విద్యుత్తు మంత్రిత్వ శాఖ
స్వయంసమృద్ధ భారత్ అభియాన్ కింద రూ. 90,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ఇస్తున్నట్లు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు తెలియజేసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ
ఈ సహాయాన్ని రూ. 45,000 కోట్ల చొప్పున రెండు విడతల్లో ఇస్తారు
డిస్కామ్ లు లాక్ డౌన్ సమయంలో తాము వాడుకోని విద్యుత్తుకు కూడా కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించవలసిన నిర్ణీత చార్జీల వసూలును వాయిదా వేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది; ఆ మొత్తాన్ని లాక్ డౌన్ తరువాత వడ్డీ లేకుండా మూడు వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది
లాక్ డౌన్ సమయంలో డిస్కామ్ లకు సరఫరా చేసిన విద్యుత్ (నిర్ణీత చార్జీలు)పై 20-25% రిబేటు ఇచ్చే విషయాన్ని పరిశీలించవలసిందిగా కూడా కేంద్ర విద్యుత్ ఉత్పత్తి / కేంద్ర విద్యుత్ సరఫరా కంపెనీలకు సూచించారు
ఆ విధంగా ఆదాచేసిన మొత్తాన్ని వినియోగదారులకు బదిలీ చేయవలసిందిగా డిస్కామ్ లను కోరారు
Posted On:
16 MAY 2020 6:53PM by PIB Hyderabad
ఈ కష్టకాలంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న డిస్కామ్ లకు సహాయం అందించడానికి రూ. 90,000 కోట్ల ఆర్ధిక ప్యాకేజీని అందజేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు 14-05-2020న సమాచారం తెలియజేసింది.
'ఈ విపత్కర సమయంలో అందజేస్తున్న ఈ ప్యాకేజీ జెన్కోలు / ట్రాన్సుకోలు సరఫరా చేసిన విద్యుత్తును పంపిణీ చేయడంలో డిస్కామ్ లపై పడిన భారాన్ని చాలావరకు తగ్గిస్తుంది' అని కేంద్ర విద్యుత్తు మరియు అక్షయ ఇంధన మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర) మంత్రి శ్రీ ఆర్. కె. సింగ్ అన్నారు.
స్వయంసమృద్ధ భారత్ అభియాన్ కింద విద్యుత్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పి ఎఫ్ సి) మరియు గ్రామీణ విద్యుత్ కార్పొరేషన్ (ఆర్ ఇ సి) ద్వారా రూ. 90,000 కోట్ల ద్రవ్యం విద్యుత్ రంగంలోకి పంపాలని భారత ప్రభుత్వం 13-05-2020న నిర్ణయించింది.
ఈ విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకొని అందజేసిన ప్యాకేజీ వల్ల ఆర్ ఇ సి మరియు పి ఎఫ్ సి సంస్థలు డిస్కామ్ లకు పదేళ్ల ప్రత్యేక దీర్ఘకాలిక పరివర్తన రుణాలను ఇస్తాయి.
ఉదయ్ యోజన కింద విధించిన నిర్వహణ పెట్టుబడి పరిమితికి లోబడిన డిస్కామ్ లకు ఆర్ ఇ సి మరియు పి ఎఫ్ సిలు వెంటనే రుణాలు మంజూరు చేస్తాయని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ పరిమితి దాటిన డిస్కాములకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ బకాయిలు, సబ్సిడీ రావలసి ఉన్నప్పుడు వారు కూడా రావలసిన మొత్తాల మేరకు రుణం పొందడానికి అర్హులు. ఈ రుణాలు దీర్ఘకాలికం మాత్రమే కాక డిస్కామ్ ల నిర్వహణ పెట్టుబడిగా ఇవ్వనందువల్ల అంతేకాక ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి పూచీ ఉన్నందున ఈ రుణానికి ఉదయ్ వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను వర్తింపజేయరాదు.
