వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన (పిఎంఎఫ్ బివై) కింద ఖరీఫ్ -2020 పంట కాలానికి పెద్ద ఎత్తున కొనసాగుతున్న రైతుల పేర్ల నమోదు ప్రక్రియ
పంటను బీమా చేయించుకోవలసిందిగా రైతులకు విజ్ఞప్తి చేసిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్
నాట్లు వేయడానికి ముందు నుంచి, పంట కోసిన అనంతరం వరకు అన్ని కార్యకలాపాల పంటనష్టానికి ఈ పథకం రక్షణ కల్పిస్తుంది.
Posted On:
17 JUL 2020 1:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పిఎంఎఫ్ బివై) పథకం కింద 2020 ఖరీఫ్ పంటకాలనికి, రైతులు తమ పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున సాగుతున్నది. ఈ బీమా పథకం కింద రైతులు ఉచితంగా పేర్ల నమోదు చేసుకోవచ్చు . రైతులు ప్రీమియం మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. రైతులు తమ ఆహార పంటలను( పప్పులు, నూనెగింజలు) బీమా మొత్తంలో రెండు శాతం కనీస ప్రీమియం రేటుకు బీమా సదుపాయం పొందవచ్చు. వాణిజ్య పంటలు, పండ్లతోటలకు సంబంధించి 2020 ఖరీఫ్ లో బీమా చేసిన మొత్తంలో 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన ప్రీమియంను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా సమకూరుస్తాయి. ప్రస్తుత ఖరీఫ్ 2020 సీజన్‌కు కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పేర్ల నమోదుకు ఆఖరుతేదీ 2020 జూలై 31 వ తేదీకి ముగియవచ్చు.
ఈ విషయంలో రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖమంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రైతులను పిఎంఎఫ్‌బివైకింద పేర్లు నమోదు చేసుకోవలసిందిగా కోరుతూ ఒక వీడియో సందేశం ఇచ్చారు. ప్రకృతి విపత్తులవల్ల పంటలు పండక లేదా నష్టపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతులందరూ తమ పేర్లను ఈ పథకం కింద నమోదు చేసుకోవలసిందిగా ఆయన పిలుపునిచ్చారు.(రైతులకు మంత్రి యిచ్చిన పూర్తి సందేశాన్ని పిఐబి యూట్యూబ్ ఛానల్ ద్వారా https://youtu.be/b9LooMrHdEk వీక్షించవచ్చు)
ఈ పథకం కింద , నాట్లు వేయడానికి ముందు నుంచి పంట కోసిన తర్వాతి కార్యకలాపాల వరకు మొత్తం సాగుదశలన్నింటికీ పంట నష్టం నుంచి రక్షణ లభిస్తుంది. ఈ పథకం కింద రైతులు వీలైనంత త్వరగా తమ పేర్లను నమోదు చేసుకోవడం ద్వారా ఏదైనా విపత్తు కారణంగా నాట్లు వేయలేని పరిస్థితి ఏర్పడితే, దానికి కూడా బీమా సదుపాయం పొందడానికి వీలు కలుగుతుంది.దీనికి తోడు కరువు, వరదలు, పంట నీటమునగడం,మట్టిపెళ్లలు విరిగిపడడం, అకాల వర్షాలు,వడగళ్లవాన,తుపాను, పంట కోసిన తర్వాత అకాల వర్షాలు వంటి వాటికి సమగ్ర రిస్కు కవరేజ్ ఈ పథకం కింద వర్తిస్తుంది.
ఈ బీమా పథకం అమలులో గతంలో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం పిఎంఎఫ్‌బివైకి సవరణలను ఆమోదించింది. 2020 ఖరీఫ్ నుంచి ఈ పథకం కింద రైతులు స్వచ్ఛందంగా చేరవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రుణం తీసుకున్న రైతులందరికీ ఈ పథకం తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు రుణాలు కలిగిన రైతులు ఒక సులభమైన డిక్లరేషన్‌ను తమ బ్యాంకు శాఖకు ,ఈ పథకం దరఖాస్తుకు గడువు ముగియడానికి వారం రోజుల ముందే సమర్పించడం ద్వారా , ఈ పథకం వెలుపల ఉండవచ్చు.
