హోం మంత్రిత్వ శాఖ
అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫానును ఎదుర్కోనేందుకు సంసిద్ధతపై హోమ్ మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశం
- ఎన్‌డీఎంఏ, ఐఎండీ, భారత తీర గస్తీ దళం అధికారులతో సమావేశం
- గుజరాత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో పాటు డయ్యూ అండ్ డామన్ పరిపాలనాధికారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన హోమ్ మంత్రి
- రాబోయే తుఫాను దృష్ట్యా కేంద్రం తగిన సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చిన హోం శాఖ మంత్రి అమిత్ షా
Posted On:
01 JUN 2020 8:23PM by PIB Hyderabad
అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న తుఫానును ఎదుర్కొనేందుకు సంసిద్ధతపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎన్‌డీఎంఏ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఐఎమ్‌డీ మరియు భారత తీరగస్తీ దళం అధికారులు ఈ ఉన్నత సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ తుఫాను మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటుగా డయ్యూ అండ్ డామన్‌లోని కొన్ని ప్రాంతాలను తాకే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తుఫానుగా మారనున్న వాయుగుండం..
భారత వాతావరణ శాఖ ఆగ్నేయ మరియు దాని ప్రక్కనే ఉన్న తూర్పు- మధ్య అరేబియా సముద్రం & లక్షద్వీప్ ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం కాస్త వాయుగుండంగా కేంద్రీకృతమైందని, రాబోయే 12 గంటల వ్యవధిలో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఆ తరువాత 24 గంటలలో తూర్పుమధ్య అరేబియా సముద్రంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది.
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్..
తుఫాను ఏర్పడుతున్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, దాద్రా నగర్ హవేలీ మరియు డయ్యూ డామన్‌ల పరిపాలనాధికారి శ్రీ ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు. రానున్న తుఫాను దృష్ట్యా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అన్ని విధాల సహాయం చేస్తుందని శ్రీ అమిత్ షా హామీ ఇచ్చారు. రానున్న పరిస్థితిని ఎదుర్కోవడానికి గాను అవసరమైన సాయం మరియు వనరులను గురించి వివరంగా కేంద్రానికి తెలియజేయాలని ఆయన వారిని కోరారు.
ఎన్‌డీఆర్ఎఫ్ దళాల మొహరింపు..
ఇదే సమయంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎన్‌డీఆర్ఎఫ్ ఇప్పటికే గుజరాత్‌లో 13 దళాలను మొహరించారు. మరో రెండు దళాలను రిజర్వు చేసి ఉంచారు. మరోవైపు మహారాష్ట్రలో 16 దళాల్ని మొహరించారు. 7 దళాల్ని రిజర్వు చేసి ఉంచారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీలలో ఒక్కొక్క దళాల్ని మొహరించారు. ఆయా రాష్ట్రాలలోని లోతట్టు తీర ప్రాంతాల నుండి ప్రజలను తరలించడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్‌డీఆర్ఎఫ్ దళాలు తగిన సహాయం అందిస్తున్నాయి.
(Release ID: 1628540)
Visitor Counter : 217