గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పాదచారులకు వినియోగ యోగ్యంగా మార్కెట్లు

మార్కెట్ల స్థలాలపై సంపూర్ణ ప్రణాళికకోసం కేంద్ర గృహనిర్మాణ, పట్టణవ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచన,
భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల అనంతరం సిఫార్సు.

వాహనాల రాకపోకలు లేకుండా కేవలం పాదచారులకే వినియోగ యోగ్యంగా ఉండేలా మార్కెట్ ప్రాంతాల ఏర్పాటు. 10లక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో ఈ మార్కెట్లకోసం 3 స్థలాలు,
10లక్షల జనాభా కలిగిన నగరాల్లో కనీసం ఒక స్థలం ఎంపిక చేయాలని ఆదేశం

Posted On: 10 JUN 2020 1:20PM by PIB Hyderabad

  దేశంలోని పలు నగరాలు, మున్సిపల్ ప్రాంతాల్లో పాదచారులకు వినియోగ యోగ్యమైన మార్కెట్ల ఏర్పాటు కోసం తగిన స్థలాలను ఎంపిక చేయాలని, ఇందుకోసం సంపూర్ణ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. మార్కెట్లతో సంబంధం ఉండే భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల అనంతరం సిఫార్సు వెలువడింది. మేరకు అన్ని రాష్ట్రాలు, నగరాలు, నగర పాలక సంస్థలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ఒక అధికారిక సూచనను జారీ చేశారు. కేవలం పాదచారులకు వినియోగయోగ్యంగా ఉండే మార్కెట్ల కోసం పదిలక్షల జనాభా మించిన నగరాల్లో అయితే కనీసం మూడు స్థలాలను, పదిలక్షల జనాభా ఉండే నగరాల్లో, కనీసం ఒక స్థలాన్ని ఎంపిక చేయాలని ఇందులో సూచించారు.

పాదచారులకు వినియోగ యోగ్యమైన మార్కెట్ల స్థలాలకోసం కింది చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు.

 

1. మార్కెట్ ఉండవలసిన ప్రాంతాల ఎంపిక-

పదిలక్షల జనాభాకు మించిన నగరాల్లో కనీసం 3 మార్కెట్ స్థలాలు ఎంపిక చేసి, ఆ స్థలాలను పాదచారులకు మాత్రమే వినియోగమైనవిగా నోటిఫై చేయాలి. పది లక్షల జనాభా నగరాల్లో కనీసం ఒక స్థలాన్ని ఇందుకోసం ఎంపిక చేయాలి.

 

 2.సంపూర్ణ ప్రణాళిక- మార్కెట్ల ఏర్పాటుతో సంబంధం ఉన్న భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపులు జరపడం ద్వారా పాదచారుల మార్కెట్లపై ప్రణాళికను రూపొందించవలసి ఉంటుంది. విక్రయదార్లు, మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, పార్కింగ్ ప్రాంతాల యజమానులు, దుకాణ యజమానులు, వినియోగదార్లతో ఇందుకు సంప్రదింపులు జరపాలి. ప్రస్తుతం వివిధ వర్గాల వినియోగంలో ఉన్న ఎంపిక చేసిన స్థలాన్ని సక్రమంగా సర్వే చేయాల్సి ఉంటుంది. మార్కెట్ కు వచ్చేవారు భౌతిక దూరం పాటించేందుకు అనుగుణంగా, కాలిబాటలు ఉండేలా మార్గదర్శక ప్రణాళికను  తయారు చేయాల్సి ఉంటుంది. సదరు స్థలంలో ఏవైనా చెట్లు, ఇతర పచ్చని ప్రాంతాలు ఉంటే వాటిని కాపాడుతూ బాటలు వేయాలి.  విక్రేతలకు, వ్యర్థాల సేకరణకు, మరుగుదొడ్లకు తగిన సదుపాయం కల్పించాలి. మార్కెట్ స్థలం పరిసరాల్లో ప్రజలు పరస్పరం మాట్లాడుకునేందుకు తగిన స్థలం ఉండేలా ప్రణాళిక రూపొందించాలి.

