వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్‌ రోస్‌ మధ్య టెలిఫోన్‌ సంభాషణ

Posted On: 16 JUL 2020 6:53PM by PIB Hyderabad

భారత్‌-యూఎస్‌ సీఈవో ఫోరం జరిగిన (15.07.2020) ఒకరోజు తర్వాత, భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌, అమెరికా వాణిజ్య కార్యదర్శి విల్బర్‌ రోస్‌ టెలిఫోన్‌ ద్వారా మాట్లాడుకున్నారు.

    మర్యాదపూర్వక పలకరింపుల తర్వాత, ఇరు దేశాల్లో కొవిడ్‌ పరిస్థితులపై చర్చించారు. ఆ మహమ్మారిపై పోరాటంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని ప్రశంసించారు.

    భారత్‌-అమెరికా మధ్య ప్రస్తుతమున్న వాణిజ్య చర్చల గురించి మాడుకున్నారు. క్లిష్ట సమస్యల పరిష్కారానికి ఇరుపక్షాలు చూపిన చొరవను మెచ్చుకున్నారు. ప్రారంభ వాణిజ్య ప్యాకేజీని ముగించాలని, భారత్‌-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య పరిపూర్ణత్వాలను గుర్తించాలని ఆకాంక్షించారు. ఎఫ్‌టీఏ అవకాశంపైనా ఇరువురూ చర్చించారు.

    24 రకాల భారత ఉత్పత్తులను టీవీపీఆర్‌ఏ (ట్రాఫికింగ్‌ విక్టిమ్స్‌ ప్రొటెక్షన్‌ రీఆథరైజేషన్‌ యాక్ట్‌) కింద అమెరికా నమోదు చేయడంతోపాటు, వాటిని బాల కార్మిక రంగానికి చెందినవిగా ప్రకటించడంపై గోయల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల అమెరికా ప్రభుత్వ సంస్థల సరఫరా ఒప్పందాలలో పాల్గొనే అవకాశం పోతుంది. ఈ సమస్య పరిష్కారానికి రెండు దేశాల కార్మిక శాఖ అధికారుల మధ్య చర్చలు ఏర్పాటు చేద్దామని రోస్‌ సూచించారు.

    పెండింగ్‌లో ఉన్న 'యూఎస్‌-ఇండియా సోషల్‌ సెక్యూరిటీ టోటలైజేషన్‌ అగ్రిమెంట్‌'ను కూడా గోయల్‌ ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్‌ భారత పర్యటన సమయంలోనూ దీనిపై చర్చించారు. ఈ విషయంలో అమెరికా చట్ట అవసరాలను భారత్‌ నెరవేర్చాలని రోస్‌ పేర్కొన్నారు. దీనికి పరిష్కారం కనుగొనేందుకు అమెరికా సాంఘిక భద్రత అధికారులు, భారత్‌కు చెందిన సంబంధిత అధికారుల మధ్య సమావేశం ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు.

    భారత్‌లో చేపలు పట్టే విధానాలు సముద్ర తాబేళ్లను రక్షించడానికి అమెరికా నిబంధనలకు లోబడి ఉండవన్న కారణంతో భారత్‌ నుంచి రొయ్యల దిగుమతులపై అగ్రరాజ్యం నిషేధం విధించడాన్ని కూడా మంత్రి గోయల్‌ ప్రస్తావించారు. సముద్ర తాబేళ్లను పరిరక్షించడానికి భారత్‌లోని తీర ప్రాంత రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను వివరించారు. దీనిపైనా ఇరు దేశాల అధికారులు మాట్లాడుకునేలా సమావేశం ఏర్పాటు చేద్దామని రోస్‌ చెప్పారు.

    భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలను బలోపేతం చేసేలా కలిసి పనిచేసేందుకు మంత్రి గోయల్‌, కార్యదర్శి రోస్‌ పరస్పరం సంసిద్ధత వ్యక్తం చేశారు. ఒకరికొకరు ధన్యవాదాలు తెలుపుకున్నారు.

***
 



(Release ID: 1639188) Visitor Counter : 139