సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా శుక్రవారం వర్చువల్ టూర్ నిర్వహిస్తున్న నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్

Posted On: 06 MAY 2020 8:42PM by PIB Hyderabad

గురుదేవ్ రబీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతిని పురస్కరించుకుని ఆయనను స్మరించుకుంటూ 2020 మే 7వ తేదీన నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ “గురుదేవ్ - జర్నీ ఆఫ్ ద మేస్ర్టో త్రూ హిజ్ విజువల్ వొకాబ్యులరీ” (గురుదేవ్- అద్భుతమైన చిత్ర‌కారుని దృశ్యరూపక భాషా ప్రయాణం” పేరిట వర్చువల్ పర్యటనను నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆయన మలచిన 102 కళాఖండాలను ఎన్ జిఎంఏ సగర్వంగా సమర్పిస్తోంది. దృశ్యమాధ్యమం ద్వారా ఆయన మనకి అందించిన అత్యంత విలువైన కళాఖండాల సందర్శన ఇందులో ఉంటుంది. ఎన్ జిఎంఏ సేకరించిన రబీంద్రనాథ్ ఠాగూర్ ప్రముఖ కళాఖండాలను చిత్తరువులు & ప్రధాన అధ్యయనం శీర్షికలో ప్రదర్శిస్తారు. వాటిలో హనుమాన్ - విభ్రాంతికరమైన ప్రకృతి ఒకటి.

 

ప్రపంచ  ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన సరికొత్త కరోనా వైరస్ (కోవిడ్-2019) ద్వారా ఏర్పడిన ముప్పును, అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన ఆదేశాలను పురస్కరించుకుని తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మ్యూజియం, గ్రంథాలయం రెండింటినీ మూసి వేశారు.
“కవి, నవలా రచయిత, చిత్రకారుడు అన్నింటికీ మించి 1913లో సాహిత్యంలో నోబెల్ పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు రబీంద్రనాథ్ ఠాగూర్ కు నివాళి అర్పించడం మా ప్రయత్నం. సందర్శకులు ఇంటిలోనే కూచుని ఠాగూర్ రచనలు, ఆయన సాహితీ ప్రయాణం గురించి తెలుసుకునేలా వర్చువల్ టూర్ సమర్పించడం నాకు గర్వకారణంగా ఉంది.  ఈ వర్చువల్ ప్రయాణం అనంతరం క్విజ్ కూడా ఆడే అవకాశం సందర్శకులకు ఉంది. మా ఐటి విభాగం అధిపతి శ్రీ ఎస్ఎస్ పాల్ ఈ వర్చువల్ టూర్ నిర్వహించాలన్న ఆలోచన చేసి అవిశ్రాంతంగా కృషి చేసి దానికి దృశ్యరూపం ఇచ్చినందుకు నేను గర్విస్తున్నాను. ఎన్ జిఎంఏ సేకరణలోని విలువైన కళాఖండాలను ఈ లాక్ డౌన్ నేపథ్యంలో సందర్శకులకు కనువిందుగా చూపేందుకు ఆయన ఈ వర్చువల్ టూర్ ఆలోచన చేశారు” అని ఎన్ జిఎంఏ డైరెక్టర్ జనరల్ శ్రీ అద్వైత చరణ్ గదానాయక్ అన్నారు.  

ఎన్ జిఎంఏ సేకరణలోని రవీంద్రుని కళాఖండాలను ఇందులో చూపించడంతో పాటు ఆయన సాహితీ రంగానికి అందించిన పలు గ్రంథాలకు సంబంధించిన వివరాలతో లిఖితపూర్వక కామెంటరీ కూడా జోడించారు.  ఎన్ జిఎంఏ 2018 సంవ‌త్స‌రంలో ప్రారంభించిన దేశంలోని తొలి సాంస్కృతిక మీడియా పోర్టల్ https://so-ham.in  ద్వారా ఈ లింక్ (https://so-ham.in/gurudev-journey-of-the-maestro-through-his-visual-vocabulary/) ను ద్వారా చివరిలో సందర్శకులు క్విజ్ లో కూడా పాల్గొనవచ్చు.