అంతేకాక ఉదయ్ యోజన కింద నిర్దేశించిన నిర్వహణ పెట్టుబడి పరిమితికి మించి ఇదివరకే వాడుకున్న లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యుత్ బకాయిలు, సబ్సిడీలు రావలసి లేని డిస్కామ్ లకు పరిమితి విషయంలో సడలింపు ఇవ్వవలసిందిగా ఆయా రాష్ట్రాలు భారత ప్రభుత్వాన్ని కోరవచ్చు.
కోవిడ్-19 మహమ్మారి తదనంతర లాక్ డౌన్ వల్ల విద్యుత్ రంగంపై ఆర్ధికంగా ప్రతికూల ప్రభావాన్ని చూపిందని, దానివల్ల నగదు సమస్యలు తలెత్తాయని, ఇప్పుడు ఈ విధంగా విద్యుత్ రంగంలోకి ద్రవ్యం పంపడం ద్వారా నగదు సమస్య తీరగలదని లేఖలో రాశారు. ఈ సొమ్ము డిస్కామ్ లు తాము జెన్కో , ట్రాన్స్ కో లకు ఇవ్వవలసిన బకాయిలను తీర్చడానికి పనికి వస్తుందని అన్నారు. ఆ విధంగా విద్యుత్ రంగంలో నగదు ప్రవాహ చక్రం మళ్ళీ తిరగడం మొదలవుతుంది.
డిస్కామ్ లకు ఇచ్చే రుణాలతో అవి జెన్కో / ట్రాన్స్ కో లకు , ఐ పి పి మరియు అక్షయ ఇంధన ఉత్పత్తిదారుల బకాయిలను తీర్చడానికి పనికి వస్తాయి. ఈ ప్యాకేజీ కింద ఇచ్చే మొత్తం సొమ్ము రూ. 90,000 కోట్లు. ఈ మొత్తాన్ని రూ. 45,000 కోట్ల చొప్పున రెండు విడతల్లో ఇస్తారని లేఖలో పేర్కొన్నారు.
డిస్కామ్ లకు మరింత ఊరట కలిగించడంతో పాటు వాటిని ఆర్హిక ఒత్తిడి నుంచి బయట పడవేసేందుకు డిస్కామ్ లు లాక్ డౌన్ సమయంలో తాము వాడుకోని విద్యుత్తుకు కూడా కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించవలసిన నిర్ణీత చార్జీల వసూలును వాయిదా వేయాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది; ఆ మొత్తాన్ని లాక్ డౌన్ తరువాత వడ్డీ లేకుండా మూడు వాయిదాల్లో చెల్లించవలసి ఉంటుంది లాక్ డౌన్ సమయంలో పారిశ్రామిక, వాణిజ్య యూనిట్లు మూసి ఉండటం వాళ్ళ విద్యుత్ డిమాండ్ బాగా పడిపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పి పి ఏ) ప్రకారం , విద్యుత్ వాడినా, వాడకపోయినా ఎంతయితే విద్యుత్ వాడుకుంటామని ఒప్పదం కుదుర్చుకున్నారో ఆ మొత్తానికి నిర్ణీత చార్జీలను డిస్కామ్ లు చెల్లించవలసి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో వాడని విద్యుత్తుకు కూడా సొమ్ము చెల్లించవలసి రావడం వాళ్ళ డిస్కామ్ లపై భారం పడింది.
అంతేకాక లాక్ డౌన్ కాలానికి అంతర్ రాష్ట్ర సరఫరా చార్జీలతో సహా నిర్ణీత చార్జీలలో 20-25 శాతం రిబేటు ఇవ్వాలని కూడా వారు సూచించారు. ఆ విధంగా ఆదా అయినా సొమ్మును వినియోగదారులకు ఇవ్వడం ద్వారా వారు చెల్లించవలసిన విద్యుత్ చార్జీలు తగ్గుతాయి.
***
(Release ID: 1624606)
Visitor Counter : 237