హోం మంత్రిత్వ శాఖ
గురుగ్రామ్ సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌లో , సిఎపిఎఫ్‌ల దేశవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హొంమంత్రి అమిత్‌షా.
సిఎపిఎఫ్‌లు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు భద్రత కల్పించడమే కాక ఉగ్రవాదంపై పోరాటాం చేస్తున్నాయి. అలాగే , కోవిడ్ -19 మహమ్మారిపై దేశం సాగిస్తున్న పోరాటంలో కీలకపాత్ర వహిస్తున్నాయి: శ్రీ అమిత్ షా
పర్యావరణ పరిరక్షణకు పలు కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. కాని మొక్కలు నాటడం మాత్రమే కాలుష్యాన్ని నివారించి భూగోళాన్ని కాపాడగలదు- శ్రీ అమిత్‌షా
ఒకే ప్రజలు, ఒకే ఆలోచన, ఒకే దేశం అనే నినాదంతో ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటంలో మనం బలమైన స్థితిలో ఉన్నాం.-శ్రీ అమిత్ షా
ప్రకృతివనరుల మితిమీరిన వాడకంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రపంచాన్ని హెచ్చరించారు. పర్యావరణ మార్పును ఎదుర్కోవడంపై చేసిన పారిస్ డిక్లరేషన్‌లో ప్రపంచం శ్రీ నరేంద్రమోదీ సూత్రాన్ని అంగీకరించింది.--కేంద్ర హోంమంత్రి
“ దేశానికి రక్షణ కల్పించడమే కాక,దేశవ్యాప్తంగా కోటికిపైగా మొక్కలు నాటేందుకు చేపట్టిన ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టిన ,అసమాన ధైర్యసాహసాలుగల మన సిఎఎస్ఎఫ్ జవాన్లకు నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను”
Posted On:
12 JUL 2020 2:08PM by PIB Hyderabad
కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సిఎపిఎఫ్ ) చెందిన వారు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు రక్షణ కల్పించడం, ఉగ్రవాదంపై పోరాటం చేయడమే కాక, కోవిడ్ -19 పై దేశం సాగిస్తున్న పోరాటంలో తమ వంతు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
సిఎపిఎఫ్ లు చేపట్టిన దేశవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమాన్నిహర్యానాలోని గురుగ్రామ్‌లో ఈరోజు ప్రారంభిస్తూ ఆయన, కోవిడ్ మహమ్మారికి సిఎపిఎఫ్ లకు చెందిన 31 మంది జవాన్లు తమ ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వారికి నివాళులర్పించారు. ప్రపంచం కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఈ మొక్కలు నాటే ప్రచార కార్యక్రమం జరుగుతున్నదని ఆయన అన్నారు.
ప్రజల తోడ్పాటుతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కోవిడ్-19 పై పోరాటాన్నిముందుకు తీసుకుపోతున్నట్టు శ్రీ అమిత్‌షా తెలిపారు. ఇవాళ కోవిడ్ మహమ్మారి ని అదుపు చేయడంలో విజయవంతమైన పోరాటానికి ఇండియా నాయకత్వం వహిస్తున్నదని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావానికి అత్యంత అభివృద్ది చెందిన దేశాల ఆరోగ్య సేవలు సైతం కుప్పకూలుతుంటే, అధిక జనసమ్మర్థం , ఫెడరల్ వ్యవస్థ కలిగిన ఇండియా ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోగలుగుతున్నదని ప్రపంచం మొత్తం చూస్తున్నదని, అయితే ఇవాళ కోవిడ్ మహమ్మారిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇండియా అత్యంత విజయవంతమైన పోరాటాన్ని సాగిస్తున్నదని అమిత్‌షా అన్నారు. కోవిడ్ -19 పైపోరాటంలో మనం బలమైన స్థితిలో ఉన్నామని, ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ ఒకే ప్రజలు, ఒకే ఆలోచన , ఒకే దేశం’ నినాదంతో ముందుకు పోతున్నామని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కేవలం ప్రభుత్వాలు మాత్రమే కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తున్నాయని, కానీ ఇండియాలో రాష్ట్ర ప్రభుత్వాలతోపాటుగా 130 కోట్ల మంది ప్రజలు, ఈ మహమ్మారిపై ఐక్య పోరాటం సాగిస్తున్నారని హోంమంత్రి అన్నారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా భయాందోళనకర పరిస్థితులు లేవని అన్నారు. మనం ఈ సవాలును ఎదుర్కొనేందుకు నిబద్ధతతో ఉన్నామని, ఈ మహమ్మారినుంచి బయటపడగల గట్టి సంకల్పం మనకు ఉన్నదని ఆయన అన్నారు. ఈ పోరాటంలో మన సిఎపిఎఫ్‌లు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి చెప్పారు. మార్కెట్లు, రైల్వేస్టేషన్ల వద్ద సేవలకు అయినా లేక అత్యంత రద్దీ ప్రదేశాలలో ప్రజలను అదుపు చేయడానికి రాష్ట్రప్రభుత్వాలు మద్దతు కోరినా , లాక్‌డౌన్‌ను అమలు చేసేందుకు స్థానిక పోలీసులు మన భద్రతా బలగాల సహాయం కోరినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా భద్రతా బలగాలు తమ సేవలు అందిస్తున్నాయన్నారు.
