ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకూ 71,229 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించిన సిబిడిటి.
Posted On:
17 JUL 2020 6:00PM by PIB Hyderabad
ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి) ,2020 జూలై 11 వ తేదీ నాటికి 21.24 లక్షలకు పైగా కేసులకు సంబందించి 71,229 కోట్ల రూపాయలను పన్ను చెల్లింపుదారులకు తిరిగి చెల్లించింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పన్నుచెల్లింపుదారులకు లిక్విడిటీ అందుబాటులో ఉండేలా సహాయపడేందుకు ఈ చర్య తీసుకుంది. పెండింగ్ లో ఉన్న ఆదాయపన్ను రిఫండ్‌లను వీలైనంత త్వరగా తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2020 ఏప్రిల్ 8న నిర్ణయం తీసుకున్నదానికి అనుగుణంగా ఈచర్యలు చేపట్టారు.
కోవిడ్ -19 సమయంలో 1.45 లక్షల కేసులకు సంబంధించి కార్పొరేట్ పన్ను రిఫండ్ 46,626 కోట్ల రూపాయలు, 19.79 లక్షల కేసులలో ఆదాయపన్ను రిఫండ్ 24, 603 కోట్ల రూపాయలను పన్ను చెల్లింపుదారులకు చెల్లించడం జరిగింది.
పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పన్నుసంబంధిత సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు సిబిడిటి తెలిపింది. ప్రస్తుత కోవిడ్ -19 మహమ్మారి సమయంలో చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమకు రావలసిన పన్ను రిఫండ్‌లు, టాక్స్ డిమాండ్‌లు వీలైనంత త్వరగా తుది దశకు చేరుకుంటాయని ఎదురుచూస్తూ వస్తున్నారు.
టాక్సు డిమాండ్ లకు సంబంధించిన రిఫండ్ సంబంధిత అంశాలను ప్రాధాన్యతా ప్రాతిపదికన చేపడుతున్నట్టు , ఇది 2020 ఆగస్టు 31 లో పూర్తికానున్నట్టు సిబిడిటి స్పష్టం చేసింది. దిద్దుబాట్లకు సంబంధించిన అన్ని దరఖాస్తులు, అప్పీలు ఆర్డర్లను ఐటిబిఎ పై అప్‌లోడ్ చేయనున్నారు. సవరణలు, అప్పీలు పనులన్నీ ఐటిబిఏ ద్వారానే చేయాలని నిర్ణయించారు.
పన్ను చెల్లింపుదారులు, తమ రిఫండ్‌లు సత్వరం ప్రాసెస్ చేయడానికి ఐ-టి విభాగం పంపిన ఈమెయిల్స్‌కు వెంటనే సమాధానం ఇవ్వాలని సూచించడం జరిగింది. ఈవిషయంలో పన్ను చెల్లింపుదారు నుంచి వచ్చే సత్వర సమాచారం , ఐటి రిఫండ్ లను త్వరగా ప్రాసెస్ చేయడానికి వీలు కలిగిస్తుంది. చాలామంది పన్ను చెల్లింపుదారులు దిద్దుబాట్లు, అప్పీలు, లేదా టాక్స్ క్రెడిట్‌కు సంబంధించి తమ సమాధానాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే సమర్పించారు . వీటిని నిర్ణీత కాలవ్యవధిలొగా పరిశీలిస్తారు. అన్ని రిఫండ్లను ఆన్‌లైన్ ద్వారా నేరుగా పన్ను చెల్లింపుదారుల ఖాతాలలోజమచేయడం జరిగింది.
***
(Release ID: 1639483)
Visitor Counter : 224