నీతి ఆయోగ్
కోవిడ్ -19 పై పోరాటానికిగాను పలు రంగాల సంస్థలను భాగస్వాములను చేసిన కేంద్ర అత్యున్నత స్థాయి విభాగం ( ఎంపవర్డ్ గ్రూప్ 6)
Posted On:
04 MAY 2020 4:56PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిపై దేశవ్యాప్తంగా కనీ వినీ ఎరగని రీతిలో పోరాటం జరుగుతోంది. ఈ పోరాటాన్ని ఉధృతం చేసేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి విభాగాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఎంపవర్డ్‌గ్రూప్6 ( ఇజి 6) అని అంటున్నారు. దీనికి అధ్యక్షునికిగా నీతి ఆయోగ్ సిఇవో శ్రీ అమితాబ్ కాంత్‌ను నియమించారు. ఈ విభాగం దేశంలోని పౌరసంఘాలను , స్వచ్ఛంద సేవా సంస్థలను, పారిశ్రామిక సంస్థలను, అంతర్జాతీయ సంస్థలను ఒక వేదిక మీదకు తెచ్చి వాటిని వైరస్ మహమ్మారిపై పోరాటంలో భాగస్వాములను చేస్తోంది. ఇందులో భాగంగా అత్యున్నత స్థాయి కమిటీ 6 పలు మార్లు సమావేశమై అనేక విషయాలపై చర్చలు చేసి నిర్ణయాలు తీసుకుంది. దాదాపు 15 సమావేశాలు జరిగాయి.
దేశవ్యాప్తంగా వున్న 92 వేల సిఎస్ వోలు / ఎన్ జివోలను భాగస్వాములను చేశారు. వారి ద్వారా పలు సామాజిక అంశాలకు సంబంధించి ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహింప చేశారు. పోషణ, ఆరోగ్య, పారిశుద్ధ్యం, విద్య..ఇలా పలు అంశాల్లో సేవలు జరుగుతున్నాయి. ఈ 92 వేల ఎన్ జీవోలు / సిఎస్ వోలకు ప్రత్యేక విజ్ఞప్తి చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, జిల్లా అధికారులకు సహాయంగా వుండేలా చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అమలు కావడానికి వారి సాయం తీసుకోవడం జరిగింది.
ఎన్టీవోల సేవలను ఉపయోగించుకోవడానికి, వారికి వచ్చే సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని ప్రతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కోరారు. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ పని చేశాయి. రాష్ట్ర స్థాయి నోడల్ ఆఫీసర్ ఆయా ఎన్జీవోలు, సిఎస్‌వోలతో మాట్లాడి వారిని సహాయక కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. అలాగే జిల్లా స్థాయి పాలనా యంత్రాంగాలు కూడా వారి పరిధిలోని ఎన్జీవోల వనరులను ఉపయోగించుకునేలా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సూచించడం జరిగింది. ఒకరు చేసే పనిని మరొకరు చేయకుండా చూడాలని, అన్ని వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని కోరారు.
ఫుడ్ కార్పొరేషన్ గోడౌన్లనుంచి సబ్సిడీ రేట్లకు బియ్యం, గోధుమలను కొనుగోలు చేసి ఆయా ఎన్జీవోల ద్వారా ప్రజలకు పంపిణీ చేయించడం జరిగింది.
ఆక్షయ పాత్ర, రామ కృష్ణ మిషన్, టాటా ట్రస్టులు, పిరమిల్ ఫౌండేషన్, పిరమిల్ స్వస్థ్య, బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్, యాక్షన్ ఎయిడ్, ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ సెంటర్, ప్రధాన్, ప్రయాస్, హెల్పేజ్ ఇండియా, సేవా, సులభ్ ఇంటర్నేషనల్, ఛారిటీసీ ఎయిడ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, గౌడియా మఠ్, బచపన్ బచావో ఆందోళన్, ది సాల్వేషన్ ఆర్మీ, కాథోలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ...ఇలా అనేక సంస్థలు ప్రశంసనీయ పాత్రను నిర్వహిస్తున్నాయి.
కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసి వలస కార్మికుల ఆకలిని తీరుస్తున్నాయి. అంతే కాదు పారిశుద్ధ్యం, సామాజిక దూరం తదితర విషయాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాయి. శానిటైజర్లు, సబ్బులు, మాస్కులు, గ్లోవ్స్ తదితర వస్తువులను విస్తృతంగా ఆరోగ్యరంగ కార్యకర్తలకు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలకు పంచుతున్నారు. ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వానికి సాయం చేస్తున్నాయి. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రజలకు సేవ చేయడానికి ఈ స్వచ్ఛంద సంస్థల సేవలను విరివిగా వాడుకోవడం జరుగుతోంది.
అయితే ప్రాధమికంగా ఆందోళన కలిగించిన విషయం వలస కార్మికులు, కూలీలు భారీ సంఖ్యలో పట్టణ, నగర ప్రాంతాలనుంచి తమ తమ గ్రామాలకు వెళ్లడానికి బైటకు రావడంతో వారిని అదుపులో వుంచడం కష్టమైంది. ఈ విషయంలో ఆయా ఎన్జీవోలు తమ తమ ప్రాంతాల్లోని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి సమన్వయం చేసుకొని పని చేస్తున్నారు. వలస కార్మికులు, కూలీలు వారి వారి ప్రాంతాలకు వెళ్లడానికి సాయం చేస్తున్నారు.