సిఎపిఎప్ కు చెందిన కరోనా పోరాట యోధులకు కేంద్ర హోంమంత్రి శాల్యూట్ చేశారు. వీరు భద్రత కల్పించడమే కాక ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నారని, కోవిడ్ -19 సందర్భంగా విధినిర్వహణలో, వారు తమ ప్రాణాలు, భద్రత పణంగాపెట్టి సేవలు అందిస్తూ దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా సిఎపిఎఫ్ 1.37 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నదని కేంద్ర హోంమంత్రి అన్నారు. ప్రాచీన హిందూ శాస్త్రాలనుంచి కొన్ని పంక్తులను ప్రస్తావిస్తూ శ్రీ అమిత్ షా, ఒక చెట్టు పదిమంది కుమారులకన్నా మిన్న అని అన్నారు.
दशकूपसमावापी, दशवापीसमोह्रदः।
दशह्रदसमोपुत्रो, दशपुत्रसमोद्रुमः।।
పది బావులు ఒక చెరువుతో సమానం, పది చెరువులు ఒక సరస్సుతో సమానం
పది సరస్సులు ఒక కుమారుడితో సమానం, ఒక చెట్టు పదిమంది కుమారులతో సమానం)
మనం మన సహజవనరులను కాపాడుకోవాలి కాని, వాటిని మితిమీరి వాడకూడదని శ్రీ అమిత్ షా సూచించారు. ప్రకృతిని దోపిడీచేయడం కాక, దానికి మద్దతుగా నిలివాలని మన రుషులు ఏనాడో చెప్పారని ఆయన అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం వినియోగదారిత్వం వల్ల ఈ సమతూకం దెబ్బతినిందని, ఫలితంగా మనం భూగోళం వేడెక్కడం, వాతావరణ సవాళ్ల వంటి వాటిని ఎదుర్కొంటున్నామని అన్నారు. ప్రకృతి వనరుల దోపిడీ వల్ల ఓజోన్ పొర నానాటికీ క్షీణిస్తున్నదని అన్నారు. మనం ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్‌ను, కార్బన్ మోనో ఆక్సైడ్‌ను పర్యావరణంలోకి విడుదల చేస్తున్నామని చెప్పారు. ఓజోన్ పొర లేకుండా జీవితం సాధ్యం కాదని ఆయన అన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్ల కీలకపాత్రను నొక్కి చెబుతూ ఆయన, ప్రస్తుత మొక్కలు నాటే కార్యక్రమంలో వివిధ రకాల మొక్కలైన రావి, వేప, జామ, మర్రి వంటి వాటిని నాటుతున్నామని చెప్పారు. ఆక్సిజన్‌ను విడుదల చేసే సామర్ధ్యాన్ని బట్టి , వివిధ కాలాలను తట్టుకుని అవి బతకగలగడాన్ని బట్టి మొక్కలను ఎంపికచేయడం జరిగిందని అమిత్ షా చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ఆధారంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అయితే మొక్కలునాటడం వల్ల కాలుష్యానికి అడ్డుకట్టపడి భూగోళం రక్షింపబడుతుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పారిస్ ప్రపంచ సదస్సులో పాల్గొన్నారని, అక్కడ ఆయన ప్రకృతివనరుల మితిమీరిన దోపిడీపై ప్రపంచదేశాలను హెచ్చరించారని చెప్పారు. శ్రీ మోదీ ఫార్ములాను వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పారిస్ డిక్లరేషన్‌లో ప్రపంచదేశాలు ఆమోదించాయని అమిత్ షా అన్నారు.ప్రధానమంత్రి కృషిఫలితంగా , ఇండియాలో అంతర్జాతీయ సౌర కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. శ్రీనరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రం గుజరాత్ అని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి హరిత ఇంధనాన్ని వాడాల్సిన ఆవశ్యకతపై నొక్కి చెప్పారని, ఇథనాల్ మిళిత పెట్రోలు వాడకాన్ని ప్రధానమంత్రి ప్రోత్సహించారని చెప్పారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో గల 8 కోట్ల కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం వంటి పలు కార్యక్రమాలు పర్యావరణ హితకరమైనవేనని అమిత్‌షా చెప్పారు.
