రైల్వే మంత్రిత్వ శాఖ
భారతీయ రైల్వేలు అసిస్టెంట్ లోకో పైలట్లు (ఏ.ఎల్.పి.లు) మరియు టెక్నీషియన్ల నియామకాలను విజయవంతంగా ముగించింది - ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నియామక ప్రక్రియల్లో ఒకటి.
64,000 ఏ.ఎల్.పి. మరియు టెక్నీషియన్ల పోస్టులకు అనూహ్యంగా 47.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
మొత్తం 64,371 (ఏ.ఎల్.పి.లు 27,795 మరియు టెక్నీషియన్లు 64,371) ఖాళీలకు గాను ఎంపిక కమిటీ మొత్తం 56,378 మంది అభ్యర్థులను ఎంపికచేసింది.
40,420 మంది అభ్యర్థులకు (22,223 ఏ.ఎల్.పి. లు మరియు 18,197 టెక్నిషన్లుగా) నియామక పత్రాలు జారీ చేశారు.
కొత్తగా నియమించబడిన 19,120 మంది అభ్యర్థులకు (10,123 అసిస్టెంట్ లోకో పైలట్లు (ఏ.ఎల్.పి) మరియు 8,997 టెక్నిషన్లు) కోవిడ్ లాక్ డౌన్ సంబంధిత నిబంధనలు సడలించిన వెంటనే విధులు ప్రారంభించడానికి వీలుగా శిక్షణ ఇస్తున్నారు.
శిక్షణ పూర్తి చేస్తుకున్న మిగిలిన అభ్యర్థులను దశలవారీగా విధుల్లో చేర్చుకుంటారు.
నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో (ఎన్‌టిపిసి - గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో) పోస్టులకు పరీక్షల ప్రక్రియను కూడా భారతీయ రైల్వేలు వేగవంతం చేయనున్నాయి.
ఎన్.టి.పి.సి. పోస్టుల కోసం మొత్తం 1,26,30,885 (అనగా 1.25 కోట్లకు పైగా) అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేశారు.
కోవిడ్ -19 నేపథ్యంలో అన్ని నిబంధనలను పరిగణిస్తూ,
Posted On:
18 JUN 2020 1:19PM by PIB Hyderabad
క్లిష్టమైన భద్రత మరియు కార్యాచరణ పోస్టులను నింపడం కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే అతిపెద్ద నియామక ప్రక్రియల్లో ఒకటిగా చేపట్టిన నియామకాలను విజయవంతంగా నిర్వహించి, చివరి దశకు చేరుకుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్.ఆర్.బి) అసిస్టెంట్ లోకో పైలట్లు (ఎ.ఎల్.పి) మరియు టెక్నీషియన్ల పోస్టుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 64,371 ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ (సి.ఎన్) నంబర్ 01/2018 అనుగుణంగా 03.02.2018 నుండి 31.03.2018 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 47,45,176 ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి. ప్రాధమికంగా ఎంపిక చేసిన అభ్యర్థులకు, తదుపరి ఎంపిక పథకంలో భాగంగా 3 దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. తరువాత వైద్య పరీక్షలు (ఇది లోకో పైలట్ కు అత్యవసరమైన దూర దృష్టి / రంగు దృష్టి మరియు అప్రమత్తత స్థాయిని గుర్తించేందుకు నిర్వహించే కఠినమైన వైద్య పరీక్షలు) తో పాటు ధృవ పత్రాలను పరిశీలించారు. ఈ పోస్టులకు సుమారు 47.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
మొత్తం 64,371 (ఏ.ఎల్.పి.లు 27,795 మరియు టెక్నీషియన్లు 64,371) ఖాళీలకు గాను ఎంపిక కమిటీ మొత్తం 56,378 మంది అభ్యర్థులను (26,968 ఏ.ఎల్.పి.లు, 28,410 టెక్నిషన్లు) ఆమోదించింది. 40,420 మంది అభ్యర్థులకు (22,223 ఏ.ఎల్.పి. లు మరియు 18,197 టెక్నిషన్లుగా) నియామక పత్రాలు జారీ చేశారు. కొత్తగా నియమించబడిన 19,120 మంది అభ్యర్థులకు (10,123 అసిస్టెంట్ లోకో పైలట్లు (ఏ.ఎల్.పి) మరియు 8,997 టెక్నిషన్లు) కోవిడ్ లాక్ డౌన్ సంబంధిత నిబంధనలు సడలించిన వెంటనే విధులు ప్రారంభించడానికి వీలుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణా ప్రక్రియ ఏ.ఎల్.పి. లకు 17 వారాలు, టెక్నిషన్లకు 6 నెలలు ఉంటుంది.