“గురుదేవ్” గా ప్రముఖుడైన రబీంద్రనాథ్ ఠాగూర్ (1861-1941) ఒక సంపన్నుల కుటుంబంలో జన్మించారు. సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యం వంటి భిన్న రంగాల్లో ఆయన చిన్న వయసులోనే ప్రవేశించారు. ఆయన రచించిన “గీతాంజలి” నవలకు 1913లో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఆయన. భారత, బంగ్లాదేశ్ జాతీయ గీతాలను కూడా ఆయన రచించారు. చిత్రలేఖనంపై ఆయన తనదైన ముద్ర వేయడంతో పాటు దానికి ఆధునికత, ఆచరణీయత కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 

రబీంద్రనాథ్ ఠాగూర్ రచయిత, కవి, నాటక రచయిత, తత్వవేత్త, సౌందర్యారాధకుడు, సంగీత కారుడు, నాట్యకారుడుగా  ప్రప్రథమంగా సుప్రసిద్ధుడు. 1928లో 67 సంవత్సరాల వయసులో ఆయన చిత్రకారుడుగా పరివర్తన చెందారు.

కవిగా తన ప్రయాణానికి ఇది పొడిగింపుగా ఆయన భావిస్తారు. తొలుత 20వ శతాబ్ది మధ్య కాలం నాటి తన చేతిరాత ప్రతులపై కొన్ని భాగాలు తొలగించడం లేదా కనిపించకుండా రుద్దడం వంటి ప్రయత్నం నుంచి ఆయన క్రమంగా స్వతంత్రంగా చిత్తరువులు గీసే కళాకారుడుగా మారారు.

1928-1940 మధ్య కాలంలో ఆయన రెండు వేలకు పైగా చిత్రాలు గీశారు. ఆయన తన చిత్రాలకు ఎప్పుడూ ఎలాంటి టైటిల్ ఇవ్వలేదు.  జ్ఞాపకాలు, మనసులోని ఆలోచనల ఆధారంగా ఆయన  సహజసిద్ధం, నాటకీయంగా చిత్రాలు గీసే వారు. ఆయన తన చిత్రాల ద్వారా ప్రపంచంలోని అద్భుతాలను ఆవిష్కరించకపోయినా అంతర్గత వాస్తవికతకు అవి దర్పణం పట్టేవి.

ఆయన చిత్రకళా రూపాలన్నింటినీ 1930లో పారిస్ లో తొలిసారిగా ప్రదర్శించారు. ఆ తర్వాత యూరప్, అమెరికాల్లో వాటిని ఏర్పాటు చేశారు. ఆ రకంగా వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రధానంగా పక్షులు, మనుషులు ఆయన చిత్రాల్లో ప్రముఖంగా కనిపించే వారు. ఆయన రచనల్లో ఆ కాలం నాటి వాస్తవికతతో పాటు చక్కని కవితాత్మకత కూడా కనిపించేంది.  ఆయన అనుసరించిన సృజనాత్మక స్వేచ్ఛ ఎంతో ఆకట్టుకునేది. ఆయన తన చిత్రాలకు ప్రాణం పోయడానికి రంగులు ఉపయోగించే విషయంలో ఎన్నడూ వెనుకాడలేదు.  బ్రష్ లు, వస్త్రం, ,నూలుతో పాటు చేతులను కూడా చిత్రలేఖనాలు, వర్ణచిత్రాల తయారీలో ఆయన ఉపయోగించే వారు. వ్యక్తిని ప్రపంచంతో అనుసంధానం చేసే వారధి చిత్రలేఖనంగా ఆయన భావించే వారు.  ఠాగూర్ వాస్తవానికి ఆధునికుడే అయినా ఆయన రచించిన చిత్రాల్లో ఆ కాలం నాటి వాస్తవికత ఉట్టిపడేది. యూరోపియన్ చిత్రకళలోని భావవ్యక్తీకరణ, ప్రాచీన సంస్కృతిలోని ప్రాచీనత ఆయనకు స్ఫూర్తిగా ఉండేవి.  ఊహాత్మక ధోరణి, లోతైన ఆలోచన, అంతర్గత భావం ఆయన చిత్రాలకు ప్రత్యేక స్వభావం ఆపాదించేది. ఆయన చిత్రాలు భారత చిత్రకారులకే కాకుండా ప్రపంచ చిత్రకారులకు కూడా స్ఫూర్తి కలిగించాయి.
 



(Release ID: 1621762) Visitor Counter : 156