రక్షణ మంత్రిత్వ శాఖ
జమ్ము కాశ్మీర్ లో ఆరు వ్యూహాత్మక వంతెనలకు ఈ -ప్రారంభోత్సవాలు చేసిన రక్షణ మంత్రి శ్రీరాజ్‌నాథ్‌సింగ్
Posted On:
09 JUL 2020 12:21PM by PIB Hyderabad
జమ్ము కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (ఐబి), అధీన రేఖ (ఎల్.ఒ.సి)కి దగ్గరలో గల సున్నితమైన సరిహద్దు ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్జిల అనుసంధానతలో నూతన విప్లవానికి నాందిపలుకుతూ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఆరు ప్రధాన వంతెనలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతికి అంకితం చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత గల ఈ బ్రిడ్జిలను సరిహద్దు రోడ్ల సంస్థ ( బిఆర్ ఒ) రికార్డు వ్యవధిలో పూర్తి చేసింది.
ఆరు రోడ్లను రికార్డు సమయంలో పూర్తి చేసినందుకు సరిహద్దు రోడ్ల సంస్థకు చెందిన అన్ని స్థాయిల అదికారులను రక్షణ మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో , వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని ప్రాంతంలో పనిచేస్తూ జాతి నిర్మాణానికి పాటుపడినందుకు వారిని ఆయన అభినందించారు. రోడ్లు, వంతెనలు ఏదేశానికైనా జీవనరేఖ వంటివని, ఇవి మారుమూల ప్రాంతాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తాయని ఆయన అన్నారు.
జమ్ము కాశ్మీర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతతో చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తూ ఆయన, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ ప్రాజెక్టుల పనితీరులో పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలిస్తున్నారని , వీటిని సకాలంలో చేపట్టేందుకు తగినన్ని నిధులు అందజేస్తున్నారని అన్నారు.
కోవిడ్ -19 కారణంగా ఒకరి కొకరు దూరం పాటించా లంటూ, ప్రపంచం దూరం పాటించడం గురించిపదే పదే చెబుతున్న దశలో , ప్రజలను కలిపే ఈ వంతెనలను ప్రారంభిస్తుండడం తనకు సంతోషం గా ఉందని ఆయన అన్నారు. అత్యంత నైపుణ్యంతో ఈ కీలక లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు సరిహద్దు రోడ్ ఆర్గనైజేషన్ ను తాను అభినందిస్తున్నట్టు ఆయన తెలిపారు.
బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్ ఒ)ను అభినందిస్తూ రక్షణమంత్రి, సరిహద్దులలో రోడ్లు, వంతెనల నిర్మాణాన్ని బిఆర్ ఒ పూర్తి చిత్తశుద్ధితో కొనసాగించడం , మారుమూల ప్రాంతాలకు సైతం చేరుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని సాకారం చేయడానికి తోడ్పడుతుంది. రోడ్లు దేశానికి జీవన రేఖల వంటివి. సరిహద్దు ప్రాంతాలలోని రోడ్లు వ్యూహాత్మకంగా బలమైనవే కాకుండా మారుమూల ప్రాంతాలను ప్రధాన స్రవంతితో అనుసంధానం చేయడానికి ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ఈ రకంగా సాయుధ బలగాలకు వ్యూహాత్మకంగా గల అవసరం లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాలైన ఆరోగ్యం, విద్య, వాణిజ్యంవంటి అభివృద్ధి పనులు చేపట్టడం అనుసంధానత వల్లే సాధ్యమౌతాయని ఆయన అన్నారు.
జమ్ము కాశ్మీర్ ప్రజల సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ రాజ్‌నాథ్ సింగ్, “ ఆధునిక రహదారులు, వంతెనల నిర్మాణం ఈ ప్రాంతానికి తప్పకుండా సుసంపన్నతను తీసుకురాగలదని విశ్వసిస్తున్నాను. సరిహద్దులలో మౌలిక సదుపాయాల ఏర్పాటును ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది . ఇందుకు అవసరమైన నిధులను సమకూర్చడం జరుగుతుంది. మా ప్రభుత్వానికి జమ్ము కాశ్మీర్ అభివృద్ధిపై సునిశిత దృష్టి ఉంది. జమ్ము కాశ్మీర్ ప్రజల, సాయుధ బలగాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నాం. వీటిని తగిన సమయంలో వెల్లడిస్తాం. జమ్ము ప్రాంతంలో ప్రస్తుతం వెయ్యి కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మాణంలో ఉన్నాయ”ని ఆయన చెప్పారు.
