ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

డిజిటల్ ఇండియా కార్యకలాపాల విజయవంతంపై కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ ప్రశంస

పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆశాజనకమని వెల్లడి
ఇతర దేశాలకు భారత్‌ మార్గదర్శిగా మారిందని అభినందన

Posted On: 24 MAY 2020 4:31PM by PIB Hyderabad
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావడంపై కామన్వెల్త్‌ సెక్రటరీ జనరల్‌ ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రశంసించారు. కామన్వెల్త్‌లోని అభివృద్ధి చెందుతున్న, ఔత్సాహిక దేశాలకు ఇది ఆశాజనక అడుగుగా ఆమె పేర్కొన్నారు. 

	ఇటీవల, ఓ ప్రైవేటు వార్తా ఛానల్‌లో ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను చేరుకోవడంలో భారత్‌ చేసిన ప్రయత్నాలను ఆమె ప్రస్తావించారు. సరికొత్త ఆవిష్కరణలు, అవకాశాలతో, ప్రజలు ఆర్థికంగా భరించగలిగిన డిజిటల్‌ సేవలను అందించిన విధానాన్ని ప్రశంసించారు. "పేద, చిన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలను గమనిస్తుంటాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పాటిస్తున్న విధానాలను తమ దేశాల్లో పాటించినా, అలాంటివి వృద్ధి చేసినా చాలా ఖర్చవుతుందని భయపడుతుంటాయి. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఆ దేశాన్ని గమనిస్తే, ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులో ఉండేలా, సాధ్యమైన వ్యయంలోనే కొత్త విధానాలను తీసుకురావచ్చని నిరూపితమైంది. ఇది ఆశాజనకం" అని ఆమె చెప్పారు.

	జనవరి 2020లో తన భారతదేశ పర్యటన; కేంద్ర మంత్రులు, సాంకేతిక నిపుణులతో జరిగిన సమావేశాల గురించి కూడా ప్యాట్రిసియా స్కాట్లాండ్ ప్రస్తావించారు. చిన్న, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయడంపై భారతదేశం దృష్టి సారించినట్లు తనకు అర్ధమైందని ఆమె చెప్పారు. దానిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు.

	డిజిటల్‌ ఇండియా విజయవంతంలో పాలుపంచుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రి శ్రీ రవిశంకర్‌ ప్రసాద్‌ను ప్యాట్రిసియా స్కాట్లాండ్‌ ప్రశసించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముందుండి నడిపించారని, కామన్వెల్త్ కుటుంబంలోని ఇతర సభ్యుల్లోనూ ఉత్తేజం నింపారని పేర్కొన్నారు.


(Release ID: 1626624) Visitor Counter : 264