ఇక తర్వాతి దశలో ఎన్జీవోలు, పౌర సంఘాలు ప్రజల్లో ఒక ముఖ్యమైన విషయంపై అవగాహన పెంచడానికిగాను అత్యున్నత స్థాయి విభాగం6 ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. అదేంటంటే కోవిడ్ -19 బాధితులపట్ల ప్రజల్లో వున్న దురభిప్రాయాలను తొలగించి ఈ మహమ్మారి వైరస్ బారిన వృద్ధులు పడకుండా చూడడానికి కృషి చేయడానికిగాను కసరత్తు చేస్తోంది.
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా దేశంలో వెనకబడిన 112 జిల్లాల్లో పలు కార్యక్రమాలు నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇవి కనీవినీ ఎరగని రీతిలో విజయం సాధిస్తున్నాయి. ఈ 112 జిల్లాల్లో ఇంతవరకూ 610 కేసులు మాత్రమే నమోదయ్యాయి. జాతీయ స్థాయి కేసుల రేటుతో పోల్చితే ఇది తక్కువ.
భారతదేశంలోని పలు అంతర్జాతీయ సంస్థలతో మాట్లాడి వారి సేవలను దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ఇందుకోసం మొదటగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని అత్యున్నతస్థాయి విభాగం ( ఇజి 6)...ఐక్యరాజ్యసమితికి చెందిన ఏజెన్సీలను భాగస్వాములను చేసింది. అంతే కాదు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ ల సాయం కూడా తీసుకున్నారు. వైద్య ఆరోగ్య రంగానికి చెందిన సేవలను తీసుకోవడం జరిగింది. శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దేశంలోని ఐదు వందల జిల్లాల్లో రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన 40 వేల మంది కార్యకర్తలు పని చేస్తున్నారు.
ఎన్జీవోలు, అంతర్జాతీయ సంస్థలతోపాటు దేశంలోని పారిశ్రామిక, వాణిజ్య సంస్థల సాయం కూడా తీసుకోవడం జరుగుతోంది. ఈ సంక్షోభాన్నించి దేశాన్ని బైటపడేయడానికిగాను నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని ఇజి 6 విభాగమనేది అన్ని జాగ్రత్తలు తీసకుంటూ ఆయా వ్యాపార వాణిజ్యం సంస్థల ను భాగస్వాములను చేయడం జరుగుతోంది. కోవిడ్ -19 కారణగా ఏర్పడిన పలు సవాళ్లను ఎదుర్కోవడం జరుగుతోంది. ప్రైవేట్ రంగంలోని స్టార్టప్‌ల సాయం తీసుకుంటున్నాం. పలు రంగాల్లో ఏర్పడిన స్తబ్ధతను తొలగిండానికిగా విశేషంగా కృషి చేయడం జరుగుతోంది. ప్రభుత్వంతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్న ప్రైవేటు వైద్య ఆరోగ్య రంగం ఈ సంక్షోభ సమయంలో అనేక విధాలుగా సాయం చేస్తోంది. అలాగే ప్రముఖ తయారీ సంస్థలు వెంటిలేటర్ల తయారీ రంగంలోకి వచ్చాయి. వాటిని భారీ స్థాయిలో తయారు చేస్తున్నాయి. ఇవి కోవిడ్ -19 పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. టాటా, మహింద్రా అండ్ మహింద్రా, భారత్ ఫోర్జ్, మారుతి సుజుకి, అశోక్ లే ల్యాండ్, హీరో మోటో కార్ప్, గోద్రెజ్, సుందరమ్ ఫాస్టనర్స్ మొదలైన సంస్థలు వెంటిలేటర్ల తయారీని ప్రారంభించాయి. సిఐఐ, ఫిక్కి, నాస్కామ్ సంస్థలు దేశవ్యాప్తంగా సహాయ చర్యల్లో తమ వంత పాత్ర పోషిస్తున్నాయి.
పలు స్టార్టప్‌లు తమ సాంకేతికత సాయంతో కోవిడ్ -19 పైపోరాటంలో చక్కటి సేవలు అందిస్తున్నాయి. రోబోట్లను కూడా ఈ పోరాటంలో భాగం చేశారు. డ్రోన్ కెమెరాల ద్వారా సామాజిక దూరం ఎలా వుందో పర్యవేక్షించడం జరుగుతోంది. కొన్ని స్టార్టప్‌లు తక్కువ ధరకు వెంటిలేటర్ల తయారీని ప్రారంభించాయి. ఆశా కార్యకర్తలు కూడా ఉపయోగించగలిగేలా కొన్ని చోట్ల వెంటిలేటర్లు తయారవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తయారు చేయించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ప్రత్యేకతలను వివరించి దీని వినియోగం పెంచడం జరిగింది. బ్లూటూత్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీన్ని తయారు చేశారు. విడుదల చేసిన ఒక రోజులోనే 80 మిలియన్లు డౌన్లోడ్ అయ్యాయంటే దీని ప్రాధాన్యత ఏంటో తెలిసిపోతుంది.
ఇక వైద్య ఆరోగ్య రంగంలో ఉపయోగించే ఎంతో విలువైన అనేక పరికరాలను ఆయా సంస్థలద్వారా ఆసుపత్రులకు, వైద్య ఆరోగ్య సిబ్బందికి ఇప్పించడంలో అత్యున్నత స్థాయి విభాగం ( ఇజి 6 ) కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా అనేక ఎన్జీవోలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పారిశ్రామిక సంస్థలను అనుసంధానం చేసి అనేక విధాలుగా వారి సేవలను మహమ్మారి వైరస్‌పై పోరాటానికి ఉపయోగించుకోవడం జరుగుతోంది.
***
(Release ID: 1621144)
Visitor Counter : 494