 

3.    ఒకసారి ప్రణాళిక రూపొందించిన తర్వాత, ఆ ప్రణాళికను ప్రారంభించి, రెండు దశల్లో అమలు చేయవచ్చు. స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ప్రాతిపదికన ప్రణాళికను అమలు చేయవచ్చు.

               

4.   స్వల్పకాలిక సిఫార్సులు...

లాక్ డౌన్ నిబంధనలు ముగిసిన అనంతరం జనానికి భద్రత కల్పించేలా మార్కెట్లలో  ఏర్పాట్లు ఉండాలి. సత్వరం, తాత్కాలికంగా, ఏర్పాటు చేయడానికి వీలుగా సులభశైలిలో ఉండాలి. బారికేడ్లు, వాహనాలకోసం రోడ్లు మూసివేయడం వంటి ఏర్పాట్లతో మార్కెట్ స్థలాల్లో ఎప్పటికప్పుడు అసరమైన మార్పులు చేయవచ్చు.

 

5.   మార్కెట్ వద్ద పార్కింగ్ స్థలాన్ని, వాహనాలు రాకపోకలు జరిపే దారిని కూడా కాలిబాటలకోసం, జనం వేచిఉండే ప్రాంతాల కోసం మార్చుకోవచ్చు.    

 

6.    నగరాల పరిపాలనా యంత్రాంగాలు అదనపు వీధులతో మార్కెట్ స్థలాలకు అనుసంధానాన్ని మెరుగుపరచవచ్చు.

 

7.    మార్కెట్ల స్థలాల్లో సైక్లిస్టులను వారికే కేటాయించిన స్థలాల వరకు అనుమతించవచ్చు

 

 8.    మార్కెట్ స్థలం పరిసరాల్లో నివసించే వారి మోటారు వాహనాలకు తగిన స్థలాన్ని స్పష్టంగా సూచించాలి. అందుకు తగిన మార్కింగ్ ఉండాలి.

 

9.    మార్కెట్ కు దారితీసే కాలిబాటల వెడల్పును అవసరమైతే మున్సిపల్ యంత్రాంగాలు పెంచుకోవచ్చు.   

 

10.  మార్కెట్ ప్రాంతంలో పౌరులు సానుకూలంగా, సౌకర్యంగా తిరగడానికి వీలుగా తగినన్ని ఏర్పాట్లు చేయాలి.

 

11.   మార్కెట్లో  విక్రేతల స్థలం సృజనాత్మక ఏర్పాట్లకు అవకాశం ఇచ్చేలా ఉండాలి.

 

12.   మార్కెట్ స్థలాల్లో తాత్కాలిక ప్రాతిపదికన చేసిన ఏర్పాట్లు వినియోగ యోగ్యంగా ఉన్నాయని తేలిన తర్వాత, దీర్ఘకాలిక ప్రాతిపదికన శాశ్వత నిర్మాణాలను కూడా చేపట్టవచ్చు. 

కాలవ్యవధి

          పాదచారులకే వినియోగ యోగ్యమైన మార్కెట్ల స్థలాల ఎంపిక 2020 జూన్ నెల 30వ తేదీ లోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. భాగస్వామ్య వర్గాలతో సంప్రదింపుల ద్వారా మార్కెట్ స్థలాలపై సంపూర్ణ ప్రణాళిక రూపకల్పన  ప్రక్రియను వచ్చే 3నెలల్లో,... అంటే సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయవచ్చు. మార్కెట్ కు సంబంధించిన విక్రేతలు, ఇతర వినియోగదారులకు సంబంధించిన సర్వేని ఏడాది జూలై నెలాఖరులోగా ముగించాల్సి ఉంటుంది. అంటే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరికల్లా ప్రణాళిక ఖరారై, అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. తాత్కాలికంగా బారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ ఏర్పాట్లలో భాగంగా రోడ్లను మూసివేయడం, వివిధ ప్రయోజనాలకోసం స్థలాన్ని కేటాయించడం తదితర పనులు ఏడాది అక్టోబర్ నెల తొలి వారంలో మొదలు కావాలి. స్వల్పకాలిక చర్యలతో ప్రణాళిక అమలు అంచనా, అవసరమైన సవరణలు ఏడాది నవంబర్ నెలకల్లా పూర్తి కావాలి. 

      లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలన్నీ సడలిపోయి, సురక్షితమైన, భౌతిక దూరంతో కూడిన, రవాణా పద్ధతులకోసం నగరాలన్నీ ఎదురుచూస్తున్న తరుణంలో పాదచారులకు, సైక్లిస్టులకు వినియోగయోగ్యమైన మార్కెట్ స్థలాలకు ఎక్కువ ప్రాధాన్యం ఏర్పడబోతోంది. కోవిడ్ వైరస్ మహమ్మారి అనుభవం కారణంగా భారతదేశంలోని నగరాల్లో మార్కెట్ ప్రాంతాల స్వరూపాన్ని కొత్తగా రూపొందించవలసిన అవసరం ఏర్పడింది. పాదచారులకే వినియోగ యోగ్యంగా మార్కెట్లను తయారు చేయాల్సి ఉంది.

   ప్రస్తుత పరిస్థితుల్లో పదిలక్షలకు మించిన జనాభా ఉన్న నగరాల్లో గాలి నాణ్యను మెరుగుపరిచేందుకు కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. బస్సులు, మెట్రో రైళ్ల ద్వారా ప్రజా రవాణాను ప్రోత్సహించాలని సంకల్పించింది. అలాగే, సైకిల్ ట్రాకులను, పాదచారుల మార్కెట్ స్థలాలను ఏర్పాటు చేయాలని కూడా సంకల్పించింది.

        అసలు కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలపై విరుచుకుపడటానికి ముందే, చెన్నై, పుణె, బెంగుళూరు వంటి కొన్ని భారతీయ నగరాలు ప్రజాహితమైన నగరాలుగా రూపుదిద్దుకోవడం మొదలైంది.  గత ఐదేళ్ల కాలంలో చెన్నై నగరంలో వంద కిలోమీటర్లకు పైగా నిడివిగల వీధులు పాదచారుల హితమైన రహదారులుగా రూపుదిద్దుకున్నాయి. నగరం నడిబొడ్డున పాదచారులకే పరిమితమైన పెడెస్ట్రెయిన్ ప్లాజా ఏర్పాటైంది. మెగా స్ట్రీట్స్ పథకం ద్వారా చెన్నై నగరం ఏడాది తన ప్రయత్నాలను నాలుగు రెట్లు పెంచింది. మెగాస్ట్రీట్స్ కార్యక్రమంలో భాగంగా ‘సంపూర్ణ వీధులనుచెన్నై నగరం ఏర్పాటు చేస్తోంది. పాదచారులకు, సైక్లిస్టులకు వీధుల్లో ప్రాధాన్యం ఇస్తోంది. చెన్నై నగర పాలక యంత్రాంగం చేపట్టిన చర్యలతో స్ఫూర్తిని పొందిన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని పది నగరాలకు పథకాన్ని విస్తరించడానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయంచింది. ఇక.. దేశంలో సైక్లింగ్ కోసం ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించిన తొలి నగరంగా పుణె పేరు సంపాదించింది. సైకిళ్లకు వినియోగానికి యోగ్యంగా 400కిలోమీటర్ల వీధులను పుణె రూపొందిస్తోంది. సైక్లింగ్ షేరింగ్ వ్యవస్థను మరిన్ని భారతీయ నగరాలు కూడా ప్రారంభిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల్లో మేయర్లు, కమిషనర్లు, స్మార్ట్ సిటీల యంత్రాంగాలు, పౌర సమాజ సంఘాలు సైక్లింగ్ ను విరివిగా ప్రోత్సహిస్తున్నాయి. సైక్లింగ్ ద్వారా రవాణా అవసరాలు తీర్చుకోవడానికి భారతీయ నగరాలకు ఇదే ఒక స్వర్ణావకాశంగా కనిపిస్తోంది.



(Release ID: 1630709) Visitor Counter : 253