జల శక్తి మంత్రిత్వ శాఖ
త్రిపుర ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
2023 నాటికి గ్రామీణ గృహాలన్నింటికీ కుళాయి కనెక్షన్లు కల్పించనున్న త్రిపుర
Posted On:
10 JUL 2020 2:42PM by PIB Hyderabad
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ , త్రిపురలో జల్, జీవన్ మిషన్ అమలు కు సంబంధించిన వివిధ అంశాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం అమలును వేగవంతం చేసేందుకు సంబంధించి, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంభాషించడంలో భాగంగా ఆయన బిప్లబ్ కుమార్ దేబ్‌తో మాట్లాడారు.
భారత ప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ జీవన్ మిషన్‌ను అమలు చేస్తున్నది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలోని గృహాలకు తగినంత మేరకు , నిర్దేశిత ప్రమాణాలు కలిగిన తాగునీటిని క్రమంతప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన చౌకగా కుళాయి ద్వారా అందించడం దీని లక్ష్యం. తద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలుకలుగుతుంది.
ప్రస్తుత కొవిడ్ -19 మహమ్మారి సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఇంటివద్దే కుళాయి ద్వారా నీటిని అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతాప్రాతిపదికన గట్టి కృషి చేస్తోంది.దీనివల్ల ప్రజలు మంచినీటి కోసం పబ్లిక్ కుళాయిలవద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ అమర్చడానికి 2024 సంవత్సరాన్ని లక్ష్యంగా నిర్ణయించుకోగా త్రిపుర , నిర్దేశిత లక్ష్యానికంటే ముందే, అంటే 2022-23 సంవత్సరం నాటికే నూరుశాతం కుళాయి కనెక్షన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తొంది. త్రిపురలో గల 8లక్షల గ్రామీణ గృహాలలో కేవలం 68,178 ఇళ్లకు ఎఫ్.హెచ్.టి.సి లు కల్పించారు. వీటిలో మిగిలిన 4.19 లక్షల ఇళ్ళలో 2020-21 సంవత్సరంలో 2.65 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న నీటిసరఫరా పథకాల కింద 1178 గ్రామాలలో కుళాయి కనెక్షన్లు కల్పించేందుకు పనులు పెద్ద ఎత్తున ప్రారంభించాల్సిందిగా త్రిపుర ముఖ్యమంత్రిని, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోరారు. దీనివల్ల 7 లక్షల కుటుంబాలు నీటి కనెక్షన్లు పొందనున్నాయని చెప్పారు. 2023 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు కుళాయ కనెక్షన్ కల్పిస్తామని త్రిపుర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనివల్ల పేదలు, అణగారిన వర్గాల వారు తమ ఇంటి ప్రాంగణంలోనే కుళాయి కనెక్షన్‌ను పొందగలగుతారు.
2020-21 సంవత్సరంలో ఈ కార్యక్రమానికి రూ 156.61 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. రాష్ట్రవాటా, ఈ పథకం కింద ఖర్చుచేయని మిగులు మొత్తం కలిపితే జల్ జీవన్ మిషన్ అమలుకు త్రిపుర వద్ద నమ్మకంగా 383.45 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంటాయి. ఆర్థిక పనితీరు, వాస్తవికంగా పథకం అమలు ఆధారంగా రాష్ట్రం మరిన్ని నిధులు పొందేందుకు అర్హత కలిగి ఉంది. 15 వ ఆర్థిక సంఘం పంచాయతి రాజ్ సంస్థలకు అందించే గ్రాంటు ల కింద త్రిపురకు 191 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇందులో 50 శాతం మంచినీటి సరఫరా, పారిశుధ్యానికి వినియోగించవలసి ఉంది. ఈ నిధులను గ్రామీణ నీటి సరఫరా, గ్రే -వాటర్ మేనేజ్ మెంట్ కు వినియోగించేందుకు ప్రయత్నించాల్సిందిగా కేంద్ర మంత్రి సూచించారు. మరీ ముఖ్యంగా నీటిసరఫరా పథకాల దీర్ఘకాలిక నిర్వహణ, యాజమాన్యానికి వీలుగా వీటిని వినియోగించాల్సిందిగా ఆయన సూచించారు.
గ్రామీణ నీటి, పారిశుధ్య కమిటీలు, పానీ సమితులను గ్రామ పంచాయతీ సబ్ కమిటీలుగా ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి , త్రిపుర ముఖ్యమంత్రిని కోరారు. ఇందులో 50 శాతం మంది మహిళలు ఉండేట్టు చూడాలని, గ్రామీణ నీటి సరఫరా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రణాళిక, డిజైనింగ్, అమలు , నిర్వహణ,యాజమాన్యం వంటి వాటికి ఈ కమిటీలు బాధ్యత వహించేలా చూడాలని ఆయన సూచించారు. ప్రతి గ్రామం గ్రామ కార్యాచరణ ప్రణాళిక (విలేజ్ యాక్షన్ ప్లాన్-విఎపి)ని రూపొందించుకొవాలని, ఇందులో తాగునీటి వనరుల అభివృద్ధి, వాటిని పెంపొందించడం వంటివి ఉండాలన్నారు. అలాగే నీటిసరఫరా, గ్రే వాటర్ మేనేజ్‌మెంట్, నిర్వహణ, యాజమాన్యం వంటి వాటికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకొవాలన్నారు. ఈ పథకంపై ప్రధానంగా దృష్టిపెట్టాలని, కమ్యూనిటీని సమీకరించడంతోపాటు ఐఇసి ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి , జల్ జీవన్ మిషన్ ను ఒక ప్రజా ఉద్యమంగా మలచాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు.
మంచినీటి వనరులన్నింటినీ రసాయన ప్రమాణాల మేరకు ఉన్నాయో లేదో చూసేందుకు ఒకసారి పరీక్ష చేయించాలని , అలాగే బాక్టీరియా కారణంగా కలుషితమయ్యాయేమో తెలుసుకునేందుకు వర్షాలకు ముందు , వర్షాల తరువాత ఇలా రెండు సార్లు నీటి నమూనాలు పరీక్షింప చేయాలని మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీటి నాణ్యతా ప్రమాణాలపై నిఘా ఉంచేందుకు ప్రతి గ్రామంలో కనీసం ఐదుమందికి శిక్షణ ఇవ్వాలన్నారు. క్షేత్ర స్థాయి పరీక్షా కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఈశిక్షణ ఇవ్వాలని, ఈ ఐదుగురు కూడా మహిళలు అయి ఉంటే మంచిదని సూచించారు.
కోవిడ్ -19 మహమ్మారి కాలంలో , గ్రామీణ ప్రాంతాలలో ఇంటివద్దే కుళాయి కనక్షన్ ఏర్పాటు చేసేందుకు సాగిస్తున్న కృషి, గ్రామీణ ప్రాంత ప్రజలజీవనాన్ని సులభతరం చేయనుంది. ప్రత్యేకించి మహిళలు, బాలికలపై భారం తగ్గి వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి వీలు కల్పిస్తుంది.
*****
(Release ID: 1637768)
Visitor Counter : 258