ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

వరద పరిస్థితిపై అసోం ముఖ్యమంత్రితో మాట్లాడిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, డోనర్ మంత్రిత్వ శాఖ నుండి అవకాశమున్నంత మేరకు సహాయం అందిస్తామని హామీ

Posted On: 26 JUL 2020 2:08PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డోనర్), పిఎంఓ ఎంఓఎస్, సిబ్బంది, ప్రజా సమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్షం శాఖల కేంద్ర మంత్రి (స్వతంత్ర ఛార్జ్) డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు అసోం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనావాల్‌తో టెలిఫోన్‌లో మాట్లాడి ఎడతెరిపిలేని వర్షాలు, వరదలు కొండచరియల వలన కలిగే మౌలిక సదుపాయాల నష్టాలను పునరుద్ధరించడానికి, మరమ్మత్తు చేయడానికి డోనర్ మంత్రిత్వ శాఖ నుండి వరద సహాయం వీలైనంత మేర అందిస్తామని చెప్పారు. 

ప్రభుత్వంలోని ఇతర ఏజెన్సీల నుండి కూడా నిధులు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈశాన్య ప్రాంత ప్రజల శ్రేయస్సుకు మోడీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఇతర ప్రభావ ప్రాంతాల్లో వరద పరిస్థితిని నిరంతరం కేంద్రం సమీక్షిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాని స్వయాన తాజా స్థితిగతులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ఈ ఏడాది అసోం రాష్ట్రంలో వరదల వల్ల 30 జిల్లాల్లో 56 లక్షల మంది తీవ్ర ప్రభావానికి లోనయ్యారని, ఇప్పటి వరకు 120 మంది వరదల వల్ల మరణించారని డోనర్ మంత్రి వెల్లడించారు. ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు వరద తాకిడికి గురైన ఈ ప్రాంతం ఆస్తి నష్టమే కాకుండా, ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేసిందని, దీనితో పాటి ఇపుడు కోవిడ్-19 పెను సవాలుగా నిలిచిందని తెలిపారు. చాల చోట్ల జనజీవనంతో పాటు వన్యమృగాలపై కూడా పెను ప్రభావం చూపిందని ఆయన అన్నారు. 

సహాయ, పునరావాస చర్యలు పూర్తిస్థాయిలో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మెరుగైన పద్ధతులు, వనరులతో కాజీరంగ వన్యప్రాణుల అభయారణ్యంతో సహా జంతువులను రక్షించడానికి రాష్ట్రం తన వంతు కృషి చేస్తోందని ఆయన అన్నారు.

ఈ ప్రకృతి విపత్తును ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రోజూ పరిస్థితిని పర్యవేక్షిస్తోందని తెలిపారు.

                                                                <><><>



(Release ID: 1641399) Visitor Counter : 111