పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
దేశంలో గత 8 ఏళ్లలో పులుల మృతిపై వివరణ
దేశంలో గత 8 ఏళ్లలో పులుల మృతిపై వివరణ
Posted On:
06 JUN 2020 4:59PM by PIB Hyderabad
దేశంలో పులుల మరణాలను సంచలనాత్మకం చేయటానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించినట్టు వెలుగులోకి వచ్చింది. పులుల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల మీద దుష్ప్రచారం చేస్తూ, వాస్తవదూరాలతో తప్పుదారి పట్టిస్తూ ఈ విషయాన్ని సంచలనాత్మకం చేసి అందిస్తున్నాయి.
పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖకు చెందిన చట్టబద్ధమైన సంస్థ జాతీయ పులుల సంరక్షణా సంస్థ (ఎన్ టి సి ఎ) ఈ విషయాలు చెప్పదలచుకుంది:
జాతీయ పులుల సంరక్షణా సంస్థ ద్వారా భారత ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా పులులు కనుమరుగయ్యే దశనుంచి గణనీయంగా సంరక్షణ జరుగుతోంది. 2006,2010,2014, 2018 లలో ప్రతి నాలుగేళ్ళకొకసారి జరిగే అఖిల భారత పులుల లెక్కింపు అంచనా ఇందుకు సాక్ష్యం. ఏటా పులుల సంఖ్య ఆరోగ్యకరమైన రీతిలో 6% చొప్పున పెరుగుతున్నట్టు ఈ ఫలితాలు చూపుతున్నాయి. సహజ మరణాలు కూడా తీసివేసిన తరువాత లెక్కలివి. వాటి నివాసయోగ్యమైన స్థలాన్ని కూడా తగినంతగా అందుబాటులో ఉంచుతున్నారు. 2012 - 2019 మధ్య కాలాన్ని గమనిస్తే దేశంలో పులుల సగటు మరణాల సంఖ్య 94 గా నమోదైంది. ఏటా కొత్తవాటితో పోల్చుకుంటే ఇది తగిన ఎదుగుదలకు చిహ్నమే. పైగా, జాతీయ పులుల సంరక్షణా సంస్థ ప్రాజెక్ట్ టైగర్ కింద అనేక పథకాలను వర్తింపజేస్తూ వస్తోంది. పులుల వేటను గణనీయంగా నియంత్రిస్తూ ఉంది.
జాతీయ పులుల సంరక్షణా సంస్థ పారదర్శకతలో అత్యంత ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ పులుల మరణాల గణాంకాలను వెబ్ సైట్ ద్వారా పౌరులకు అందుబాటులో ఉంచుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా www.tigernet.nic.in అనే పోర్టల్ ను కూడా నిర్వహిస్తోంది. దీని ఆధారంగా ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చే వీలుంది. ఎనిమిదేళ్ళ కాలపు సమాచారాన్ని అందుబాటులో ఉంచటం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సమయంలో తప్పుదారి పట్టించే వార్తలు వెలువరించి ప్రజలను అనుమానాలకు గురిచేయటం తగదు. పూర్తి సంఖ్య అందుబాటులో లేనంతమాత్రాన వాటిని వేటాడి చంపినట్టు నిర్థారణకు రావటం కూడా మంచిది కాదు.
ప్రామాణిక నిర్వహణా విధానాల ద్వారా పులి చావుకు కారణాలు కనుక్కునే పద్ధతి పాటించటం కూడా జాతీయ పులుల సంరక్షణా సంస్థ విధి విధానాలలో ఒకటి. అసహజమైన పద్ధతులలో చనిపోయినప్పుడు శవ పరీక్షలు, ఫోరెన్సిక్ నివేదికలు తెప్పించుకోవటం, ఫొటోలు, అక్కడి పరిస్థితుల ఆధారంగా నిర్థారించటం లాంటి శాస్త్రీయ పద్ధతులు పాటించటం పరిపాటి. అలా ఈ డాక్యుమెంట్లు అన్నీ వివరంగా విశ్లేషించిన తరువాతనే పులి చావుకు కారణాన్ని నిర్థారిస్తారు.
ఈ వార్తల కోసం జాతీయ పులుల సంరక్షణా సంస్థ వెబ్ సైట్ లోని సమాచారాన్ని, ఆర్ టి ఐ సమాధానాలను వాడుకోవటం హర్షించదగ్గ విషయం. అయితే, వాటిని అందించిన తీరుమాత్రం కలవరం కలిగిస్తోంది. పులి మరణం విషయంలో వ్యవహరించే తీరును, మొత్తం ప్రక్రియను లెక్కలోకి తీసుకోకపోవటం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వారి ప్రాజెక్ట్ టైగర్ కింద తీసుకుంటున్న ఆర్థిక పరమైన, సాంకేతికపరమైన చర్యల ఫలితంగా సహజ పద్ధతులలో పులులు పెరగటం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో మీడియా ఈ వాస్తవాలన్నిటినీ దేశ ప్రజలకు తెలియజేస్తుందని ఆశిస్తున్నాం. సంచలనాత్మకం చేయాల్సిన అవసరమేమీ లేని విషయంలో ప్రజలు తాము కంగారుపడనక్కరలేదని తెలుసుకోవటమే లక్ష్యం కావాలని కోరుకుంటున్నాం.
***
(Release ID: 1629976)
Visitor Counter : 329