ఉద్యోగాల్లో చేరవలసిందిగా లాక్ డౌన్ ముందు అభ్యర్థులకు లేఖలు జారీ చేసినప్పటికీ, కొరోనా వ్యాప్తి మరియు లాక్ డౌన్ విధింపు కారణంగా కొంతమంది అభ్యర్థులు విధుల్లో చేరలేదు.
కొత్తగా ఎంపికైన అభ్యర్థులందరికీ దశలవారీగా తగిన విధానం ప్రకారం రైల్వేలో విధుల్లో నియమించడం జరుగుతుంది. రైల్వే ఒక కార్యాచరణ విభాగం మరియు రైలు కార్యకలాపాల భద్రత చాలా ముఖ్యమైనది కాబట్టి, కొత్తగా నియమించిన ఉద్యోగులందరికీ తగిన శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఈ శిక్షణలో భాగంగా తరగతి గది శిక్షణ ఉంటుంది, తరువాత క్షేత్ర స్థాయి శిక్షణ ఇస్తారు. పూర్తి స్థాయి విధులను అప్పగించే ముందు అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షించడం జరుగుతుంది. తరగతి గదులు, వసతి సదుపాయం, గ్రంధాలయం, బోధకులు మొదలైన వాటి సామర్థ్య పరిమితులను పరిగణనలోకి తీసుకుని, అందుబాటులో ఉన్న శిక్షణా వనరులను గరిష్టంగా వినియోగించుకుంటూ దశలవారీగా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.
కరోనా వ్యాప్తి కారణంగా, సామాజిక దూర నిబంధనలను అనుసరించడానికి మరియు మహమ్మారిని పరిమితం చేయడానికి అన్ని రకాల శిక్షణా కార్యక్రమాలను నిలిపివేయడం జరిగింది. పరిస్థితి అనుకూలించిన వెంటనే శిక్షణా కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయి.
ఈ నియామక ప్రక్రియ 3 దశల్లో జరిగింది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష 04.08.2018 నుండి 04.09.2018 వరకు 11 రోజులపాటు 424 కేంద్రాలలో 33 షిఫ్టులలో 77 శాతం రికార్డు స్థాయి, అంటే దాదాపు 36 లక్షలకు పైగా అభ్యర్థుల హాజరుతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షను 21.01.2019 నుండి 23.01.2019 వరకు 3 రోజుల పాటు నిర్వహించగా, ఇందులో 13,00,869 (13 లక్షలకు పైగా) అభ్యర్థులు బహుళ షిఫ్టులలో పాల్గొన్నారు. సుమారు 2,22,360 మంది అభ్యర్థులకు లోకో పైలట్ ఉద్యోగానికి అవసరమైన అప్రమత్తతను అంచనా వేయడం కోసం కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి.బి.ఎ.టి) ని 10.05.2019 మరియు 21.05.2019 తేదీలలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది.
