సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

కేన్స్ ఫిల్మ్ మార్కెట్ - 2020 లో వర్చ్యువల్ భారత పెవిలియన్ ను కేంద్ర మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ప్రారంభించారు

Posted On: 22 JUN 2020 6:59PM by PIB Hyderabad

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ ఈ రోజు వర్చువల్ ఇండియా పెవిలియన్‌ను ప్రారంభించారు.  ఈ పెవిలియన్ లో భాషా, సాంస్కృతిక మరియు ప్రాంతీయ రంగాలలో భారతీయ సినిమా గురించిన విశేషాలను ప్రదర్శించడం జరుగుతుంది. చలన చిత్రాల పంపిణీ, ఉత్పత్తి, భారతదేశంలో చిత్రీకరణ, కధనం అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్రాల అమ్మకాలు మరియు సిండికేషన్లను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ఈ పెవిలియన్ రూపొందించారు. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/WhatsAppImage2020-06-22at7.16.04PMH3NQ.jpeg

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలన చిత్ర రంగానికి చెందిన వ్యక్తులను, సినీ ప్రేమికులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, వర్చువల్ ప్రారంభోత్సవాలు ఇప్పుడు కొత్తగా సర్వ సాధారణమయ్యాయనీ, ఈ వర్చువల్ వేదికలు నిజమైన భాగస్వామ్యానికి నూతన అవకాశాలను కల్పిస్తున్నాయనీ, అన్నారు.  సినిమాలు భారతదేశం యొక్క మృదువైన శక్తి అని, అన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం చలన చిత్రాల సౌకర్యాల కల్పన కార్యాలయం ఏక గవాక్షంగా రూపొందించినట్లు ఆయన చెప్పారు.  భారతదేశంలో తమ చిత్రాలను చిత్రీకరించుకుని, ప్రపంచ మార్కెట్లో విక్రయించాలని మంత్రి అంతర్జాతీయ చలనచిత్ర రంగాన్ని ఆహ్వానించారు.  భారతదేశం నుండి కేన్స్ కు పంపిన రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రపంచ చలన చిత్ర సమాజానికి, భారతదేశం గురించీ, భారతీయ సినిమా గురించీ పూర్తి సమాచారాన్ని అందించే కేంద్రంగా భారత పెవిలియన్  ఉపయోగపడుతుంది.  వ్యాపార సమావేశాలతో పాటు చలన చిత్ర నిర్మాతలు, ఇతర మీడియా మరియు వినోద పరిశ్రమ భాగస్వాముల మధ్య సంబంధాలకు ఈ పెవిలియన్ కేంద్రంగా ఉంటుంది. 

2020 జూన్ 22 నుండి 26వ తేదీ మధ్యలో, భారత పెవిలియన్ సమయోచిత ఆసక్తి ఉన్న అంశాలపై వివిధ సదస్సులను నిర్వహిస్తుంది. ఈ సదస్సుల్లో- కోవిడ్ అనంతర ప్రపంచంలో చిత్రాల భవిష్యత్తు : భారతదేశంలో చిత్రాలు : భారతీయ భావాన్ని అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లడం : డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ లు ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో చలన చిత్రోత్సవాల యొక్క ప్రాముఖ్యత మరియు పాత్ర :  ప్రపంచానికి భారతీయ చలన చిత్ర సేవల ఎగుమతి / ప్రపంచ వినోద రంగానికి సేవలు అందించడం :  సహ-నిర్మాణాలను తిరిగి శక్తివంతం చేయడం వంటి విభిన్న అంశాలపై చర్చలు జరుగుతాయి. 

చలన చిత్ర కమీషన్లు, చలన చిత్రోత్సవాలు, చలన చిత్ర నిధులు వంటి అంశాలపై మూడు రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు.  ఈ సమావేశాల్లో భారతీయ చిత్రాలను ప్రోత్సహించడం, దేశీయ, అంతర్జాతీయ మీడియా మరియు వినోద రంగాల నిర్వాహకుల మధ్య భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వంటి విషయాలపై చర్చిస్తారు. 

మొదటిసారిగా, భారత పెవిలియన్  రెండు జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న సినిమాలను ప్రదర్శిస్తోంది. అవి -  మై ఘాట్: క్రైమ్ నంబర్ 103/200 (మరాఠీ) మరియు హెల్లారో (గుజరాతీ). 

అలాగే, ప్రముఖ చలన చిత్ర నిర్మాత, దర్శకుడు సత్యజిత్ రే శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని, వర్చువల్ ఇండియా పెవిలియన్ లో ఆయన చిత్రాల విశేషాలలో కొన్ని ఏర్పాటు చేశారు. గణశత్రు, ఘరే బైర్, అగంతక్ మరియు మ్యూజిక్ ఆఫ్ సత్యజిత్ రే చిత్రాలను పెవిలియన్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

2020 నవంబర్ 20వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోవాలో జరిగే భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం-2020 కి సంబంధించిన పోస్టర్ మరియు ఫెస్టివల్ బుక్ ‌లెట్ ‌ను కూడా మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు.

వర్చువల్ ఇండియా పెవిలియన్ వద్ద ప్రారంభ సమావేశంలో చలన చిత్ర ప్రముఖులు, విజేతలు, మీడియా మరియు వినోద పరిశ్రమకు చెందిన భాగస్వాములతో పాటు సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.  వీరిలో - భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీ అమిత్ ఖరే,  భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి, శ్రీ అతుల్ కుమార్ తివారీ,  భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (చలన చిత్రాలు), శ్రీమతి టి.సి.ఏ.కల్యాణి, భారత ప్రభుత్వ ఎన్.ఎఫ్.డి.సి. మేనేజింగ్ డైరెక్టర్,  ఫ్రాన్స్ లో భారత రాయబార కార్యాలయం మినిస్టర్ (కాన్సులర్) శ్రీమతి శ్రీల దత్త కుమార్,  సి.బి.ఎఫ్.సి. చైర్మన్, శ్రీ ప్రసూన్ జోషిజాతీయ అవార్డు పొందిన దర్శకుడు శ్రీ మాధుర్ భండార్కర్, ఆక్టివ్ తెలుగు ఫిల్మ్ మేకర్స్ గిల్డ్, జాతీయ ప్రతినిధి, శ్రీ డి.సురేష్ బాబు,  స్పెషల్ ట్రీట్స్ ప్రొడక్షన్ కు చెందిన శ్రీ కోలిన్ బుర్రౌస్,  చలన చిత్ర నటి శ్రీమతి కంగనా రనౌత్,  మై ఘాట్ చలన చిత్ర నటి శ్రీమతి ఉషా జాదవ్ మొదలైన వారు ఉన్నారు. 

*****



(Release ID: 1633457) Visitor Counter : 237