర్చడానికి సంకల్పించాలని యువత ను, దేశ ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఈ రోజు మన దేశం ఉన్నత స్థాయి లో ఉండడానికి దేశ నిర్మాణానికి తమ జీవితాలను అంకితం చేసిన ఎంతో మంది గొప్ప వ్యక్తులే కారణం. ఆ గొప్ప వ్యక్తులలో ఒకరు 'లోక మాన్య తిలక్'. 2020 ఆగష్టు 1న లోక మాన్య తిలక్ గారి 100 వ వర్ధంతి. లోక మాన్య తిలక్ గారి జీవితం మనందరికీ పెద్ద ప్రేరణ. మనకు చాలా విషయాలు నేర్పుతుంది.
తర్వాతిసారి మనం కలిసినప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. కొత్త విషయాలను కలిసి నేర్చుకుందాం. అందరితో పంచుకుందాం. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. రాబోయే అన్ని పండుగల సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. చాలా ధన్యవాదాలు.
***
(Release ID: 1641473)
Visitor Counter : 385
Read this release in:
Punjabi
,
Hindi
,
Urdu
,
Assamese
,
Manipuri
,
English
,
Marathi
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam