జల శక్తి మంత్రిత్వ శాఖ

త్రిపురలో జల్ జీవన్ మిషన్ అమలు తీరు పట్ల కేంద్రమంత్రి హర్షం

Posted On: 16 JUN 2020 7:52PM by PIB Hyderabad

జల్ జీవన్ మిషన్ కింద 2023 నాటికల్లా త్రిపురలో ఇంటింటికీ నీళ్ళందించే పథకం అమలుకు కట్టుబడి ఉండటం పట్ల కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర షెకావత్ హర్షం వ్యక్తం చేశారు.ఈ మేరకు త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ బిప్లవ్ కుమార్ దేవ్ కు లేఖ రాశారు. నిజానికి కేంద్రం 2024 నాటికి నూటికి నూరుశాతం ఇళ్లకు నీటి కనెక్షన్ల ద్వారా సురక్షిత త్రాగు నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే త్రిపుర అంతకు ఏడాది ముందే పూర్తిచేయాలనుకోవటం ఆనందదాయకమని మంత్రి ఆ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉన్న 8.01 లక్షల ఇళ్లకు గాను కేవలం 7.63% ఇళ్ళకు మాత్రమే నీళ్ళపంపు కనెక్షన్లున్నాయి. అందువలన 100%  లక్ష్యం సాధించటానికి రాష్ట్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే త్రిపుర ఆ నమ్మకాన్నిస్తూ ప్రణాళికాబద్ధంగా సాగటాన్ని మంత్రి తన లేఖలో ప్రస్తావించారు. ప్రతి ఇంటికీ నీరందించే జల్ జీవన్ మిషన్ విజయవతం కావటానికి ఈ కార్యక్రమాన్ని త్రిపుర వేగవంతం చేయాల్సి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్దారు. దీనివలన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తగినంత నాణ్యమైన తాగునీరు అందుతుందని, మన తల్లులు, సోదరులు గౌరవప్రదమైన జీవితం గడిపేలా దీర్ఘకాల ఫలితాలనిస్తుందని పేర్కొన్నారు.

 ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలా సహాయ సహకారాలందిస్తుందన్నారు. రాష్ట్రాలు ఇళ్ళకు నీటి కనెక్షన్లు ఇవ్వటంలో చూపే పురోగతి ఆధారంగా ఎప్పటికప్పుడు తనవాటా నిధులు విడుదల చేయటానికి కేంద్రం అంకిత భావంతో ఉన్నదని చెప్పారు. రాష్ట్రాలు సత్వరం చేపట్టాల్సిన అంశాలను కూడా మంత్రి ప్రస్తావించారు. 2019-20 లో లక్ష్యం 1.66  లక్షల ఇళ్ళు కాగా రాష్ట్రంలో నీటి సౌకర్యం కల్పించింది 45,769 ఇళ్ళు మాత్రమేనన్నారు. 2019-20 లో రాష్ట్రానికి రూ. 107.64  కోట్లు కేటాయించగా మొత్తం సొమ్ము విడుదల చేశామన్నారు. అదే సమయంలో అదనపు ప్రోత్సాహకంగా రూ. 37.73 కోట్లు ఇవ్వగా రాష్ట్రం రూ. 59.45 కోట్ల కేంద్ర నిధులు మాత్రమే వాడుకున్నదన్నారు.

ప్రతి ఇంటికీ త్రాగు నీరందించటమన్నది జాతీయ ప్రాధాన్యమని మంత్రి షెఖావత్ పునరుద్ఘాటించారు. 2020-21 సంవత్సరానికి గాను త్రిపురకు కేటాయింపులను రూ.64 కోట్ల నుంచి రూ. 156.61  కోట్లకు పెంచామన్నారు. రాష్ట్రం దగ్గర ప్రారంభ నిల్వ రూ. 136.45 కోట్లు ఉండగా ఈ ఏడాది  మరో రూ. 156.61 కోట్లు కేటాయించామని చెప్పారు.  రాష్ట్రపు మాచింగ్ వాటా కింద మొత్తం రూ. 320.16  కోట్లు ఈ పథకం కింద అందుబాటులో ఉందన్నారు.


