వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
Posted On:
25 APR 2020 4:09PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా కుటుంబానికి నెలకు ఒక కిలో చొప్పున దాదాపు 2 కోట్ల కుటుంబాలకు మూడు నెలల పాటు కాయధాన్యం (పప్పు) పంపిణీకి కాయలు మర ఆడించి, రవాణా చేసే పనులు సాగుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజల పౌష్టిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ ఎఫ్ ఎస్ ఏ) కింద గుర్తింపు పొందిన ప్రతి కుటుంబానికి నెలకు ఒక కిలో చొప్పున మర ఆడించి శుభ్రం చేసిన పప్పును పంపిణీ చేయాలని నిర్ణయించింది.
కేంద్ర ప్రభుత్వ వినియోగదారుల శాఖ మార్గదర్శకత్వంలో 'నాఫెడ్' ఈ కార్యాన్ని నిర్వహిస్తుంది. కేంద్ర /రాష్ట్ర ప్రభుత్వ గోదాముల నుంచి కాయధాన్యాలను తీసుకొని భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (ఎఫ్ ఎస్ ఎస్ ఎ ఐ) ప్రామాణిత రీతిలో మరఆడించి శుభ్రం చేసి రాష్ట్రాలకు చేర్చవలసిన బాధ్యత 'నాఫెడ్'ది. ఆ తరువాత సిద్ధంగా ఉన్న పప్పును రాష్ట్ర ప్రభుత్వ గోదాములకు ఆ తరువాత పంపిణీకోసం రేషన్ షాపులకు పంపుతారు.
స్థానికంగా లభ్యమయ్యే కాయ ధాన్యాలను తీసుకొని స్థానిక మిల్లర్ల చేత మర ఆడిస్తారు. మిల్లర్లను 'నాఫెడ్' సంస్థ ఆన్ లైన్ ఆక్షన్లు నిర్వహించి ఓ టి ఆర్ బిడ్ల ద్వారా ఎంపిక చేస్తుంది. కాయ ధాన్యాలు మర ఆడించి పప్పు చేసినందుకు మిల్లర్లకు ఎలాంటి చార్జీలు ఇవ్వరు. ప్రతి క్వింటాల్ కాయలకు ఎంత పప్పు ఇస్తారో వారు చెప్పాల్సి ఉంటుంది. కాయలు తీసుకోవడం దగ్గరనుంచి అన్ని ఖర్చులను మిల్లర్లే భరించాలి. మిల్లర్లను బృందాలుగా ఏర్పరుస్తారు. రేషన్ షాపులకు పంపిణీ చేసేందుకు అయ్యే అన్ని ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.
ఈ కార్యక్రమం ఎంత బృహత్తరమైనదంటే ఆహార ధాన్యాల రవాణా కన్నా చాలా పెద్దది మరియు సంక్లిష్టమైనది. ప్రతి కిలో కాయధాన్యం కనీసం లారీలో మూడు ట్రిప్పులు (కొన్ని చోట్ల నాలుగు ట్రిప్పులు) వేయవలసి ఉంటుంది మరియు ప్రతిసారి సరుకు ఎత్తడం /దించడం సరేసరి. దూర ప్రాంతాలకు గూడ్సు రైళ్ల ద్వారా రవాణా చేస్తుండగా, చాలా చోట్లకు రోడ్డు మార్గంలో ట్రక్కుల ద్వారా పంపడం జరుగుతుంది. దేశ ప్రజలకు 5.88 లక్షల మెట్రిక్ టన్నుల పప్పును పంపిణీ చేయడానికి దాదాపు 8.5 లక్షల మెట్రిక్ టన్నుల కాయ ధాన్యాల రవాణా చేయవలసి ఉంటుంది. దాదాపు 165 'నాఫెడ్' గోదాములలో ఉన్న తమ స్టాకును ఈ స్కీము కోసం వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నాఫెడ్ ఇందుకోసం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 100 పప్పు మిల్లులను రంగంలోకి దింపింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తింపు పొందిన కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు ప్రతి నెలా 1.96 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు అవసరమవుతుంది. దానిలో మూడు వంతులు (అంటే 1.45 లక్షల మెట్రిక్ టన్నులు) పప్పును రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలకు ఇవ్వజూపారు. తమ పరిధిలో ఉన్న మిల్లుల నుంచి సిద్ధంగా ఉన్న పప్పు తీసుకొని పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నో రాష్ట్రాలను కేంద్రం కోరింది.
రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ నెల కోటాలో మూడవ వంతు పంపిణీ కోసం ఇప్పటికే గమ్య స్థానాలకు చేర్చాయి. 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు - ఆంద్ర ప్రదేశ్, అస్సాం, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్స్, చండీగఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు , తెలంగాణ పంపిణీ మొదలెట్టాయి. సామాజిక దూరం, భద్రతా కారణాల దృష్ట్యా మే నెల మొదటివారంలో ఆహార ధాన్యాల పంపిణీతో పాటు పప్పు పంపిణీ చేయాలని అనేక రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు నిర్ణయించాయి. ఇప్పటి వరకు 30వేల మెట్రిక్ టన్నుల పప్పును పంపిణీ చేశారు. మే మొదటి వారంలో వేగమందుకోగలదని అంటున్నారు. అండమాన్స్ , చండీగఢ్ , దాద్రా నాగర్ హవేలీ , గోవా , లద్దాఖ్, పుదుచ్చేరి, లక్షాద్వీప్ మరియు పంజాబ్ వంటి చిన్న రాష్ట్రాలకు మూడు నెలలకు సరిపోయినంత పప్పు కోటాను కేంద్రం ఒక్కసారే విడుదల చేసింది.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తోడ్పాటుతో వినియోగదారుల వ్యవహారాల శాఖ రాష్ట్రాలతో పప్పు పంపిణీని సమన్వయంతో చేపట్టేందుకు జాయింట్ సెక్రెటరీల ఆధిపత్యంలో ఐదు అధికారుల బృందాలను ఏర్పాటు చేసింది. రెండు శాఖల కార్యదర్శులు రోజువారీ ప్రగతిని సమీక్షిస్తున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రెటరీ ఈ పంపిణీని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
వినియోగదారుల వ్యవహారాల శాఖ పప్పు పంపిణీకి ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారి. నాలుగు వారాలకు పైగా సాగే ఈ మహత్తర కార్యంలో దాదాపు రెండు లక్షల లారీ ట్రిప్పులు సరుకు నింపడం/దింపడం ఉంటాయి సాధారణ పరిస్థితుల్లో అయితే ఇంత పెద్ద పని చేయడం అత్యాశ అవుతుంది. కానీ ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో దాల్ మిల్లులు, గోదాములు కరోనా ప్రభావిత ప్రాంతాలలో ఉన్నప్పుడు అది సవాళ్లతో కూడుకున్న పని కాగలదు. అలాంటి చోట పనులు సురక్షితంగా నిర్వహించడం చాలా కీలకం. దానికి తోడు ట్రక్కులు, సరుకులు ఎత్తి , దించే కూలీలు దొరకడం మరో పెద్ద సమస్య.
లభ్డిదారులలో చాలా మందికి మొదటి నెల కోటా ఏప్రిల్ నెలలో గాని లేదా మే మొదటి వారంలో గాని అందుతుంది. అనేక రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం మూడు నెలల కోటాను ఒకే సారి పంపిణీ చేస్తాయి. మిగిలిన రాష్ట్రాలలో మే నెల మూడవ వారం లోగా మూడు నెలల కోటాను పంపిణీ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల సంసిద్ధతను వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి శుక్రవారం 24 ఏప్రిల్, 2020న సమీక్షించారు. ఈ విషయంలో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు అందిస్తున్న సహకారానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేవారంలో పంపిణీ ఊపందుకోగలదనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.