ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఢిల్లీలో కోవిడ్ నిర్వహణ చర్యలు వేగవంతం చేసిన కేంద్రం
ఢిల్లీ ప్రభుత్వానికి నిర్ధారణ పరీక్షల కిట్స్ ఉచిత సరఫరా
కేంద్ర సాయుధ పోలీసు దళాల ఆధ్వర్యంలో చత్తార్ పూర్ లో 2000 పడకల ఆస్పత్రి నిర్వహణ
Posted On:
27 JUN 2020 11:01AM by PIB Hyderabad
కోవిడ్ నియంత్రణ, నివారణ చర్యల్లో రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం సహాయం చేస్తోంది. అందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎన్నో రకాల మద్దతు అందిస్తోంది. ఇందులో భాగంగా భారత వైద్య పరిశోధనామండలి ( ఇసి ఎం ఆర్) ఢిల్లీలోని 12 లాబ్ లకు 4.7 లక్షల పరీక్షలు నిర్వహించగల పరీక్షల సామగ్రి ఇప్పటివరకు అందించింది. అదే విధంగా 1.57 లక్షల ఆర్ ఎన్ ఏ సేకరణ కిట్స్, స్వాబ్స్ సేకరణకు 2.84 లక్షల వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియం కూడా అందజేశారు. రాపిడ్ టెస్టుల నిర్వహణకు 50,000 యాంటిజెన్ కిట్స్ అందజేయటానికి కూడా భారత వైద్య పరిశోధనామండలి నిర్ణయించింది.
ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్ సి డి సి) సాంకేతిక సహకారం అందిస్తూ మార్గదర్శనం చేస్తోంది. నిఘా, ప్రతిస్పందన వ్యూహాలను ఈ సంస్థ చూస్తోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా క్వారంటైన్ కేంద్రాలు, రక్షణ కేంద్రాల గుర్తింపు, అంచనా తదితర అంశాలను ఈ కేంద్రం చేపడుతుంది. అదే విధంగా సాంకేతిక సిబ్బందికి, నిఘా సిబందికి తగిన శిక్షణ కూడా ఇస్తుంది. ఆలా సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వానికి అందజేయటం ద్వారా సత్వర చర్యలకు దోహదం చేస్తుంది. లోపాలను, వాటి సవరణ మార్గాలను కూడా సూచిస్తుంది. ఢిల్లీ ప్రభుత్వానికి చెంద్చిన లాబ్ ల నిపుణులకు శిక్షణ ఇవ్వటం, వ్యాధి నిర్థారణ పరీక్షలలో సాయం చేయటం చేయటం లాంటి చర్యల ద్వారా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం తగిన పాత్ర పోషిస్తోంది.
పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయటానికి వీలుగా కేంద్ర నిపుణుల బృందాలను నియోగించటం, ఆ తరువాత అందుకు అనుగుణమైన సిఫార్సులు చేయటం, ప్రజారోగ్య నిపుణులను నియమించి జిల్లా స్థాయిలో సాంకేతిక సలహాలు ఇవ్వటం, ఢిల్లీ కోవిడ్ ప్రతిస్పందన కార్యక్రమాన్ని పర్యవేక్షించటం లాంటి పనులను ఈ సంస్థే చూస్తున్నది. ఈ ప్రతిస్పందన కార్యక్రమాన్ని రూపు దిద్దటంలో కూడా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం కీలక పాత్ర పోషించింది.
ఢిల్లీ అంతటా జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం ఈ నెల 27నుంచి వచ్చే నెల 10 వరకు రక్తంలో సీరమ్ పరీక్షలు జరుపుతుంది. ఇందుకోసం 20,000 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి యాంటీబాడీలు ఉన్నాయేమో పరీక్షిస్తుంది.
ఢిల్లీలో వ్యాధి నివారణ చర్యలు వేగవంతం చేయటంలో భాగంగా ఛత్తార పూర్ లోని రాధా స్వామి సత్సంగ్ బియాస్ లో 10,000 పడకలతో సర్దార్ పటేల్ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యత మొత్తం కేంద్ర సాయుధ పోలీసు దళాలు చూస్తున్నాయి. ఇందులో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటిబిపి) చురుకైన పాత్ర పోషిస్తోంది. తగినంత మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచటం కూడా దీని బాధ్యతే. ప్రస్తుతం కనీసం 2,000 పడకలు అందుబాటులోనికి తెస్తున్నారు.
ధౌలా కౌన్ ప్రాంతంలో డిఆర్ డి ఓ నిర్మించిన 1000 పడకల ఆస్పత్రిలో సైన్యానికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది వచ్చే వారం నుంచి పని చేయటం మొదలుపెడతారు. ఈ కొత్త ఆస్పత్రికి ఎయిమ్స్ సిఫార్సు చేసిన బాధితులు వస్తారు. ఈ ఆస్పత్రిలో ఆక్సిజెన్, వెంటిలేటర్లు, ఐసియు కూడా అందుబాటులో ఉంటాయి.
భారత ప్రభుత్వం కేంద్రీయంగా సేకరించి ఢిక్కీలో 11.11 లక్షల ఎన్95 మాస్కులు, 6.81 లక్షల పిపిఇ కిట్స్, 44.80లక్షల హెచ్ సి క్యు మాత్రలు పంపినీ చేయటం తెలిసిందే. ఢిల్లీకి 425 వెంటిలేటర్లు కేటాయించగా అన్నిటినీ అక్కడి ఆస్పత్రులకు అందజేశారు.
ఢిల్లీ ప్రభుత్వం 34 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులు, 4 ప్రత్యేక కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు, 24 ప్రత్యేక కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి కోవిడ్ బాధితులకు వారి తీవ్రతను బట్టి చికిత్స చేస్తోంది. ఆ విధంగా మొత్తం 62 కేంద్రాలలో కోవిడ్ బాధితులకు చికిత్స జరుగుతోంది. రోజూ వీటి సంఖ్యను పెంచే ప్రయత్నం జరుగుతోంది.
చనిపోయిన ప్రతివారి విషయంలో వాళ్లకు ఎన్ని రోజుల ముందు కరోనా వైరస్ సోకిందో, ఎన్ని రోజులకు ఎక్కడి నుంచి ఆస్పత్రికి తీసుకు వచ్చారో సంబంధిత వివరాలు సేకరించాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ప్రతి మరణాన్నీ సకాలంలో భారత ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం ద్వారా ఆ బాధితుణ్ణి సకాలంలో ఆస్పత్రికి తెచ్చిందీ లేనిదీ తెలుసుకోవచ్చునని కేంద్రం అభిప్రాయపడుతోంది. మృతుల భౌతిక కాయాలను బంధువులకు అందజేయటంలో ఎలాంటి అలసత్వమూ ప్రదర్శించరాదని ప్రభుత్వం ఆస్పత్రులను ఆదేశించింది. ఆ విధంగా వారి అంత్యక్రియలు ఆలస్యం కాకుండా చూడాలని కోరింది.
*****
(Release ID: 1634755)
Visitor Counter : 218