ఈ నీటి సరఫరా అమలు తీరును  సమీక్షించి ప్రణాళికాబద్ధంగా నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయాలని త్రిపుర ముఖ్యమంత్రిని కేంద్రమంత్రి కోరారు. ఇప్పటికే ఉన్న పైపులైన్ల పునరుద్ధరణ పథకాలమీద  కూడా దృష్టి సారించాలన్నారు. ఈ విధమైన భర్తీ వలన నూరుశాతం నీరందే గ్రామాలు కొన్నయినా నిర్ణీత వ్యవధిలో సిద్ధమవుతాయని సూచించారు. వచ్చే 4-6  నెలల్లో దీన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని కోరారు. దీనివలన నిరుపేద కుటుంబాలకు త్రాగు నీటిన్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ముఖ్యంగా ఎస్సీ/ఎస్టీ జనాభా ప్రాబల్యం ఉన్న గ్రామాల్లో  సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజన అమలు చేయాలని కోరారు.

నీటి సరఫరా వ్యవస్థల దీర్ఘకాల సుస్థిరత ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, ఇప్పటికే అందుబాటులో ఉన్న త్రాగు నీటి వనరులను బలోపేతం చేయాలని సూచించారు.  గ్రామ స్థాయిలోనే ఇందుకు ప్రణాళికారచన జరగాలని చెబుతూ, ప్రతి గ్రామానికీ ఒక గ్రామ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.  అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రస్తావించటంతోబాటు గ్రామీణ ఉపాధి హామీ, ఎస్ బి ఎం, పంచాయితీ రాజ్ సంస్థలకు15వ ఆర్థిక సంఘం గ్రాంట్లు, కాంపా నిధులు, లాంటి వేరు వేరు పథకాల వనరులను సమీకృతం చేసుకోవాలని కూడా కోరారు.

గ్రామాలలో ప్రణాళికా రూపకల్పన, ఆచరణ, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ తదితర అంశాలలో స్థానిక గ్రామ పంచాయితీలు, వాడకం దారుల సంఘాలను భాగస్వాములను చేయాలని కేంద్రమంత్రి తన లేఖలో త్రిపుర ముఖ్యమంత్రికి సూచించారు.  అప్పుడే దీర్ఘకాలంలో సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థ కొనసాగుతుందన్నారు. జల్ జీవన్ మిషన్ ను ఒక నిజమైన ప్రజా ఉద్యమంగా మలచాల్సి ఉందన్నారు.

2020-21లో త్రిపురకు 15వ ఆర్థిక సంఘం పంచాయితీ రాజ్ సంస్థలకిచ్చే నిధులకింద రూ. 191 కోట్లు ఇవ్వగా అందులో సగం కచ్చితంగా నీటి సరఫరా, పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేయాల్సి ఉంది.  స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద కేటాయించిన నిధులను నీటి శుద్ధికి వాడాల్సి ఉంది.
కోవిడ్ సంక్షోభం నెలకొన్న తరుణంలోనే మంత్రి ఈ లేఖ రాయటం గమనార్హం. భౌతిక దూరం పాటించటం లాంటి ప్రవర్తనాపరమైన అలవాట్లను ప్రజలకు తెలియజేస్తున్న సమయంలోనే తగినంత నీటిని అందించటం కూడా ముఖ్యమని గుర్తించటం ప్రత్యేకం. అదే విధంగా నీటి సరఫరా పనుల ద్వారా గ్రామీణ ఉపాధి పెరుగుతుంది. గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు కూడా పనులు దొరకటం వలన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

2023 నాటికల్లా నూటికి నూరుశాతం ఇళ్ళకు త్రాగు నీటి సౌకర్యం కల్పించాలన్న లక్ష్యానికి కట్టుబడిన త్రిపురకు పూర్తి సహకారం అందిస్తామని జల్ శక్తి మంత్రి ఈ లేఖ ద్వారా త్రిపుర ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ప్రణాళికా రూపకల్పన, అమలు తీరు తదితర అంశాలమీద  ముఖ్యమంత్రితో త్వరలోనే వీడియో కాన్ఫరెన్స్ జరపాలనుకుంటున్నట్టు కూడా కేంద్రమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

           

 

*****



(Release ID: 1631986) Visitor Counter : 138