జల శక్తి మంత్రిత్వ శాఖ

అన్ని గ్రామీణ ప్రాంతాలకు కొళాయి కనెక్షన్లు ఇచ్చేలా పుదుచ్చేరి ప్రణాళిక

ఈ ఆర్ధిక సంవత్సరంలోనే లక్ష్యాన్ని సాధించేలా కార్యాచరణ
సంప్రదాయ జలాల సంరక్షణతోపాటు వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం పైనా దృష్టి
ఇంటింటికీ నీరు కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించనున్న గ్రామ సంఘాలు

Posted On: 03 JUN 2020 4:20PM by PIB Hyderabad

2020-21 సంవత్సరానికి పుదుచ్చేరి వార్షిక కార్యాచరణ ప్రణాళికకు 'జాతీయ జల్‌ జీవన్‌ మిషన్‌' ఆమోదముద్ర వేసింది. కేంద్ర పాలిత ప్రాంతంలోని కొళాయి కనెక్షన్‌ లేని అన్ని ఇళ్లకు ఈ ఆర్థిక సంవత్సరంలోనే కొళాయి కనెక్షన్లు ఇవ్వాలని పుదుచ్చేరి ప్రణాళిక సిద్ధం చేసింది. కొవిడ్‌-19 సమయంలోనూ ఇంటింటికీ కొళాయి నీరు దిశగా గ్రామస్థాయి ప్రణాళికలు జోరుగా సాగుతున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. దీర్ఘకాలిక స్థిర ప్రయోజనం ఉండేలా.., గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణలో గ్రామ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. గ్రామాల్లో నిరంతరం నీటి సరఫరా జరిపే బాధ్యత తీసుకునేలా గ్రామ సంఘాలను ప్రోత్సహిస్తారు. సంప్రదాయ జల వనరుల పునరుద్ధరణే కాక, వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం పైనా దృష్టి పెడతారు.

    జల్‌ జీవన్‌ మిషన్‌ కింద, నీటి నాణ్యత పరీక్ష కేంద్రాలను వివిధ స్థాయుల్లో ఏర్పాటు చేశారు. నీటి నాణ్యతపై గ్రామ సంఘాలు నిఘా పెడతాయి. నీటి నాణ్యత పరీక్ష కిట్ల సేకరణ, గ్రామ సంఘాలకు కిట్ల పంపిణీ, ప్రతి గ్రామం నుంచి కనీసం ఐదుగురు మహిళల గుర్తింపు, కిట్లను ఉపయోగించడంలో మహిళలకు శిక్షణ వంటి కార్యక్రమాలను కలిగివుండేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల గ్రామస్థాయిలోనే నీటి నాణ్యత పరీక్షలు చేయవచ్చు.

    గ్రామీణ ప్రాంతాలకు 24 గంటలూ నీటిని సరఫరా చేయాలని పుదుచ్చేరికి జల్‌ జీవన్‌ మిషన్‌ సూచించింది. దీనివల్ల గ్రామాలు సేవలు అందించడంపై దృష్టి పెడతాయని చెప్పింది. గ్రామాల్లో నీటి సరఫరాను పర్యవేక్షించేందుకు ఐవోటీ ఆధారిత సెన్సర్లు ఇవ్వాలని కూడా యోచిస్తున్నారు.    

    కొవిడ్‌-19 కారణంగా నగరాల్లో పనులు కరవై స్వగ్రామాలకు తిరిగి వస్తున్న వలస కార్మికులకు నీటి సరఫరా సంబంధిత ఉపాధి కల్పించడం ఇప్పుడు అత్యవసరంగా మారింది. ముఖ్యంగా భూగర్భ నీటిమట్టాన్ని పెంచే జల సంరక్షణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇది నీటి భద్రత కల్పించడంతోపాటు, వ్యవసాయానికి నీటిని అందుబాటులోకి తెస్తుంది. మరీ ముఖ్యంగా ప్రతి గ్రామీణ గృహానికి తాగునీటిని అందిస్తుంది.

    జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా, దేశ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్‌ ద్వారా సరిపడినంత నీటిని అందించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రతిరోజు నాణ్యమైన నీటిని అందించేలా, దీర్ఘకాలం పాటు ఇది సాగేలా ప్రయత్నిస్తోంది. గ్రామీణ ప్రజల జీవన సౌలభ్యాన్ని, జీవన స్థాయిని పెంచేలా ఇంటి ఆవరణలోకే తాగునీటిని అందించాలన్నది జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యం.

    గతేడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ చేసిన ప్రసంగం నేపథ్యంలో.. 2024 కల్లా దేశ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా నీటిని అందించాలని జల్‌ జీవన్‌ మిషన్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్‌ ద్వారా, అన్ని గ్రామీణ గృహాలు తాగునీటిని సురక్షితంగా పొందే వీలవుతుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమానికి 3.6 లక్షల కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. నీటి కొరత, జల కాలుష్యం ఉన్న ప్రాంతాలు, ఆసక్తిగల జిల్లాలు, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలు, సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించడంలో ప్రాధాన్యత ఇస్తారు.



(Release ID: 1629061) Visitor Counter : 201