ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ప్రతికూలతలోనూ కొత్త అవకాశాలను అన్వేషించాలని ఎలక్ర్టానిక్స్ పరిశ్రమకు శ్రీ రవిశంకర్ ప్రసాద్ పిలుపు

దేశంలో 8 కోట్ల మొబైల్ ఫోన్లకు చేరిన ఆరోగ్య సేతు యాప్

ఎలక్ర్టానిక్స్ సిస్టమ్స్, తయారీ రంగంలో ప్రపంచావకాశాలు అందుకోవడానికి పునఃప్రారంభం, పునరుద్ధరణ, పునరుజ్జీవం వ్యూహం ఆవిష్కరించిన పరిశ్రమ ప్రతినిధులు

Posted On: 29 APR 2020 8:41PM by PIB Hyderabad

ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితులను సరికొత్త అవకాశంగా మార్చుకోవాలని, ఎలక్ర్టానిక్స్ తయారీకి భారత్ ను కేంద్రంగా మార్చడానికి కృషి చేయాలని కేంద్ర ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్ ఎలక్ర్టానిక్స్ పరిశ్రమను కోరారు. ప్రపంచ దేశాల నుంచి ఎలక్ర్టానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకాలను, అందుబాటులోకి వచ్చిన కొత్త అవకాశాలను ఉపయోగించుకోవాలని, ఆ రంగాన్ని బలోపేతం చేయాలని ఆ విభాగానికి చెందిన పారిశ్రామిక సంఘాలు, మండలులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశంలో ఆయన సూచించారు. పూర్తి స్థాయి పునరుజ్జీవం సాధించడంలో మెడికల్ ఎలక్ర్టానిక్స్ పరిశ్రమ నిర్వహించవలసిన పాత్ర గురించి ఆయన సవివరంగా తెలిపారు.

మంత్రిత్వ శాఖ అధికారులు కోవిడ్-19 కారణంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి, ఆరోగ్య సేతు యాప్ గురించి వివరిస్తూ దేశంలో 8 కోట్ల మంది మొబైల్ వినియోగదారులకు ఆరోగ్య సేతు యాప్ చేరడానికి మొబైల్ పరిశ్రమ కృషికి ధన్యవాదాలు తెలిపారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక దృక్పథాలన్నింటిలోనూ కోవిడ్-19 ప్రభావం అతి తక్కువగా ఉండేలా చేసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి వారు వివరించారు. దేశంలోని ప్రధాన ఎలక్ర్టానిక్ జోన్లు నోయిడా, గ్రేటర్ నోయిడా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి అధిక రిస్క్ గల ప్రాంతాల్లోనే ఉన్నందు వల్ల స్థానిక ఆంక్షల కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఎలక్ర్టానిక్స్ పరిశ్రమను ప్రోత్సహించేందుకు కొత్త పథకాలు, కోవిడ్-19పై ఎస్ఒపి మార్గదర్శకాల రూపకల్పనలో ఎలక్ర్టానిక్స్ పరిశ్రమ పాత్రను అధికారులు ప్రశంసించారు.

ఐసిటి ఉత్పత్తులు, వాటి రిటైల్/ ఆన్ లైన్ అమ్మకాలు, ఐసిటికి సంబంధించిన అత్యవసర వస్తువులు విక్రయించే అధీకృత దుకాణాలు, సర్వీస్ సెంటర్లను కూడా నిత్యావసర వస్తువుల పరిధిలోకి తీసుకురావాలంటూ పరిశ్రమ చేసిన విజ్ఞప్తులను ఇప్పటికే హోమ్ మంత్రిత్వ శాఖకు పంపినట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఎలక్ర్టానిక్స్ తయారీని ప్రోత్సహించడానికి తమ శాఖ కొత్తగా నోటిఫై చేసిన పథకాల కింద కేంద్ర ప్రభుత్వం ఇఎస్ డిఎం పరిశ్రమకు రూ.50 వేల కోట్లు ఆర్థిక సహాయం అందించనున్నదని చెప్పారు. అలాగే తమ శాఖకు చెందిన ఆరోగ్య సేతు, ఆధార్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు కోవిడ్-19పై పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అన్నారు.

ఇఎస్ డిఎం రంగం అంతర్జాతీయ అవకాశాలను అందుకోవాలంటే అనుసరించాల్సిన పునః ప్రారంభం, పునరుద్ధరణ, పునరుజ్జీవం నమూనాను పరిశ్రమ ప్రతినిధులు సవివరంగా తెలియచేశారు. ఎలక్ర్టానిక్స్ తయారీ రంగానికి మద్దతుగా పిఎల్ఐ, స్పెక్స్, ఇఎంసి2.0 అనే మూడు భాగాలతో మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త ట్రయాలజీ పథకాన్ని వారు ప్రశంసించారు. ఫ్యాక్టరీల పని, లాజిస్టిక్స్, ఎగుమతులు, సరఫరాల వ్యవస్థకు ఏర్పడుతున్న అవరోధాలు, కోవిడ్-19 కారణంగా ఏర్పడిన డిమాండు క్షీణత గురించి వారు వివరించారు.

పరిశ్రమకు పూర్తి మద్దతు ఇవ్వాలని, ఎలక్ర్టానిక్స్ తయారీ పరిశ్రమలను పునః ప్రారంభించేందుకు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమన్వయం జరపాలని మంత్రిత్వ శాఖ అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

ఐటి తయారీదారుల సంఘం;  భారత సెల్యులార్, ఎలక్ర్టానిక్స్ సంఘం;  భారత ఎలక్ర్టానిక్స్ పరిశ్రమల సంఘం;  భారత ఎలక్ర్టానిక్స్, సెమీ కండక్టర్ల సంఘం;  వినియోగ ఎలక్ర్టానిక్స్, అప్లయెన్స్ తయారీదారుల సంఘం, భారత ప్రింటెడ్ సర్క్యూట్ సంఘం, విద్యుత్ దీపాలు, విడిభాగాల తయారీదారుల సంఘం, భారత పరిశ్రమల సమాఖ్య;  ఫిక్కి, అసోచాం;  భారత ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్;  మెడికల్ పరికరాల తయారీ పరిశ్రమ సంఘం;  టెలికాం పరికరాల తయారీదారుల సంఘం;  పిహెచ్ డి చాంబర్స్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ర్టీ లిమిటెడ్ వంటి ప్రముఖ సంఘాలు, సంస్థల ప్రతినిధులు;  మొబైల్, వినియోగ ఎలక్ర్టానిక్స్, టెలికాం రంగాల ప్రముఖులు;  యాపిల్, సామ్ సంగ్, షామి, ఫాక్స్ కాన్, లవా, విస్ర్టాన్, ఒప్పో, ఫ్లెక్స్, స్టెరైల్, మైక్రోమాక్స్, దేకి ఎలక్ర్టానిక్స్, తేజస్ నెట్ వర్క్స్, పానాసోనిక్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

***
 


(Release ID: 1619518) Visitor Counter : 198