రైల్వే మంత్రిత్వ శాఖ

తొలిసారిగా బంగ్లాదేశ్‌కు భారతీయ రైల్వే ప్రత్యేక పార్శిల్ రైలు

- గుంటూరు లోని రెడ్డిపాలెం నుండి బంగ్లాదేశ్‌లో ఉన్న‌ బెనాపోల్‌కు ఎండు మిరపకాయల‌తో రవాణా

- సమర్థవంతమైన మరియు అనుకూలించిన సరుకు రవాణా కార్యకలాపాలపై దృష్టి సారించిన భార‌తీయ రైల్వే

Posted On: 12 JUL 2020 2:33PM by PIB Hyderabad

భార‌తీయ రైల్వే తొలిసారిగా దేశ స‌రిహ‌ద్దుల‌ను దాటి ప్ర‌త్యేక పార్శిల్ రైలును న‌డిపింది. భార‌తీయ రైల్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా రెడ్డిపాలెం నుండి బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు ఎండు మిరపకాయల లోడ్‌తో కూడిన ప్ర‌త్యేక పార్శిల్ ‌రైలును పంపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు మరియు దాని పరిసర ప్రాంతాలు మిరపకాయల సాగుకు ప్రసిద్ధి చెందాయి. ఈ వ్యవసాయ ఉత్పత్తి అంత‌ర్జాతీయంగా మంచి రుచికి మరియు బ్రాండ్‌కు ఎంతో ప్ర‌సిద్ధి.  గ‌తంలో గుంటూరు పరిసరాల్లోని రైతులు మరియు వ్యాపారులు ఎండు మిర్చీని రోడ్డు మార్గం గుండా బంగ్లాదేశ్‌కు చిన్న‌ పరిమాణంలో రవాణా చేస్తూ ఉన్నారు. దీని వ‌ల్ల టన్నుకు రూ.7000 రూపాయల వ‌ర‌కు ర‌వాణా వ్య‌యం అయ్యేది. లాక్‌డౌన్ స‌మ‌యంలో, వారు ఎండు మిర్చీని రోడ్డు మార్గం ద్వారా తరలించలేక పోయారు. అప్పుడు రైల్వే సిబ్బంది మరియు అధికారులు ఎండు మిర్చీని రైల్ మార్గం ద్వారా రవాణా చేయడానికి.. అందు‌బాటులో ఉన్న సౌకర్యాలను గురించి వారికి వివరించారు. దీని ప్రకారం, వారు ఎండు మిర్చీని పెద్దమొత్తంలో గూడ్స్ రైళ్ల ద్వారా తరలించేందుకు ముందుకు వ‌చ్చారు.
రైతుల‌కు, వ్యాపారుల‌కు మేలు..
గూడ్స్ రైళ్ల ద్వారా సరుకును తరలించడానికి, రైతులు మరియు వ్యాపారులు ర‌వాణా పరిమాణాన్ని ఎక్కువ‌ మొత్తంలో సమీకరించడం తప్పనిసరి, అనగా ప్రతి ట్రిప్‌లో కనీసం 1500 టన్నుల కంటే ఎక్కువ లోడ్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడానికి మరియు త‌క్కువ పరిమాణంలో కూడా లోడ్‌ను తరలించేందుకు అంటే.. ప్రతి ట్రిప్‌లో గరిష్టంగా 500 టన్నుల వరకు త‌ర‌లించే విధంగా దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంటూరు డివిజన్ చొరవ తీసుకొని మ‌రీ స్పెషల్ పార్శిల్ ఎక్స్‌ప్రెస్ రైలును బంగ్లాదేశ్‌కు న‌డిపింది. స్పెషల్ పార్శిల్ ఎక్స్‌ప్రెస్ ద్వారా పొడి మిరపకాయలను తక్కువ పరిమాణంలో రవాణా చేయడం వ‌ల్ల గుంటూరు రైతులు మరియు వ్యాపారులు తమ ఉత్పత్తులను దేశ సరిహద్దులు దాటి మ‌రీ మార్కెట్ చేయడానికి ఇది సహాయపడింది. 16 పార్శిల్ వ్యాన్లతో కూడిన ఒక స్పెషల్ పార్శిల్ ఎక్స్‌ప్రెస్ రైలును బంగ్లాదేశ్‌లోని బెనాపోల్‌కు పంపారు. ప్రతి పార్శిల్ వ్యాన్‌లో 19.9 టన్నుల మేర బ‌రువున్న 466 ఎండు మిర్చీ సంచుల్ని లోడ్ చేశారు. దీంతో స్పెషల్ పార్శిల్ ఎక్స్‌ప్రెస్ తీసుకువెళ్ళిన మొత్తం బరువు 384 టన్నులుగా నిలిచింది. రోడ్డు మార్గం ద్వారా మిర్చీ లోడ్ ర‌వాణాకు గ‌తంలో ట‌న్నుకు రూ.7000 ఖ‌ర్చ‌య్యేది. అయితే ఇప్ప‌డు స్పెషల్ పార్శిల్ ఎక్స్‌ప్రెస్ వ‌ల్ల మిర్చీ త‌ర‌లింపున‌కు టన్నుకు కేవ‌లం రూ.4,608 మాత్ర‌మే వ్య‌యం అయింది. దీంతో రోడ్డు మార్గంలో రవాణాతో పోలిస్తే ఇది చాలా చౌకగా మరియు పొదుపుగా నిలిచింది.
ఎంపిక చేసిన మార్గాల్లో టైం-టేబుల్ పార్శిల్ రైళ్లు..
కోవిడ్ కాలంలో పార్శిల్ రైళ్ల‌ రద్దీని పెంచడానికి భారత రైల్వే సంస్థ వరుస చర్యల‌ను చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. చిన్నచిన్న  ప‌రిమాణాలలో వైద్య సామాగ్రి, వైద్య పరికరాలు, ఆహారం మొదలైన ముఖ్యమైన వస్తువుల రవాణా వ్యాపారానికి మరియు ప్ర‌జా వినియోగానికి ఎంత‌గానో అవ‌స‌రం. ఈ కీలకమైన అవసరాన్ని తీర్చడానికి గాను ఈ-కామర్స్ సంస్థలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సహా ఇతర వినియోగదారులతో వ‌స్తు ర‌వాణా త్వరితగతిన చేప‌ట్ట‌డానికి భారత రైల్వే పార్శిల్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన వస్తువులను నిరంతరాయంగా సరఫరా చేసేలా రైల్వే  ఎంపిక చేసిన మార్గాల్లో టైం-టేబుల్ పార్శిల్ ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. 22.03.2020 నుండి 11.07.2020 వరకు రైల్వే శాఖ మొత్తం 4434 పార్శిల్ రైళ్ల‌ను నడిపించింది. వీటిలో టైం-టేబుల్ రైళ్లు 4,304 ఉన్నాయి.

                              

*****



(Release ID: 1638171) Visitor Counter : 213