నౌకారవాణా మంత్రిత్వ శాఖ

‘ఆత్మ నిర్భర భారత్’ కింద భారతదేశంలో నౌకా మరమ్మతు సదుపాయాలను పెంపొందించేందుకు నౌకా నిర్మాణ శాఖ ఇన్ చార్జి మంత్రి మన్ సుఖ్ మాండవీయ మార్గనిర్దేశం చేశారు



సముద్ర వనరుల పరిశ్రమలో భారతీయ నౌకల ప్రమేయం పెంచాలని ఆయన సూచించారు

Posted On: 29 JUN 2020 6:00PM by PIB Hyderabad

దేశంలో విదేశాల్లో భారతీయ నౌకల మరమ్మతు సదుపాయాలను పెంపొందించే అంశంపై మార్గనిర్దేశం చేసేందుకు కేంద్ర నౌకా నిర్మాణ శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి మన్ సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నౌకా యజమానుల సంఘం ప్రతినిధులు, భారతీయ నౌకా నిర్మాణ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, నౌకా నిర్మాణ శాఖ డైరెక్టర్ జనరల్, నౌకా నిర్మాణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.


భారతదేశాన్ని ‘నౌకా మరమ్మతు కేంద్రంగా’ తీర్చిదిద్దేందుకు అవసరమైన సదుపాయాలతో తగిన వ్యవస్థను తయారు చేయవలసిందిగా నౌకా నిర్మాణ పరిశ్రమకు చెందిన ప్రతినిధులను మంత్రి మాండవీయ ఈ సమావేశంలో కోరారు. భారతీయ సర్వీసు ఇంజనీర్ల నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, నౌకా నిర్మాణ కేంద్రం సామర్థ్యాన్ని పెంచడం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విడిభాగాల సరఫరాను బలోపేతం  చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు. ‘ఆత్మనిర్భర భారత్’ కార్యక్రమం చేపట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను మంత్రి పునరుద్ఘాటించారు. నౌకల మరమ్మతు సదుపాయాల విషయంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి సంవత్సరం దాదాపు 30వేల నౌకలు భారతీయ ఓడరేవులకు ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి చెప్పారు. భారతీయ నౌకల సంఖ్యను పెంచేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా 13 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుందని, అదనపు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని, దిగువ స్థాయిలో సరుకు రవాణా చార్జీల స్థిరీకరణ సాధ్యమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. 

 

******


(Release ID: 1635221) Visitor Counter : 176