ఉక్కు మంత్రిత్వ శాఖ

"నిరంతర గాల్వనైజ్డ్‌ రీబార్‌ ఉక్కు" ఉత్పత్తి ప్లాంటును పంజాబ్‌లోని మండి గోబింద్‌ఘర్‌లో ప్రారంభించిన శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా ఇదొక అడుగని అభివర్ణన

Posted On: 29 JUN 2020 1:57PM by PIB Hyderabad

కేంద్ర ఉక్కు&పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్‌, "నిరంతర గాల్వనైజ్డ్‌ రీబార్‌ ఉక్కు" ఉత్పత్తి ప్లాంటును ప్రారంభించారు. పంజాబ్‌లోని మండి గోబింద్‌ఘర్‌లో, "మాధవ్ అలాయ్స్‌" ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది. 

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "గాల్వనైజ్డ్‌ ఉక్కు అత్యంత బలమైనది, పర్యావరణహితం, తక్కువ ఖర్చులో వస్తుంది. మౌలిక వసతుల రంగాల్లో భారీగా విస్తరించడం, ఉక్కు వినియోగాన్ని పెంచే కార్యక్రమాలపై మేం దృష్టి పెట్టాం. కాబట్టి గాల్వనైజ్డ్ ఉక్కుకు డిమాండ్ పెరుగుతుంది. నిర్మాణ రంగం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గాల్వనైజ్డ్‌ రీబార్‌ ఉక్కు అవసరాలను ఈ ప్లాంటు తీరుస్తుంది" అని చెప్పారు.

 

ఉక్కు రంగంలో స్వావలంబన గురించి మాట్లాడుతూ, "ఆత్మనిర్భర్ భారత్ అనేది బలమైన ఉత్పత్తి రంగం, స్వావలంబన, సమీకృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కూడిన బలమైన భారత్. ఉక్కు రంగం కీలక పాత్ర పోషించాలి. దేశీయ అవసరాలను మాత్రమేగాక, ప్రపంచ అవసరాలను తీర్చడంపైనా దృష్టి పెట్టాలి. ఇవాళ ప్రారంభించిన ప్లాంటు, ఆత్మనిర్భర్‌ భారత్‌ దిశగా సరైన అడుగు" అని ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు.
 

ఉక్కు రంగాన్ని మరింత శక్తిమంతం చేయడానికి, స్వావలంబన సాధించడానికి తీసుకున్న డీఎంఐ&ఎస్పీ విధానం, ఉక్కు క్లస్టర్ల ఏర్పాటు, ఉక్కు తుక్కు విధానం, ముడి పదార్థాల భద్రతపై తీసుకున్న చర్యలు, సరైన ఉక్కు వినియోగ కార్యక్రమాలు వంటివాటి గురించి కూడా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివరించారు.

 

******



(Release ID: 1635167) Visitor Counter : 228