విద్యుత్తు మంత్రిత్వ శాఖ
అంఫన్ తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధమైన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ
ప్రధాన నియంత్రణ కేంద్రాలుగా ఎన్‌ఎల్‌డీసీ, ఈఆర్‌ఎల్‌డీసీ
కీలక ప్రదేశాల్లో అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థలు, తగిన సిబ్బంది మోహరింపు
విద్యుత్ వ్యవస్థకు నష్టం వాటిల్లితే తక్షణం పునరుద్ధరించేలా ఏర్పాట్లు
Posted On:
19 MAY 2020 7:34PM by PIB Hyderabad
అంఫన్ పెను తుపాను బుధవారం మధ్యాహ్నం తీరం దాటుతుందని; పశ్చిమ బెంగాల్, ఒడిశాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అంచనాల నేపథ్యంలో... విపత్తును ఎదుర్కొనడానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది. విద్యుత్ సరఫరా పరిస్థితి సరిదిద్దడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. పెను తుపాను పరిస్థితిని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ సంస్థలు, జనరేటర్స్ &టాన్స్‌మిషన్ కంపెనీలు, గ్రిడ్ ఆపరేటర్లు, సామగ్రి సరఫరా కోసం తయారీసంస్థలు మొదలైన వారితో సమన్వయం చేసుకుంటోంది.
పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోసోకో) కు చెందిన జాతీయ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్‌ఎల్‌డీసీ), తూర్పు ప్రాంత లోడ్ డిస్పాడ్ సెంటర్ (ఈఆర్‌ఎల్‌డీసీ) ప్రధాన నియంత్రణ కేంద్రాలుగా వ్యవహరిస్తాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని విద్యుత్ విభాగాల నుంచి సీనియర్ స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. అత్యవసర పరిస్థితులకు తగ్గట్లుగా వీరు చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్‌టీపీసీ, పీజీసీఐఎల్, పోసోకో సంస్థలు పరిస్థితిని ఎదుర్కోవటానికి అవసరమైన అన్ని సన్నాహాలు చేశాయి. పెను తుపాను కారణంగా ఏర్పడిన నష్టాలను సమర్థవంతంగా పునరుద్ధరించడంలో రాష్ట్ర విద్యుత్ సంస్థలకు సహాయపడతాయి. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూములను భువనేశ్వర్, కోల్‌కతాలో పీజీసీఐఎల్, ఎన్‌టీపీసీ ఏర్పాటు చేశాయి. మనేసర్‌లోని తన హెడ్‌క్వార్టర్స్‌లో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమును పీజీసీఐఎల్ ఏర్పాటు చేసింది.
పెను తుపాను పరిస్థితిని, మార్గాన్ని జాతీయ పవర్ గ్రిడ్ ఆపరేటర్- పోసోకో నిశితంగా గమనిస్తోంది. అన్ని ఆర్‌ఎల్‌డీసీలకు ఎన్‌ఎల్‌డీసీ నుంచి 17.05.2020న ప్రాథమిక సూచనలు అందాయి. 18.05.2020న ఎన్‌ఎల్‌డీసీ నుంచి ఆర్‌ఎల్‌డీసీలు, సంబంధిత ట్రాన్స్‌మిషన్ లైసెన్స్‌దారులకు; పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్లకు (ఎస్‌ఎల్‌డీసీ) ఈఆర్‌ఎల్‌డీసీ ద్వారా సలహాలు జారీ చేశారు. అత్యవసర పునరుద్ధరణ వ్యవస్థలను (ఈఆర్‌ఎస్) (400 కేవీ కేంద్రాల వద్ద వద్ద 32, 765 కేవీ కేంద్రాల వద్ద 24), తగిన సిబ్బందిని కీలక ప్రదేశాల్లో మోహరించారు. విద్యుత్ టవర్లు కూలిపోయినా, లైన్లు ధ్వంసమైనా వీరు తక్షణ సేవలు అందిస్తారు. ట్రాన్స్‌మిషన్ పరికరాలు, డీజీ సెట్లు, ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్, ఎమర్జెన్సీ లైట్లు, ఇతర అవసరమైన సామగ్రి విడిభాగాలను కూడా సిద్ధంగా ఉంచారు.
పునరుద్ధరణ కార్యకలాపాల కోసం సిబ్బందితోపాటు వాహనాలను సిద్ధంగా ఉంచారు. మరికొందరు నైపుణ్య కార్మికులతో బృందాలను సిద్ధం చేస్తున్నారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కేబుళ్లు వంటి వివిధ వస్తువుల తయారీదారులను కూడా అవసరాన్ని బట్టి అత్యవసర ప్రాతిపదికన సామగ్రిని అందించాలని అప్రమత్తం చేశారు. రాష్ట్రాల్లోని విద్యుత్ లైన్లు, ఇతర విద్యుత్ మౌలిక సదుపాయాలు పెను తుపాను కారణంగా ధ్వంసమైతే, రాష్ట్ర విద్యుత్ సంస్థలకు అవసరమైన అన్ని రకాల సాయం అందేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది.
(Release ID: 1625213)
Visitor Counter : 215