పిఎంఎఫ్ బివై పథకం కింద పేరు నమోదు చేసుకోదలచిన ఏ రైతు అయినా, తన సమీప బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం, ఉమ్మడి సేవా కేంద్రం(సిఎస్‌సి), గ్రామస్థాయి ఎంటర్‌ప్రెన్యుయర్లు(విఎల్ఇఎస్‌లు), వ్యవసాయ శాఖ కార్యాలయాలు, ఇన్సూరెన్సుకంపెనీల ప్రతినిధులను సంప్రదించి గానీ లేదా నేరుగా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్సు పోర్టల్ (ఎన్‌సిఐపి) www.pmfby.gov.in, క్రాప్ ఇన్సూరెన్సు యాప్ ద్వారా గానీ పేర్లు నమోదు చేసుకోవచ్చు
(https://play.google.com/store/apps/details?id=in.farmguide.farmerapp.central).
రైతులు ఈ పథకం కింద పేర్లను నమోదు చేసుకోవడానికి ఆధార్ నెంబర్, బ్యాంక్ పాస్‌బుక్, భూమి రికార్డు, కౌలు ఒప్పందం, స్వీయ ధృవపత్రాన్ని దగ్గర ఉంచుకొవాలి. ఈ పంటకాలంలో పేర్లు నమోదు చేసుకున్న రైతులందరికీ వారి దరఖాస్తు స్థితిని ఎప్పటికప్పుడు ఎస్.ఎం.ఎస్ ద్వారా వారి రిజిస్టర్డ్ మొబైల్ కు తెలియజేస్తారు.
ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పథకం కింద రైతులు తమ పేర్లను నమోదు చేసుకునేట్టు చూడడానికి వ్యవసాయం,రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ 29,276 మంది అధికారులకు శిక్షణ నిచ్చింది. వీరిలో బ్యాంకులు, ఇన్సూరెన్సు కంపెనీలు, కామన్ సర్వీసు సెంటర్ల (సిఎస్‌సి), రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్ బిసి), గ్రామస్థాయి ఎంటరప్రెన్యుయర్లు (విఎల్ఇఎస్), రాష్ట్ర,జిల్లా స్థాయి వ్యవసాయ, ఎటిఎంఎ అధికారులు, సబ్బంది ఉన్నారు. దీనికి తోడు ఇన్సూరెన్సు కంపెనీలు, వివిధ స్టేక్‌హోల్డర్లకు కూడా శిక్షణనిచ్చాయి. మంత్రిత్వశాఖ కిసాన్ సెల్ సెంటర్లకు చెందిన 600మంది ఎగ్జిక్యుటివ్‌లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పథకం గురించి రైతులలో చైతన్యాన్ని పెంచేందుకు వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ పలు చర్యలు తీసుకుంది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, రాష్ట్రాల వ్యవసాయ శాఖల సహకారంతో వివిధ బీమా కంపెనీలు, దేశవ్యాప్తంగా ఈ పథకంపై విస్తృత ప్రచారం ప్రారంభించాయి. స్థానిక అవగాహనా సమావేశాలు, బ్యానర్లు, పోస్టర్లను ప్రధాన ప్రదేశాలలో ఉంచడం, కరపత్రాల పంపిణీ, ఐఇసి వ్యాన్లు, స్థానిక, జాతీయ పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం, మాస్‌మీడియా ద్వారా ప్రచారం వంటికార్యకలాపాల నిర్వహణ ద్వారా క్షేత్రస్థాయిలో రైతులలో అవగాహన పెంచేందుకు చేపడుతున్నారు.
పిఎం ఫసల్ బీమా యోజన ప్రకృతి విపత్తుల నుంచి , తెగుళ్లు, కీటకాలు, పంటలకు సోకే రకరకాల చీడపీడలనుంచి రక్షణ కల్పించేందుకు , రైతులకు బీమా పరిష్కారం అందించడం ద్వారా ఆర్థికంగా మద్దతునిచ్చి వారి కాళ్లమీద వారు తిరిగి నిలబడేట్టు చేయడానికి ఉద్దేశించిన పథకం ఇది. ఊహించని ప్రకృతి విపత్తుల వల్ల జరిగే పంటనష్టం నుంచి రక్షణ కల్పించే పంట బీమా పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి, పిఎంఎఫ్ బివై కింద రైతులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా వారిని ప్రోత్సహించడం జరుగుతోంది.
***
(Release ID: 1639374)
Visitor Counter : 549