ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మహారాష్ట్రలో కోవిడ్ -19 ని ఎదుర్కోవడంలో సన్నద్ధత, నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్
Posted On:
11 JUN 2020 6:29PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ , మహారాష్ట్రలో కోవిడ్ -19ని ఎదుర్కొవడంలో సన్నద్దత,నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ రాజేశ్ తోపె, మహారాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శ్రీ అమిత్ దేశ్ ముఖ్,మహారాష్ట్రలోని కోవిడ్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే సమక్షంలో ఈ సమావేశం జరిగింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఓ.ఎస్.డి శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలూ కోవిడ్ ప్రభావం పడిన జిల్లాలుగా ఉన్నాయి. కోవిడ్ -19 పరిస్థితి, నిర్వహణకు సంబంధించి ముంబాయి, థానే, పూణే, నాసిక్. పాల్ఘాట్, నాగపూర్, ఔరంగాబాద్ జిల్లాల అధికారులతో కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్దన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాలను అనుసంధానం చేశారు.
ఈ సందర్భంగా ఎన్.సి.డి.సి డైరక్టర్ డాక్టర్ ఎస్.కె. సింగ్ , మహారాష్ట్రలో కోవిడ్ -19 స్థితిగతులపై ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలు, మరణాల రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలు, కోవిడ్ ధృవీకరణ రేటు ,కోవిడ్ కేసులు రెట్టింపు కావడానికి పడుతున్న సమయం, తక్కువ టెస్టింగ్ రేటు వంటి అంశాలను ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు. మరణాల రేటు ఎక్కువగా ఉండడం, కొవిడ్ కేసుల ధృవీకరణ ఎక్కవగా ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలలో ఆరోగ్య మౌలిక సదుపాయాల అందుబాటు, కోవిడ్ ధృవీకరణ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలపట్ల మరింత ఎక్కువ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
మహారాష్ట్రలో కోవిడ్ -19కు సంబంధించిన ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్దన్, కంటైన్‌మెంట్ జోన్ల సంఖ్య పెరుగుదలపై వెంటనే దృష్టి పెట్టాలన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పరిస్థితి తీవ్రతకు సంబంధించిన అంచనాలు రూపొందించి , కోవిడ్ -19ను సమర్థంగా అదుపు చేసేందుకు అసరమైన వ్యూహాన్ని ఆచరణలో పెట్టాల్సిందిగా ఆయన అధికారులకు సూచించారు. ప్రతి పదిలక్షల మందిలో ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారన్న దానిని గమనించుకుంటూ , మరణాల రేటు పెరగడంపై దృష్టి పెట్టాలని అన్నారు.
ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల గురించి మాట్లాడుతూ డాక్టర్ హర్షవర్ధన్, ఐసియు, వెంటిలేటర్లు, పరీక్షా ప్రయోగకేంద్రాల వ్యవస్థలను బలోపేతం చేయడం పై సూచనలు చేశారు. అవసరమైన పేషెంట్లకు వెంటిలేటర్లు ఐ,సియు సదుపాయాలు అందుబాటులో ఉండేట్టు చూడాల్సిందిగా కోరారు. మానవ వనరుల అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఆయన, ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచాలని, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు ఆన్‌లైన్ శిక్షణ మాడ్యూళ్లు అండుబాటులో ఉంచాలని సూచించారు.
కోవిడ్-19 పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను ప్రయోగశాలలు సకాలంలో అందించేట్టు చూడాలని రాష్ట్ర అధికారులకు డాక్టర్ హర్షవర్ధన్ సూచించారు. ఇది సకాలంలో కోవిడ్ వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి, తగిన చికిత్సకు ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన,“ మనం కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని 602 ప్రభుత్వ ప్రయోగశాలలు, 235 ప్రైవేటు ల్యాబ్ ల ద్వారా( మొత్తం 837 ల్యాబ్ లద్వారా) గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు మనం 52, 13,140 శాంపిళ్ళను పరీక్షించాం. గడచిన 24 గంటలలో 1,51,808 శాంపిళ్ళను పరీక్షించాం” అని అన్నారు. ఇప్పటి వరకు 136 లక్షల ఎన్ 95 మాస్క్‌లను, 106 లక్షల పిపిఇలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర సంస్థలకు పంపిణీ చేసినట్టు కూడా డాక్టర్ హర్ష వర్ధన్ చెప్పారు. నాన్ కోవిడ్ ఆస్పత్రులలో పిపిఇలను హేతుబద్ధంగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా వాడాలని ఆయన సూచించారు.