మెక్కలు నాటడంతోనే కార్యక్రమం పూర్తి అయినట్టు కాక, అవి బాగా ఎదిగేందుకు చర్యలు చేపట్టాలని అమిత్‌షా సిఎపిఎఫ్‌కు సూచించారు.“ దేశరక్షణ, భద్రతను చేపట్టడమే కాక చిరకాలం మనగలిగే కోటికిపైగా మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం చేపట్టినందుకు, అసమాన ధైర్య సాహసాలు గల సిఎపిఎఫ్ జవాన్లను అభినందిస్తున్నాను” అని అమిత్‌షా అన్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా ఒక రావి మొక్కను నాటారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి శ్రీ అజయ్‌కుమార్ భల్లా, 7 సిఎపిఎఫ్ విభాగాల డిజిలు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మొక్కలను కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన వివిధ ప్రాంతాలలో నాటారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రేరణ, కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షా నాయకత్వంలో సిఎపిఎఫ్ 2020 ఫిబ్రవరి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. వివిధ సెక్టార్లలో అనువైన జాతుల మొక్కలు నాటడానికి సంబంధించి ఒక టైమ్‌టేబుల్‌ను రూపొందించుకుని ఇందుకు ఒక నోడల్ అధికారిని కూడా నియమించారు.వీలైనంత వరకు స్థానిక జాతుల మొక్కలు నాటుతారు. అందులోనూ కనీసం 50 శాతం మొక్కలు దీర్ఘకాలం మనగలిగే అంటే కనీసం వందేళ్లు అంతకు పైబడి మనగలిగే జాతుల మొక్కలు నాటుతారు. దీనితోపాటు ఔషధ విలువలుగలిగిన మొక్కలు, పర్యావరణ హితకర మొక్కలు నాటడానికి ప్రాధాన్యతను ఇస్తారు.
కేంద్ర హోంమంత్ర అమిత్ షా మొక్కనాటడం , పర్యావరణ అంశాలపట్ల సిఎపిఎఫ్ సిబ్బందికి గల నిబద్ధతకు ప్రేరణనిచ్చింది.
హరిత భారతావని దిశగా సిఎపిఎఫ్ చేపట్టిన కార్యక్రమమే ఈ మొక్కలు నాటే కార్యక్రమం. దేశ అంతర్గత, బహిర్గత భద్రతను కాపాడుతూనే పర్యావరణ పరిరక్షణకు, హరిత భారతావని సాధనకు పారామిలటరీ బలగాల సంకల్పానికి ఇది అద్దం పడుతుంది. ఈ మొక్కలను శ్రమదానం ద్వారా సిఎపిఎఫ్ సిబ్బంది నాటుతారు. 2020 జూన్ 30 నాటికి దేశంలోని వివిధ రీజియన్లలో గల సిఎపిఎఫ్ విభాగాలు 20 లక్షల మొక్కలు నాటాయి. రాగల సంవత్సరాలలో కూడా సిఎపిఎఫ్‌లు ఇలాంటి కార్యక్రమాలను చేపట్టనున్నాయి.
***
(Release ID: 1638227)
Visitor Counter : 150