రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

హైవేలపై ప్రాణనష్టాన్ని అడ్డుకునే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ నితిన్‌ గడ్కరీ

దేశవ్యాప్తంగా రోడ్లపై 5 వేల బ్లాక్‌ స్పాట్‌లు గుర్తింపు
రహదారులపై జంతువుల ప్రాణాలు కాపాడటంపైనా దృష్టి
మరణాల నిరోధంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన మంత్రి

Posted On: 05 JUN 2020 3:35PM by PIB Hyderabad


    రహదారి ప్రమాదాల్లో మరణాల తగ్గింపు లేదా నిరోధంపై ప్రజల్లో పెద్దస్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కేంద్ర రహదారి రవాణా, హైవే శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. జీవావరణం, మనుగడ అనేవి మనుషుల జీవితాల్లో అతి ముఖ్యమైనవన్నారు. హైవేలపై మనుషులు, జంతువుల మరణాలను అరికట్టే జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. నీతి, ఆర్థిక వ్యవస్థ, జీవావరణం మన దేశంలో మూడు ముఖ్యమైన స్తంభాలన్నారు.

    మన దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి, 20-25 శాతం మరణాలను తగ్గించేలా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రోడ్లపై 5 వేల బ్లాక్‌ స్పాట్‌లు (ప్రమాద నిలయాలు) గుర్తించామని, లోపాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా చక్కదిద్దేలా అత్యవసర చర్యలు చేపట్టామన్నారు. ఇందుకు సంబంధించిన ప్రామాణిక మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. ఇప్పటివరకు, కొత్తగా గుర్తించిన 1739 బ్లాక్‌ స్పాట్లలో తాత్కాలిక చర్యలు, 840 చోట్ల శాశ్వత చర్యలు చేపట్టామన్నారు.

    బ్లాక్‌ స్పాట్లలో లోపాల సవరణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, క్రాష్‌ బారియర్లు, మరమ్మతులు, శిథిల, ఇరుకైన వంతెనల పునర్నిర్మాణం, రహదారి భద్రత మదింపు, ప్రమాదాలకు అవకాశమున్న రోడ్లపై మరణాల తగ్గింపు, హైవేలపై గస్తీ, రోడ్ల నిర్మాణ సమయంలో భద్రత చర్యలు వంటి వాటిపై దృష్టి పెట్టడం ద్వారా జాతీయ రహదారుల విస్తరణ చర్యలు చేపట్టినట్లు మంత్రి వివరించారు.

    రహదారులపై జంతువుల ప్రాణాలు కాపాడటం కూడా తమ శాఖ దృష్టిలో ఉందని గడ్కరీ అన్నారు. వన్యప్రాణులకు హాని కలగకుండా రహదారులు లేదా ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు "వన్యప్రాణులపై మౌలిక సదుపాయాల ప్రభావాలను తగ్గించడానికి పర్యావరణహిత చర్యలు" పేరిట భారత వన్యప్రాణుల సంస్థ విడుదల చేసిన మాన్యువల్‌లోని నిబంధనలు పాటించాలని అన్ని సంస్థలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. రోడ్లపై జంతువుల ప్రాణాలకు ముప్పు తెచ్చే బ్లాక్‌ స్పాట్లను గుర్తించి తమ శాఖకు చెప్పాలని స్వచ్ఛంద సంస్థలకు మంత్రి సూచించారు. అక్కడి లోపాలను సరిదిద్ధుతామన్నారు.

    జంతువులు ఉపయోగించునే అనుకూల మౌలిక సదుపాయల కల్పనకు హైవేల మంత్రిత్వ శాఖ, దానికి చెందిన సంస్థలు భారీ మొత్తాల్లో ఖర్చు చేస్తున్నాయని మంత్రి గడ్కరీ తెలిపారు. నాగ్‌పూర్‌-జబల్‌పూర్‌ జాతీయ రహదారిని ఇందుకు ఉదాహరణగా చెప్పారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా పులులు సంచరించేలా, రూ.1300 కోట్ల ఖర్చుతో అక్కడ వయాడక్ట్‌ నిర్మించామన్నారు. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశాలోనూ ఇలాంటి ఏర్పాట్లే చేస్తున్నట్లు వెల్లడించారు. వన్యప్రాణుల సంచారానికి అనుకూలమైన రోడ్ల నిర్మాణంపై అధ్యయనం, అండర్‌పాస్‌ల నిర్మాణం, ఎలివేటెడ్‌ కారిడార్లు మొదలైన వాటిని కూడా చేపడుతున్నామన్నారు.

    వన్యప్రాణులు తిరుగాడే ప్రదేశాల్లోకి చొచ్చుకుపోకుండా ఎలివేటెడ్‌ రహదారులు, అండర్‌పాస్‌లు, ఓవర్‌పాస్‌ల నిర్మాణాలను తమ మంత్రిత్వ శాఖ ఎల్లప్పుడూ సూచిస్తుందని గడ్కరీ స్పష్టం చేశారు. రోడ్ల నిర్మాణ సమయంలో చెట్ల నరికివేతకు పరిహారంగా చేపట్టాల్సిన పథకాలకు లోబడి ఉంటామన్నారు. ఐఆర్‌సీ కౌన్సిల్‌ ఆమోదించిన పర్యావరణహిత రేటింగ్‌ వ్యవస్థ ప్రకారమే కొత్తగా రోడ్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.



(Release ID: 1629697) Visitor Counter : 223