కోవిడ్ -19 కాంటాక్టులను గుర్తించడానికి మానవ వనరులను బలోపేతం చేయాలని, అవసరమైన మౌలిక వసతులైన ఐసియు బెడ్లు, వెంటిలేటర్లు , ఆక్సిజెన్ సదుపాయం కలిగిన బెడ్లు సమకూర్చుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ హర్షవర్దన్ నొక్కి చెప్పారు. ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు రవాణా సదుపాయం, ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చే కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం (బిసిసి) , కమ్యూనిటీ రెసిస్టెన్స్ ని తగ్గించే కార్యకలాపాలు , రిస్క్ ఎక్కువగల కాంటాక్ట్‌లకు కౌన్సిలింగ్ చేపట్టాలన్నారు. దీనికి తోడు, వైరస్ కాంటాక్టులను పూర్తిగా గుర్తించడం, కంటైన్మెంట్ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయడం, ప్రధానంగా కోవిడ్ ప్రభావిత ప్రాంతాలనుంచి వచ్చే వారిని కచ్చితంగా క్వారంటైన్లో ఉంచి పరిశీలించడం వంటివి ఆయా జిల్లాలు చేపట్టాలని చెప్పారు.
ముఖ్యమైన ఆర్ ఎం ఎన్ సి హెచ్ ఎ + ఎన్ సేవలపై రాష్ట్రాలు దృష్టిపెట్టాలని, ప్రత్యేకించి గర్భిణులకు ఆరోగ్య సేవలు అందించడం, రక్త సేకరణ, రక్త మార్పిడి, కీమో థెరపి, డయాలసిస్ వంటి వాటి పై దృష్టిపెట్టాలని డాక్టర్ హర్ష వర్ధన్ సూచించారు.అత్యవసర సేవలైన టిబి చికిత్స, నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని, ఇలాంటి పేషెంట్లు ఎక్కువగా కోవిడ్ -19 బారిన పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. కోవిడ్ -19 కు సంబంధించి ఇంటింటికి సర్వే జరిపేటపుడు టిబి కేసుల విషయంలోనూ యాక్టివ్ సర్వే నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడంపైగల నిషేధాన్నికచ్చితంగా అమలయ్యేలా చూడాలని , వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కీటక జనిత వ్యాధులను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని కూడా డాక్టర్ హర్ష వర్దన్ అధికారులకు సూచించారు.
ఇలాంటి సేవలు అందించడానికి రాష్ట్ర అధికారులు , మహారాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 3,775 ఆయుష్మాన్ భారత్ - హెల్త్, వెల్‌నెస్ కేంద్రాల నెట్ వర్క్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటివద్దకే సేవలు అందించడానికి వలంటీర్లను వినియోగించుకోవాలని, టెలి మెడిసిన్, టెలి కన్సల్టేషన్ (ఒపిడి) సేవలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. అవసరమైన అత్యవసర మందులను సరిపడా నిల్వలు ఉంచుకోవడంతోపాటు తాత్కాలిక ప్రాతిపదికపై నియమించుకున్న ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ప్రోత్సాహకాలు, జీతాలు సకాలంలో చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.“ కోవిడ్ -19 కు సంబంధించి మందులు కనిపెట్టేందుకు, వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. కోవిడ్ -19ను పూర్తిగా ఓడించేవరకు మనం అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు మనం ఒకరికొకరు మంచి పద్దతులు అనుసరించాలి. అన్ని జిల్లాలు, మునిసిపాలిటీల అధికారులు కేంద్ర , రాష్ట్రప్రభుత్వాల అధికారులతో పరస్పర సహకారంతో పనిచేయాలి” అని డాక్టర్ హర్షవర్దన్ ఈ సమావేశంలో సూచించారు.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in ., @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
(Release ID: 1631019)
Visitor Counter : 233