రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
"ఇండియా ర్యాంకింగ్స్ 2020"లో మెరిసిన నైపర్ బ్రాండ్
ఔషధ విభాగంలోని 10 అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల్లో 3 స్థానాలు
మొహాలీ, హైదరాబాద్, అహ్మదాబాద్ క్యాంపస్‌లకు 3, 5, 8 ర్యాంకులు
Posted On:
12 JUN 2020 4:52PM by PIB Hyderabad
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ "ఇండియా ర్యాంకింగ్స్ 2020"ని విడుదల చేసింది. వివిధ విభాగాల్లోని ఉన్నత విద్యాసంస్థలకు, ఐదు ప్రమాణాల్లో పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. ఈ ర్యాంకుల్లో "నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్" (నైపర్స్) మరోమారు ఘనతను చాటాయి. ఔషధ విభాగంలో, దేశవ్యాప్తంగా ఉన్న 10 అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల్లో స్థానాలను నిలబెట్టుకున్నాయి. తొలి పది ర్యాంకుల్లో 3 ర్యాంకులను పొందాయి.
దేశవ్యాప్తంగా ఉన్న ఏడు నైపర్స్‌లో.., మొహాలీ క్యాంపస్ 3వ స్థానం సాధించింది. హైదరాబాద్ క్యాంపస్ 5వ స్థానంలో, అహ్మదాబాద్ క్యాంపస్ 8వ స్థానంలో నిలిచాయి. రెండేళ్లుగా ఇవి ఒక్కో స్థానాన్ని మెరుగుపచుకుంటూ వస్తున్నాయి. గౌహతి, రాయబరేలి, కోల్‌కతా నైపర్స్ తొలిసారిగా వరుసగా 11, 18, 27 ర్యాంకులు సాధించాయి.
ఉన్నత స్థానాలు దక్కించుకోవడం ద్వారా... ఔషధాలు, వైద్య పరికరాలకు సంబంధించిన విద్య, పరిశోధన, ఆవిష్కరణల్లో తమ స్థాయి, నిబద్ధతలో వృద్ధిని నైపర్స్ చాటాయి.
దేశవ్యాప్త ర్యాంకుల్లో నైపర్స్ విజయంపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ సదానంద గౌడ సంతోషం వ్యక్తం చేశారు. నైపర్స్ అధ్యాపకులు, విద్యార్థులను అభినందించారు.
విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వైద్య, దంతవైద్య, న్యాయ, ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, ఔషధ విద్యాసంస్థలకు, వాటి పనితీరు ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ర్యాంకులు ఇచ్చింది. ప్రతి ఏటా ఈ ర్యాంకులు కేటాయిస్తుంది.
***
(Release ID: 1631241)
Visitor Counter : 272