సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆషాఢ పూర్ణిమ రోజున ధమ్మ చక్ర దినోత్సవాలను ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్


ప్రారంభ సమావేశంలో ప్రసంగించనున్న సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి కిరణ్ రిజీజు

Posted On: 02 JUL 2020 6:30PM by PIB Hyderabad

2020 సంవత్సరం జూలై 4న ఆషాఢ పూర్ణిమ రోజున ధమ్మ చక్రదినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆంతర్జాతీయ బౌద్ధుల సమాఖ్య (ఐ.బి.సి.), భారత ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాల శాఖ భాగస్వామ్యంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 2020వ సంవత్సరం మే నెల 7నుంచి 16వ తేదీవరకూ నిర్వహించిన వర్చువల్ వేసక్ ఉత్సవాలు, ప్రపంచ స్థాయి ప్రార్ధనా వారోత్సవాలు విజయవంతమైన నేపథ్యంలో ధమ్మ చక్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ బౌద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో జరిగే ప్రధాన వార్షిక కార్యక్రమంగా ఈ ఉత్సవాన్ని చేపడుతున్నారు.

గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైన భూమిగా భారతదేశానికి ఉన్న చారిత్రిక నేపథ్యాన్ని, ధమ్మ చక్ర పరివర్తనాన్ని, బుధ్ధుడి మహాపరినిర్వాణాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ లాంఛనంగా ప్రారంభిస్తారు. న్యూఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి కోవింద్ ఆన్ లైన్ ద్వారా ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి (స్వతంత్రహోదా) ప్రహ్లాద్ సింగ్ పటేల్, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి కిరణ్ రిజీజు కూడా ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ ఉత్సవాలకు సంబంధించి మూలగంధ కుటి విహార, సారనాథ్, మహాబోధి ఆలయం, బుద్ధ గయ ప్రాంతాల్లో జరిగే మిగతా కార్యక్రమాలను ఆయా ప్రాంతాలనుంచి ప్రసారం చేస్తారు. భారతీయ మహాబోధి సొసైటీ, బుద్ధగయ ఆలయ నిర్వహణా కమిటీ కలసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వివిధ బౌద్ధ సంఘాల పరిపాలనా వ్యవస్థల ప్రతినిధులు, అధిపతులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బౌద్ధ పండితులు, అంతర్జాతీయ బౌద్ధుల సమాఖ్య ప్రతినిధులు, బౌద్ధ సంఘాల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

భారతీయ సౌరకాలమాన క్యాలెండర్ ప్రకారం పవిత్రమైన ఆషాఢ పూర్ణిమ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇదే పవిత్ర దినాన్ని

 శ్రీలంకలో ఈశల పోయా అని, థాయిలాండ్ లో ఆశంహా బుచా అని వ్యవహరిస్తారు. వేసక్ దినం, లేదా బుద్ధ పూర్ణిమ తర్వాత, దీన్ని రెండవ పవిత్ర దినంగా బౌద్ధులు పరిగణిస్తారు. బుద్ధుడు తన ఇహలోక సుఖాలనుంచి జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన ఇచ్చిన తొలి ధర్మప్రచార ప్రవచనానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.

 ప్రస్తుతం సారనాథ్ గా వ్యవహరిస్తున్న వారణాసి సమీపంలోని రుషిపట్నం డీర్ పార్క్ ప్రాంతంలో ఇదే ఆషాఢ పూర్ణిమ రోజున బుద్ధుడు తన తొలి జ్ఞానబోధను అనుగ్రహించారు. సంస్కత భాషలో ధర్మ చక్ర పరివర్తనగా చెప్పుకునే బుద్ధుడి తొలి బోధనను ధర్మ చక్రాన్ని నడిపించడం అని కూడా వ్యవహరిస్తారు. నాలుగు దివ్య సత్యాలతో, 8 అష్టాంగ మార్గాలతో బుద్ధుడి తొలి ప్రవచనం ఉంటుంది. వర్ష వస్సా పేరిట బౌద్ధ భిక్షువుల, సన్యాసులు వర్షాకాలంలో నిర్వహించే తిరోగమన కార్యక్రమం కూడా జూలైలో ఇదే రోజున మొదలై అక్టోబర్ వరకూ కొనసాగుతుంది. వర్ష వస్సా సందర్భంగా బౌద్ధ భిక్షువులు, సన్యాసులు తమ మఠాల లోపలనే ధ్యానంలో ఉండి, వారి ఆచరణను మరింత తీవ్రతరం చేస్తారు.

అష్గాంగ మార్గాల అనుష్టానంతో, తమ అధ్యాపకుల మార్గదర్శకత్వంలో వారు ఉపోసత్తా పేరిట ధ్యానంలో ఉంటారు. బౌద్ధులతో సహా హిందువులు కూడా ఇదే రోజు గురుపౌర్ణిమను పాటిస్తూ, గురువులను పవిత్రభావంతో పూజిస్తారు. ధర్మచక్ర పరివర్తన దినోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అంతర్జాతీయ బౌద్దుల సమాఖ్య (ఐ.బి.సి.) అన్ని సన్నాహాలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తితో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో, నిర్ణీత నిబంధనల కచ్చితంగా పాటిస్తూ, ఈసారి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆన్ లైన్ లోనూ, బుద్ధుడు నడయాడిన పవిత్రస్థలం నుంచి ఒకేసారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బౌద్ధమత తెరవాద, మహాయాన విభాగాలు నిర్వహిస్తున్న ధర్మచక్ర పరివర్తనా ఉత్సవాల ప్రత్యక్ష ప్రసారానికి కూడా ఏర్పాట్లు చేశారు.

****


(Release ID: 1636041) Visitor Counter : 265