హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఇటీవల వరుసగా జరిగిన సమీక్ష సమావేశాలకు అనుగుణంగా, దిల్లీలో కొవిడ్‌ పరిస్థితిని అదుపులోకి తేవడానికి తీసుకున్న చర్యలు

రోజువారీ నమూనాల పరీక్షలు 4 వేల నుంచి 8 వేలకు పెంపు
దిల్లీలోని 242 కంటెయిన్‌మెంట్ జోన్లలో ఇంటింటి ఆరోగ్య సర్వే; 77 శాతం జనాభా వివరాలు సేకరణ, మిగిలినవారి వివరాలు ఈనెల 20వ తేదీ నాటికి సేకరణ
కరోనా పరీక్ష ధరను రూ.2,400గా నిర్ధరించిన నిపుణుల బృందం, అవసరమైన చర్యల కోసం దిల్లీ ప్రభుత్వానికి నివేదిక
ఐసీఎంఆర్‌ ఆమోదించిన కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం గురువారం నుంచి కరోనా పరీక్షలు; కొత్త 'ర్యాపిడ్‌ యాంటీజెన్‌' పద్ధతి ద్వారా వేగంగా, తక్కువ ఖర్చుతో పరీక్షలు; దిల్లీలో 169 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు

Posted On: 17 JUN 2020 9:22PM by PIB Hyderabad

దేశ రాజధాని దిల్లీలో విజృంభిస్తున్న కొవిడ్‌ను అదుపులోకి తేవడానికి.. కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన ఈనెల 14, 15 తేదీల్లో వరుసగా సమీక్ష సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను అనుగుణంగా దిల్లీలో అనేక చర్యలు చేపట్టారు. నమూనాల పరీక్షలను తక్షణం రెట్టింపు చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో 16,618 నమూనాలను సేకరించారు. 14వ తేదీ వరకు రోజువారీ నమూనాల సంఖ్య 4,000-4,500 మధ్య ఉండేది. 6,510 నమూనాల ఫలితాలు వచ్చాయి. మిగిలిన ఫలితాలు గురువారం వస్తాయి.

    దిల్లీలోని 242 కంటైన్‌మెంట్‌ జోన్లలో ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ జోన్లలో 2,30,466 మంది నివశిస్తుండగా, 1,77,692 మంది నుంచి 15, 16 తేదీల్లో పూర్తి వివరాలు సేకరించారు.  మిగిలినవారి వివరాల సేకరణను ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేస్తారు.

    శ్రీ అమిత్‌ షా నిర్దేశం ప్రకారం, కరోనా పరీక్ష కేంద్రాల్లో ధర నిర్ణయంపై డా. వి.కె.పాల్‌ అధ్యక్షతన నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ తన నివేదికను, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, దిల్లీ ప్రభుత్వానికి  అందించింది. ఈ నివేదిక ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ఒక్కో పరీక్ష ధరను రూ.2,400గా ఈ కమిటీనిర్ధరించింది.

    హోంమంత్రి అమిత్‌ షా నిర్ణయం ప్రకారం మరో చర్య కూడా తీసుకున్నారు. ఐసీఎంఆర్‌ ఆమోదించిన కొత్త ప్రొటోకాల్‌ ప్రకారం, కొత్త 'ర్యాపిడ్‌ యాంటీజెన్‌' పద్ధతిలో గురువారం నుంచి కరోనా పరీక్షలు చేస్తారు. దీనిద్వారా వేగంగా, తక్కువ ఖర్చుతో పరీక్షలు సాధ్యమవుతాయి. పరీక్ష కిట్ల పంపిణీలో దిల్లీకి ప్రాధాన్యం ఇస్తారు. నమూనాల సేకరణ, పరీక్షల కోసం దేశ రాజధానిలో 169 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.


(Release ID: 1632225) Visitor Counter : 244