సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకోసం ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించిన ప్యాకేజీతో దేశీయ పరిశ్రమలు బలోపేతమవుతాయి: శ‌్రీ గడ్కరీ
Posted On:
13 MAY 2020 9:58PM by PIB Hyderabad
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకోసం ( ఎంఎస్ ఎంఇ) కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీని స్వాగతిస్తున్నట్టు కేంద్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరియు రోడ్డు రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. స్థానిక పరిశ్రమలకు నూతన జవసత్వాలిచ్చేలా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్యాకేజీ ప్రకటించారని ఒక వీడియో సందేశంద్వారా కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ తెలిపారు. ఆయన నాగపూర్ నుంచి ఈ సందేశాన్ని పంపారు.
గ్రామీణ పరిశ్రమల టర్నోవర్ 88 వేల కోట్లరూపాయలని..ఇది రానున్న రెండేళ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని శ్రీ గడ్కరీ తెలిపారు. ఆర్ధిక శాఖ మంత్రి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కారణంగా రూ. 5 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ అనే లక్ష్యాన్ని చేరుకుంటామని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఖాదీ రంగం గణనీయమైన పాత్ర పోషిస్తోందని ఇది ఇప్పటికే ఎగుమతుల రంగంలోకి ప్రవేశించిందని ఆయన అన్నారు.
ఎంఎస్ ఎంఇ రంగానికున్న నిర్వచనాన్ని మార్చడంపట్ల కేంద్ర మంత్రి శ్రీ గడ్కరీ సంతోషం ప్రకటించారు. పెట్టుబడుల పరిమితిని రూ. 100 కోట్లకు పెంచారని దీనివల్ల పరిశ్రమలకు బ్యాంకులనుంచి ఆర్ధిక సహాయం చాలా సులువుగా వస్తుందని అన్నారు. చాలా కాలంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఈ మార్పు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. కార్పస్ ఫండ్ పదివేల కోట్ల రూపాయలు కలిగిన ఈ మహా ఉద్దీపన ప్యాకేజీ కారణంగా 25 లక్షల ఎంఎస్ ఎంఈలు లబ్ధి పొందుతాయని శ్రీ గడ్కరీ వివరించారు.
ఎంఎస్ ఎం ఇ రంగం కారణంగా దేశంలో 11 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని, దేశ జిడిపిలో 29 శాతం ఈ రంగానిదేనని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ విషయాన్ని ఈ రంగానికి సంబంధించినవారు మరిచిపోవద్దని ఆయన సూచించారు. ఈ ప్యాకేజీ కారణంగా ఎంఎస్ ఎం ఇ, గ్రామీణ మరియు కుటీర పరిశ్రమలు నూతన శిఖరాలు అందుకుంటాయని శ్రీ గడ్కరీ దీమా వ్యక్తం చేశారు.
***
(Release ID: 1623947)
Visitor Counter : 266