ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల కోసం ప్రత్యేక ద్రవ్యత పథకం: అమలు స్థితి

రూ.3090 కోట్ల విలువైన ఐదు ప్రతిపాదనలకు ఆమోదం; పరిశీలనలో 35 దరఖాస్తులు

Posted On: 24 JUL 2020 8:19PM by PIB Hyderabad

ఈ ఏడాది మే 13వ తేదీన, 'కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ' మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్‌ ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలోని ఒక ప్రకటనలో భాగంగా.., ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల కోసం రూ.30 వేల కోట్లతో ప్రత్యేక ద్రవ్యత పథకం ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆర్థిక రంగంలో నష్టాలను నివారించడానికి, 'స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌' (ఎస్‌పీవీ) ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల ద్రవ్యత స్థితిని మెరుగుపరచడానికి ఈ పథకాన్ని తెచ్చారు.

    ఈ పథకంపై సానుకూల ప్రతిస్పందనలు వెల్లువెత్తాయి. ఈనెల 23వ తేదీ నాటికి, రూ.3090 విలువైన ఐదు ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. రూ.13776 కోట్ల రుణాలు కోరుతూ మరో 35 దరఖాస్తులు రాగా, వాటిని పరిశీలిస్తున్నారు.

    ఈ పథకాన్ని ఎస్‌ఎల్‌ఎస్‌ ట్రస్ట్‌ అమలు చేస్తోంది. 'ఎస్‌పీవీ'ని ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ లిమిటెడ్‌ (ఎస్‌బీఐసీఏపీ) ఏర్పాటు చేసింది. భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టం-1934 ప్రకారం రిజర్వ్‌ బ్యాంక్‌ వద్ద నమోదైన ఏ ఎన్‌బీఎఫ్‌సీకి (సూక్ష్మరుణ సంస్థలతో కలిపి‌) అయినా; నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ చట్టం-1987 ప్రకారం నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ వద్ద నమోదైన ఏ హెచ్‌ఎఫ్‌సీకి అయినా, నిర్దిష్ట షరతులకు లోబడి ఈ పథకం ద్వారా నిధులు సేకరించడానికి అర్హత ఉంటుంది. ట్రస్ట్‌ ద్వారా నమోదు చేసుకోవడానికి ఈ పథకం మరో మూడు నెలలు అందుబాటులో ఉంటుంది. ప్రాథమిక, ద్వితీయ మార్కెట్ రుణ కొనుగోళ్లను ఈ పథకం అనుమతిస్తుంది. ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల స్వల్పకాలిక ద్రవ్య సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. 90 రోజుల పరిపక్వతతో ఉన్న ప్రామాణిక పెట్టుబడుల నుంచి తప్పుకోవాలని చూస్తున్నవారు కూడా  ఎస్‌ఎల్‌ఎస్‌ ట్రస్ట్‌ను సంప్రదించవచ్చు.

***


(Release ID: 1641080) Visitor Counter : 222