అంతకుముందు జోనల్ రైల్వే నిర్వహించిన అన్ని పోస్టులకు వైద్య పరీక్షల నిర్వహణ బాధ్యతను ఆర్.ఆర్.బి.లకు అప్పగించారు. దీని ప్రకారం, సుమారు 90,000 మంది అభ్యర్థులకు (50 శాతం అదనపు అభ్యర్థులతో సహా) 16.06.2019 నుండి 20.08.2019 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన మరియు వైద్య పరీక్షలు జరిగాయి. ఇంతకు ముందే తెలియజేసినట్లు, రైలు నడుపుతున్న లోకో పైలట్ కు ఎటువంటి స్వల్ప దృష్టి లోపం కూడా లేకుండా చూడడం అనేది ఈ పరిశ్రమలో నిర్వహించే చాలా కఠినమైన వైద్య పరీక్షల్లో ఒకటి.
జోనల్ రైల్వేకు 2019 సెప్టెంబర్ నుండి 2020 ఫిబ్రవరి వరకు జాబితాలు సరఫరా చేయడం జరిగింది. ఏ.ఎల్.పి. మరియు టెక్నీషియన్ ఉద్యోగాలు రెండింటికీ సి.బి.టి. ఉమ్మడి కాబట్టి, కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష (సీ.బీ.ఐ.టి) లో ఏ.ఎల్.పి. కి అర్హత సాధించలేని వారికి టెక్నీషియన్ ఫలితం తరువాత ప్రకటించబడింది.
ఏ.ఎల్.పి. లు మరియు టెక్నిషన్ల నియామకంతో పాటు, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్.ఆర్.బి. లు) మొత్తం 35,208 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్.టి.పి.సి. - గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించగా, మొత్తం 1,26,30,885 (అనగా 1.25 కోట్లకు పైగా) ఆన్‌లైన్ దరఖాస్తులు వచ్చాయి.
కోవిడ్ వ్యాప్తికి ముందు ఈ పరీక్షా ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందడంతో, ఈ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది. నిబంధనలను సడలించి, పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోగానే, భారతీయ రైల్వే నియామక ప్రక్రియను వేగవంతం చేయనుంది.
ప్రస్తుత పరిస్థితులలో, కోవిడ్ మహమ్మారి కారణంగా గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా కొత్త రకమైన సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఫేస్ మాస్క్‌లు ధరించాల్సి ఉంటుంది, పరీక్షా కేంద్రాలలో ఎక్కువమంది అభ్యర్థులు ఒక చోట గుమిగూడే పరిస్థితి ఉంటుంది, ప్రతి షిఫ్ట్ తరువాత పరీక్షా కేంద్రాలను శుభ్రపరచాలి, ఇద్దరు అభ్యర్థుల మధ్య మరింత సామాజిక దూరాన్ని పెంచే క్రమంలో - ఒక్కొక్క పరీక్షా కేంద్రానికీ కేటాయించవలసిన అభ్యర్థుల సంఖ్యను తగ్గించాలి, వంటి సవాళ్లను అధిగమిస్తూ, ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులకు న్యాయమైన మరియు సజావుగా పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూ అవసరమైన అన్ని నిబంధనలను అమలు చేయవలసి ఉంటుంది.
కోవిడ్ -19 నేపథ్యంలో, అన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకుని, 1.25 కోట్ల మంది దరఖాస్తుదారులకు భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించడంతో పాటు, అన్ని ప్రక్రియల కార్యాచరణ ప్రణాళికతో భారతీయ రైల్వే ఒక అనువైన వ్యూహాన్ని రూపొందిస్తోంది.
ఆర్.ఆర్.బి. లు, తమ వెబ్‌సైట్‌లు మరియు అభ్యర్థుల వ్యక్తిగత ఎస్.ఎమ్.ఎస్. మరియు ఈ-మెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని అభ్యర్థులకు అందజేస్తున్నాయి. అభ్యర్థులు ఈ అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనీ, తప్పుడు ప్రచారం మరియు సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే పుకార్లతో తప్పుదారి పట్టవద్దనీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటిలో చాలావరకు నిజమైన అభ్యర్థులను తప్పుదారి పట్టించేవిగా, పరీక్షకు వారు సరిగా సన్నద్ధం కాకుండా చేసేవిగా ఉంటాయని వారు హెచ్చరించారు.
*****
(Release ID: 1632367)
Visitor Counter : 307