సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఎంఎస్‌ఎంఈలు అడ్డంకులు తొలగించుకుని విజేతలుగా నిలిచే మార్గాన్ని చూపిన ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ

పెట్టుబడి పరిమితులను పెంచి, టర్నోవర్‌ను మరో ప్రమాణంగా మార్చనున్న కొత్త వర్గీకరణ; మిలియన్ల ఎంఎస్‌ఎంఈల ఆశలు, ఆకాంక్షలను ఇది పెంచుతుంది

స్థాపన నిబంధనలు సరళీకరణ; 'ఉద్యం' పేరిట జరిగే ఎంఎస్‌ఎంఈ నమోదుకు పత్రాల సమర్పణ అవసరం లేదు

సంస్థ నమోదు దశ నుంచే సులభతరం చేసే సమర్థ విధానం

Posted On: 26 JUN 2020 5:34PM by PIB Hyderabad

                సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వర్గీకరణ, నమోదును సులభతరం చేస్తూ, కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శకాల రూపంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 1వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌కు ఇది సవరణ లాంటిది. పెట్టుబడి, టర్నోవర్‌ ఆధారంగా ఎంఎస్‌ఎంఈల వర్గీకరణకు కొత్త ప్రమాణాలను కొత్త నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. జులై 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

                వచ్చే నెల నుంచి కొత్త నిబంధనలు అమలు చేయడానికి ఎంఎస్‌ఎంఈ శాఖ ముందుగానే అడుగులు వేసింది. ఇందుకోసం, సంబంధిత వర్గాలతోపాటు, సలహా కమిటీ, ఆదాయపన్ను, జీఎస్‌టీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్లతో ఈ నెలలో సంప్రదింపులు జరిపింది. సంప్రదింపుల తర్వాత, శుక్రవారం (26.06.2020‌) సవివర నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

                ఎంఎస్‌ఎంఈల వర్గీకరణ, నమోదు ప్రక్రియ, ఈ విధానాలను సులభతరం చేయడానికి మంత్రిత్వ శాఖ చేసిన ఏర్పాట్లను నోటిఫికేషన్‌లో వివరించారు.

                ఎంఎస్‌ఎంఈల వర్గీకరణ, నమోదుకు సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లన్నీ కొత్త నోటిఫికేషన్‌తో రద్దయ్యాయి. పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఈ ఒక్క నోటిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటే చాలు.

                ఇకపై ఎంఎస్‌ఎంఈని 'ఉద్యం'గా పిలుస్తారు. ఈ పదం వ్యాపారసంస్థ పదానికి దగ్గరగా ఉంటుంది. ఎంఎస్‌ఎంఈ నమోదు 'ఉద్యం' నమోదుగా మారుతుంది.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న మరొక ముఖ్యమైన, సరళీకృత నిర్ణయం:

  •  ఉద్యం నమోదును ఆన్‌లైన్‌ ద్వారా స్వయం ధృవీకరణతో పూర్తి చేయవచ్చు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదు.
  •  ఉద్యం నమోదు ప్రక్రియ ఆదాయపన్ను, జీఎస్‌టీ వ్యవస్థలతో కలిసి ఉంటుందని, ఆన్‌లైన్‌లో నింపిన వివరాలను పాన్‌ లేదా జీఎస్‌టీఐఎన్‌ వివరాలతో ధృవీకరించవచ్చని అధికారులు వెల్లడించారు.

 

నోటిఫికేషన్‌లోని ఇతర ముఖ్యాంశాలు:

* కేవలం ఆధార్‌ ఆధారంగా సంస్థను స్థాపించవచ్చు. స్వయం ధృవీకరణతో ఇతర వివరాలు ఇవ్వొచ్చు. ఇతర పత్రాలేవీ అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం గానీ సమర్పించాల్సిన అవసరంగానీ లేదు కాబట్టి, ఇది కాగిత రహిత ప్రక్రియ.

* సంస్థ, యంత్రాలు లేదా సామగ్రి పెట్టుబడి, టర్నోవర్‌ ఆధారంగా ఇప్పట్నుంచి ఎంఎస్‌ఎంఈల వర్గీకరణ జరుగుతుంది.

* టర్నోవర్‌ను లెక్కించేటప్పుడు వస్తు లేదా సేవల ఎగుమతులు లేదా రెండిటినీ మినహాయించాలని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

* నమోదు ప్రక్రియ చేపట్టాల్సిన పోర్టల్‌ వివరాలను జులై 1 కి ముందే తెలియపరుస్తామని నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ పేర్కొంది.

* ఎంఎస్‌ఎంఈల కోసం బలమైన సరళీకృత విధానాన్ని మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. ఈ ప్రక్రియంతా సింగిల్‌ విండో పద్ధతిలాగా, జిల్లా, ప్రాంతీయ స్థాయిలో పూర్తవుతుంది. ఏ కారణం వల్లనైనా ఉదయం నమోదును చేపట్టలేకపోయిన వ్యాపారవేత్తలకు ఇది సాయపడుతుంది. జిల్లా స్థాయిలో 'జిల్లా పారిశ్రామిక కేంద్రాలు' పారిశ్రామికవేత్తలకు సాయం చేయడంలో బాధ్యత వహిస్తాయి. ఇదే విధంగా, ఈ మధ్యే దేశవ్యాప్తంగా ప్రారంభమైన 'ఛాంపియన్స్‌ కంట్రోల్‌ రూమ్స్‌' ఉద్యం నమోదుతోపాటు తర్వాత కూడా న్యాయపరమైన అంశాలకు బాధ్యత వహిస్తాయి.

* ఆధార్‌ నంబర్‌ లేనివాళ్లు, ఆధార్ నమోదు అభ్యర్థన లేదా గుర్తింపు పత్రం, ఫోటో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్‌, ఓటరు ఐడీ కార్డు, పాస్‌పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్సుతో సింగిల్‌ విండో వ్యవస్థను సంప్రదించవచ్చు. ఆధార్‌ నంబర్‌ వచ్చాక వారి సంస్థను నమోదు చేస్తారు.

                ఎంఎస్‌ఎంఈల నమోదు, వర్గీకరణ మార్గదర్శకాలను ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ విడుదల చేశారు. ఇది సులభతరం, వేగవంతం, అతుకులు లేనిది, అంతర్జాతీయ స్థాయి విధానం, సులభతర వాణిజ్యం దిశగా విప్లవాత్మక అడుగుగా గడ్కరీ అభివర్ణించారు. ఈ సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు అండగా మంత్రిత్వ శాఖ నిలిచిందన్న సందేశాన్ని ఈ వ్యూహాత్మక అడుగు చాటుతుందన్నారు.

                కొత్త నోటిఫికేషన్‌పై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రిత్వ శాఖలో చరిత్రను సృష్టిస్తుందని అన్నారు. భారతీయ ఎంఎస్‌ఎంఈలను జాతీయ, అంతర్జాతీయ విజేతలుగా మార్చడానికి, అడ్డంకులను అధిగమించడానికి, ప్రపంచ మార్కెట్లలో కీలక పాత్ర పోషించేలా చేయడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను నెరవేర్చే మరో అడుగుగా అభివర్ణించారు.

 

*****(Release ID: 1634677) Visitor Counter : 44