గత రెండు సంవత్సరాలలో బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, అత్యున్నత స్థాయి పరికరాల ద్వారా 2,200 కిలోమీటర్ల రోడ్‌కటింగ్, 4,200 కిలోమీటర్ల మేర రోడ్డు ఉపరితల నిర్మాణం, 5,800 మీటర్ల మేర శాశ్వత వంతెనల నిర్మాణాన్ని చేపట్టిందని రక్షణ మంత్రి చెప్పారు.
వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి బి.ఆర్.ఒకు తగినన్ని నిధులు అందించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితులలోనూ బి.ఆర్.ఒకు నిధులు ఏమాత్రం రాకుండా చూస్తుందని ఆయన అన్నారు. బిఆర్ ఒ ఇంజనీర్లు, సిబ్బంది సదుపాయాల విషయం కూడా తమ మంత్రిత్వశాఖ చూసుకుంటుందని ఆయన చెప్పారు.
కేంద్ర సహాయమంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, జమ్ము పార్లమెంటు సభ్యుడు శ్రీ జుగల్ కిషోర్ శర్మల సమక్షంలో కేంద్ర రక్షణ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరు వంతెనలనుప్రారంభించారు.
కథువా జిల్లాలో తార్‌నాహ్ నాలా పై గల రెండు వంతెనలు, జమ్ము జిల్లా అఖ్నూర్‌లోని అఖ్నూర్-పల్లన్‌వాలా రోడ్ పైగల నాలుగు బ్రిడ్జిలు 30 నుంచి 300 మీటర్ల పొడవుగల వాటిని మొత్తం 43 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ వంతెనలను బిఆర్ ఒ కుచెందిన ప్రాజెక్ట్ సంపర్క్ నిర్మించింది. వ్యూహాత్మంగా కీలకమైన ఈ సెక్టర్ లో నిర్మించిన వంతెనలు సాయుధ బలగాల రాకపోకలకు వీలు కలిగిస్తాయి. అలాగే మారుమూల సరిహద్దు ప్రాంతాలలో మొత్తం ఆర్థిక ప్రగతికి ఇవి దోహదపడతాయి.
గత కొన్నేళ్లుగా బీఆర్‌ఓ సాధించిన ఫలితాల్లో పెద్ద ఎత్తున ప్రగతి కనిపిస్తున్నది. 2018-19 ఆర్ధిక సంవత్సరంతో పోల్చి చూసినపుడు, 2019-20 ఆర్ధిక సంవత్సరంలో బి.ఆర్.ఓ 30 శాతం అదనపుపనిని పూర్తిచేయడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చునని శ్రీరాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. నిర్మాణాత్మక సంస్కరణలు, ప్రభుత్వం నుంచి తగినంత బడ్జెట్ కేటాయింపులు జరగడం,బిఆర్ఒ అంకిత భావంతో ప్రత్యేక దృష్టిపెట్టడం వల్ల ఇది సాధ్యమైందని అన్నారు.
2008-2016 మధ్య, బి.ఆర్.ఒ వార్షిక బడ్జెట్ రూ 3,300 కోట్ల రూపాయల నుంచి రూ 4,600 కోట్ల రూపాయల మధ్య ఉందని ఇది 2019-20 నాటికి చెప్పుకోదగిన స్థాయిలో 8,050 కోట్ల రూపాయలకు చేరిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ 11,800 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. ఇది ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులకు మరింత ఊతం ఇవ్వడమే కాక మన ఉత్తర ప్రాంత సరిహద్దులలో వ్యూహాత్మక రోడ్లు, వంతెనలు , సొరంగ మార్గ పనులను వేగవంతం చేయడానికి ఉపకరిస్తుంది..
ఈసందర్భంగా మాట్లాడుతూ బి.ఆర్.ఒ లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, జాతి నిర్మాణంలో బి.ఆర్.ఒ సాగిస్తున్న కృషిని ప్రముఖంగా ప్రస్తావించారు. రక్షణమంత్రి ఇస్తున్న నిరంతర మార్గనిర్దేశం, మద్దతుకుఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న జాతీయ వ్యూహాత్మక లక్ష్యాలను చేరుకోవడంలో బి.ఆర్.ఓ తన కృషిని కొనసాగించగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే, రక్షణ శాఖ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ , బిఆర్ ఒ డిజి లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్ ఢిల్లీనుంచి పాల్గొనగా, పౌర పాలనాధికారులు ఆయా ప్రాంతాలనుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1637735)
Visitor Counter : 295