రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రాజీమార్గంలో క్లెయిముల పరిష్కారానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు

మూడు స్వతంత్ర 'నిపుణుల సయోధ్య కమిటీలు' ఏర్పాటు
ఐదు సమావేశాల్లో, ఆరు నెలలలోపు వస్తున్న పరిష్కారాలు
ఇరువర్గాలకు అనుకూలంగా, వేగవంతంగా రాజీ ప్రక్రియ
కేసుల ద్వారా ఆగిపోయిన నగదును తిరిగి వాడుకలోకి తెచ్చే వీలు

Posted On: 17 JUN 2020 5:15PM by PIB Hyderabad

    ఏళ్ల తరబడి పేరుకుపోయిన క్లెయిముల పరిష్కారాన్ని వేగవంతం చేసి, అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. రాజీ ప్రయత్నాల కోసం మూడు స్వతంత్ర 'నిపుణుల సయోధ్య కమిటీలను' (సీసీఐఈ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో ముగ్గురు చొప్పున సభ్యులు ఉంటారు. విశ్రాంత న్యాయాధికారులు, ప్రజా పరిపాలన, ఆర్థిక రంగానికి చెందిన సీనియర్‌ నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.   
    మధ్యవర్తిత్వ చట్టం 2015కు 2019లో చేసిన సవరణ ప్రకారం, మధ్యవర్తిత్వానికి చెందిన వివాదాలన్నీ 12-18 నెలల కాలంలో పరిష్కరించాలి. అయితే వివాదాలన్నీ వివిధ అంశాలతో ముడిపడి ఉన్నందున, 12 నెలల్లో పరిష్కారం చూపడం కష్టసాధ్యం. అదే సమయంలో.. సీసీఐఈ ద్వారా వివాదాలను చర్చల పద్ధతిలో వేగంగా, పారదర్శకంగా, స్నేహపూర్వకంగా పరిష్కరించుకునే భరోసా ఉంది. సీసీఐఈ ద్వారా ప్రతి కేసులో ఐదు చర్చా సమావేశాల్లో, ఆరు నెలల్లోపు రాజీ-పరిష్కాలను కనుగొన్నారు. అంతేకాక, 'మధ్యవర్తిత్వం, రాజీ (సవరణ) చట్టం' 2015 ప్రకారం.. ఇరువర్గాలకు అనుకూలంగా, వేగవంతంగా రాజీ ప్రక్రియ ఉంటుంది. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు లేదా ఉత్తర్వులకు సమానమైన న్యాయ విలువ ఈ పరిష్కారాలకు ఉంటుంది.

    ఇప్పటివరకు 108 కేసులను సీసీఐఈకి అప్పగించారు. రూ.13,349 కోట్ల విలువైన క్లెయిములను విజయవంతంగా రూ.3,743 కోట్లకు పరిష్కరించారు. అన్ని వివాదాలను రాజీమార్గంలో పరిష్కారించుకునేందుకు ఎన్‌హెచ్‌ఏఐ వేగంగా 
పనిచేస్తోంది. సుదీర్ఘకాలంపాటు కోర్టుల్లో నలుగుతున్న వివాదాల నుంచి ఇరువర్గాలకు విముక్తి కల్పించడంతోపాటు, కేసుల ద్వారా ఆగిపోయిన నగదును ప్రైవేటు రంగ పునరుజ్జీవనం కోసం తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది.



(Release ID: 1632187) Visitor Counter : 180