హోం మంత్రిత్వ శాఖ

పెను తుఫాను ‘నిసర్గ ’ కోసం సంసిద్ధతను పర్యవేక్షించడానికి తిరిగి సమావేశమైన - ఎన్.‌సి.ఎం.సి.

Posted On: 02 JUN 2020 6:26PM by PIB Hyderabad

పెను తుఫాను “నిసర్గ” ను ఎదుర్కోవటానికి రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీల సంసిద్ధతను సమీక్షించడానికి జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్.‌సి.ఎం.సి) రెండవ సమావేశానికి కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా అధ్యక్షత వహించారు.

తీవ్రమైన పెను తుఫాను జూన్ 3వ తేదీ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మహారాష్ట్ర తీరాన్ని ప్రభావితం చేస్తుందని భారత వాతావరణ శాఖ (ఐ.ఎం.డి.) పేర్కొంది.  రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షపాతంతో పాటు, సముద్రంలో అలలు 1-2 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతూ, గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.  గంటకు 120 కిలోమీటర్ల వరకు పెనుగాలులు వీచే అవకాశం కూడా ఉంది. 

ఈ తుఫాను మహారాష్ట్రలోని రాయ్‌గడ్, ముంబై, థానే, పాల్ఘర్ తీరప్రాంత జిల్లాలతో పాటు, గుజరాత్ లోని వల్సాద్, నవసరి, సూరత్, భావ్‌నగర్, భురూచ్ జిల్లాలు మరియు డామన్, దాద్రా, నగర్ హవేలీలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

వారు తీసుకున్న సన్నాహక చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు ఎన్.‌సి.ఎం.సి. కి వివరించారు. అవసరమైన సామాగ్రి తగినంత స్టాక్ తమ వద్ద ఉందని, అన్ని అత్యవసర సేవలు సంసిద్ధతలో ఉన్నాయని వారు హామీ ఇచ్చారు. టెలికాం విభాగం అందించిన బల్క్ ఎస్.ఎమ్.ఎస్. సౌకర్యం తుఫాను వల్ల ప్రభావితమయ్యే నివాసితులను హెచ్చరించడానికి ఉపయోగించబడుతోంది. ప్రజలను తరలించడం కూడా జరుగుతోంది.

ఎన్.డి.ఆర్.ఎఫ్. కు చెందిన 40 బృందాలను, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మోహరించడం జరిగింది. అదనపు బృందాలను కూడా  విమానంలో తరలించారు.  సైనిక, నావికాదళాలకు చెందిన రక్షణ, సహాయ బృందాలతో పాటు నావిక, వైమానిక దళాలకు చెందిన నౌకలు, విమానాలను కూడా సిద్ధంగా ఉంచారు. తీర గస్తీ దళానికి చెందిన ఓడలు ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడంలో నిమగ్నమై ఉన్నాయి.

రాష్ట్రాలు, మరియు కేంద్ర సంస్థల సంసిద్ధతను సమీక్షించిన క్యాబినెట్ కార్యదర్శి, తుఫాను మార్గంలో లోతట్టు ప్రాంతాల నుండి ప్రజలను ఖాళీ చేయడాన్ని మరియు సముద్రం నుండి మత్స్యకారులందరినీ తిరిగి వచ్చేలా చూడడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్-19 రోగులకు అవసరమైన వైద్య సేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రయత్నాలు చేయవచ్చు. విద్యుత్, టెలికమ్యూనికేషన్, న్యూక్లియర్, రసాయన, విమానయాన, నౌకా రవాణా రంగాలకు చెందిన మౌలిక సదుపాయాలు, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి ఆకస్మిక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించారు.

మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల అదనపు ప్రధాన కార్యదర్శులు,  దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ నిర్వాహకుని సలహాదారుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దేశీయ వ్యవహారాలూ, నౌకా రవాణా, విద్యుత్తు, రైల్వేలు, టెలీ-కమ్యూనికేషన్లు, పెట్రోలియం, సహజ వాయువు, అణుశక్తి, రసాయనాలు, పెట్రో రసాయనాలు, పౌర విమానయాన, ఆరోగ్యం, ఐ.ఎం.డి., ఐ.డి.ఎస్., ఎన్.డి.ఎమ్.ఏ., ఎన్.డి.ఆర్.ఎఫ్. మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుగా ఎన్.సి.ఎం.సి.  తిరిగి సమావేశం కానుంది. 

<><><> 



(Release ID: 1628834) Visitor Counter : 161